హైదరాబాద్‌లోని పల్లవి, ఢిల్లీ పబ్లిక్ స్కూళ్లలో ఎంఎస్ ధోని అకాడమీ ప్రారంభం అయింది. నాచారం పబ్లిక్ స్కూల్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఎంఎస్‌డీసీఏ-ఆర్కా ఎండీ మిహిర్ దివాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ.. ధనాధన్ బ్యాటింగ్, బాధ్యతయుతమైన నాయకత్వంతో మిస్టర్ కూల్ కెప్టెన్‌గా పేరు ప్రఖ్యాతులు గడించిన దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ వెంచర్‌లోని ఎంఎస్‌డీసీఏ క్రికెట్ అకాడమీని హైదరాబాద్‌లో ప్రారంభిస్తుండడం గొప్ప విషయం అన్నారు.
ఎంఎస్‌డీసీఏతో రెండేళ్ల కాలానికి కుదుర్చుకున్న ఒప్పంద పత్రాలను ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారం, పల్లవి విద్యాసంస్థల చైర్మన్ మల్కా కొమరయ్య, మిహిర్ దివాకర్ మల్లారెడ్డి సమక్షంలో మార్చుకున్నారు. ఆ తర్వాత మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఎంఎస్‌డీసీఏ ఏర్పాటుకు చొరవ తీసుకున్న కొమరయ్యను మంత్రి మల్లారెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ అకాడమీని ఉన్నత ప్రమాణాలతో నడుపుతూ భవిష్యత్‌లో ధోనీ వంటి ఉత్తమ క్రికెటర్లను టీమిండియాకు అందించాలని ఆయన ఆకాంక్షించారు.
క్రికెటర్ కావాలనే ఆశయమున్న పిల్లలు, యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ అందించాలనే ఉద్దేశంతో ‘ఎంఎస్‌డీసీఏ’ను స్థాపించినట్టు సంస్థ ఎండీ మిహిర్ చెప్పారు. దేశంలోని ప్రతిభ గల క్రికెటర్లకు ప్రణాళికబద్దమైన శిక్షణ అందించాలనేది తమ అభిమతమన్నారు. ఇందులో భాగంగానే పల్లవి, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యాసంస్థలతో కలిసి హైదరాబాద్, దాని చుట్టు పక్కల పది అకాడమీలు ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు.
తొలిదశలో భాగంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నాచారంలో ఈ నెలాఖరు నుంచి శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నాదర్‌గుల్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్ గండిపేట, బోడుప్పల్ బ్రాంచీల్లో వచ్చే నెలలో అకాడమీలు తెరవనున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లోని ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా అకాడమీలు తెరిచే ఆలోచనలు ఉన్నట్లు పేర్కొన్నారు.
‘నిబద్ధత, విలువలతో కూడిన శిక్షణ, సమష్ఠి కృషి, ఆటను ఆస్వాదించడం, కొత్త విషయాలను అన్వయించుకోవడమనే సూత్రాల ఆధారంగా ధోని అకాడమీ శిక్షణ ఉంటుంది. నిష్ణాతులైన కోచ్‌లు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ఉన్నత ప్రమాణాలతో కూడిన శిక్షణను దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని భావి, వర్ధమాన క్రికెటర్లకు చేరువ చేయాలని లక్ష్యంతో అకాడమీ పనిచేస్తోంది. ఎంఎస్‌డీసీఏ కోచింగ్ మాడ్యూల్‌ను ధోనీ సూచనల మేరకు ఎప్పటికప్పుడు మాడిఫై చేస్తాం. ధోనీ అనుమతి ఇచ్చాకనే కోచింగ్ మాడ్యూల్‌ను అకాడమీల్లో ప్రవేశపెడతాం.’ అని మిహిర్ వివరించారు.
విద్యతో పాటు క్రీడలకూ సమప్రాధాన్యం ఇవ్వాలనేది తమ విద్యాసంస్థల ప్రథమ లక్ష్యమని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్స్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం) చైర్మన్ మల్కా కొమరయ్య అన్నారు. అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ప్లేయర్లు సుమిత్-సిక్కి రెడ్డి, రోలర్ స్కేటింగ్‌లో అనూప్ యమ, షూటింగ్‌లో గగన్ నారంగ్ తమ విద్యాసంస్థల్లో ఇప్పటికే అకాడమీలను నడుపుతున్నారని పేర్కొన్నారు. వీటితో పాటు అంతర్జాతీయ ప్రమాణాలతో తమ విద్యాసంస్థలో క్రికెట్ అకాడమీలనూ ఏర్పాటు చేయాలనే ఆలోచనతో భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అకాడమీ (ఎంఎస్‌డీసీఏ)తో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు. ‘ఆర్కా సంస్థ ఆధ్వర్యంలో ధోని అకాడమీ కార్యకలాపాలు జరగనున్నాయి. ప్రతిభ, ఆసక్తి, క్రికెటర్ కావాలనే బలమైన ఆకాంక్ష గల పిల్లలకు ఇది ఒక అద్భుతమైన వేదిక. ఈ సువర్ణావకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి.’ అని సూచించారు.