Gukesh D Picks MS Dhoni And Tennis Great As Inspirations: ఫిడే క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో టైటిల్‌ నెగ్గి చరిత్ర సృష్టించిన భారత యువ సంచలనం గుకేశ్‌(D Gukesh) తనకు ప్రేరణగా నిలిచిన వారు ఎవరూ బహిర్గతం చేశాడు. తన కెరీర్‌ను తీర్చిదిద్దడంలో దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌(Viswanath Anand) పాత్ర ఎంతో ఉందని గుకేష్‌ చెప్పాడు. దిగ్గజాలు ధోనీ(MS Dhoni), జొకోవిచ్‌(Novak Djokovic)ను తానెంతో అభిమానిస్తానని చెప్పాడు. ఎంతో ఒత్తిడిలో అత్యుత్తమ ప్రదర్శన చేసే వారిద్దరూ తనకు స్ఫూర్తి అని అన్నాడు. క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నీలో ఆరంభం నుంచి మంచి లయతోనే ఉన్నానని... గెలుస్తాననే ఆత్మవిశ్వాసంతోనే ముందుకు సాగానని గుకేశ్‌ తెలిపాడు. ఈ టోర్నీ గెలవడంలో సాయపడ్డ తన తల్లిదండ్రులు, కోచ్‌, కుటుంబం, పాఠశాల, తమిళనాడు ప్రభుత్వానికి గుకేశ్‌ ధన్యవాదాలు తెలిపాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ లేకపోతే ఈ స్థాయికి వచ్చేవాణ్నే కాదని గుకేశ్‌ అన్నాడు. వెస్ట్‌బ్రిడ్జ్‌ ఆనంద్‌ చెస్‌ అకాడమీలో శిక్షణ పొందిన గుకేశ్‌.. ఆనంద్‌ తర్వాత క్యాండిడేట్స్‌ టోర్నీ గెలిచిన తొలి భారత ఆటగాడిగా నిలిచాడు. తన కెరీర్‌లో విశ్వనాథన్‌ ఆనంద్‌ ప్రధాన పాత్ర పోషించారని... ఆయన అకాడమీ నుంచి ఎంతో లబ్ధి పొందానని... ఆయనకు రుణపడి ఉంటానని గుకేశ్‌ తెలిపాడు. ఆయన లేకపోతే ఈ స్థాయి కాదు కదా దరిదాపుల్లోకి కూడా వచ్చేవాణ్ని కాదని తెలిపాడు.


 

ఆ ఓటమితోనే...

ఓ ఓటమి తనకు ప్రేరణగా నిలిచిందని గుకేశ్‌ వెల్లడించాడు. ఇరాన్‌కు చెందిన గ్రాండ్‌మాస్టర్‌ ఫిరౌజ్జా అలిరెజాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ టోర్నీలో ఏడో రౌండ్‌లో అలిరెజా చేతిలో గుకేశ్‌ ఓడిపోయాడు. ఈ ఓటమే తనను ఛాంపియన్‌గా అయ్యేందుకు శక్తిని అందించిందని గుకేశ్‌ తెలిపాడు

ఈ టోర్నీ ప్రారంభం నుంచి తాను చాలా సానుకూలంగా ముందుకు సాగినా  అలీరెజాపై ఏడో రౌండ్ ఓటమి తర్వాత తీవ్రంగా కలత చెందనన్నాడు . కానీ ఈ పరాజయమే తనకి శక్తిని, ప్రేరణను అందించిందన్నాడు. అంతే కాదు ఓడిపోయిన తర్వాత సరైన పనిని కొనసాగిస్తే, సరైన మానసిక స్థితిలో ఉంటే విజయం సాధించగలమని తను  నమ్మానన్నాడు. విశ్వనాథన్‌ ఆనంద్‌ తనను అభినందించడం ఆనందంగా ఉందన్న గుకేశ్‌.. త్వరలోనే తనను కలుస్తానని అన్నాడు. తన తల్లిదండ్రులు  పట్టరాని సంతోషంగా ఉన్నారని తెలిపాడు. 

 

13వ రౌండ్‌ నాటికి మొత్తం 8.5 పాయింట్లతో ఒంటరిగా ఆధిక్యంలో నిలిచిన అతడు.. అమెరికాకు చెందిన హికరు నకమురతో జరిగిన 14వ రౌండ్‌ను డ్రా చేసుకున్నాడు. దీంతో అతడి ఖాతాలో 9 పాయింట్లు చేరాయి.  నెపోమ్నియాషి (రష్యా) - ఫాబియానో కరువానా (అమెరికా) మధ్య మ్యాచ్‌ కూడా డ్రా అయింది. వారిద్దరూ 8.5 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యారు. దీంతో భారత యువ చెస్‌ ప్లేయర్ గుకేశ్‌ టైటిల్‌ను సాధించాడు. ఈ విజయంతో ప్రపంచ చాంపియన్‌ టైటిల్‌ పోరుకు అర్హత సాధించిన రెండో భారతీయుడిగా, మొదటి టీనేజర్‌గా గుకేశ్‌ నిలిచాడు.