Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ చరిత్ర సృష్టించింది. 72 ఏళ్ల ఆసియా క్రీడల్లో తొలి సారి 100 పతకాలను కైవసం చేసుకుంది. 2018 ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు 70 పతకాలు సాధించగా ఇప్పుడు సెంచరీ కొట్టేశారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ భారత క్రీడాకారులను శనివారం ప్రశంసించారు. దేశానికి అవార్డులు తెచ్చిన క్రీడాకారులను అభినందిస్తూ.. క్రీడలలో వారి ప్రదర్శన చాలా గొప్పదని అన్నారు.






భారత ఆటగాళ్లు ఈ అద్భుతాన్ని సాకారం చేసినందుకు గాను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ట్విట్టర్‌ వేదికగా పోస్ట్ చేసిన ప్రధాని.. ప్లేయర్స్‌ను ప్రశంసించారు. ఆసియా క్రీడల్లో భారత్‌ అద్భుత విజయం సాధించిందని తెలిపిన ప్రధాని, భారత్‌ 100 పతకాల మైలు రాయిని చేరుకున్నందుకు భారత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. భారత్‌ ఈ చారిత్రాత్మక మైలురాయిను సాధించడానికి కారణమైన క్రీడాకారులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.


క్రీడాకారుల అద్భుత ప్రదర్శన విస్మయం కలిగించడమే కాకుండా, దేశ ప్రజల హృదయాలను గర్వంతో నింపిందని ప్రధాని అభివర్ణించారు. ఇక అక్టోబర్ 10వ తేదీన ఆసియా క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులను ప్రధాని కలవనున్నారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన ప్రధాని.. దేశ ఖ్యాతిని పెంచిన క్రీడాకారులతో మాట్లాడడానికి తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని మోదీ ట్వీట్ చేశారు.


ఈ రోజు ఉదయం, భారత బృందం విలు విద్య, మహిళల కబడ్డీలో మూడు వరుస బంగారు పతకాలను గెలుచుకుంది. దీంతో భారత్ పతకాల సంఖ్య 100 మైలు రాయిని చేరుకుంది. 25 స్వర్ణాలు, 35 రజతాలు, 40 కాంస్యాలతో సహా 100 పతకాలతో భారత క్రీడాకారులు చరిత్ర సృష్టించారు. ఆర్చర్లు జ్యోతి సురేఖ వెన్నం, ప్రవీణ్ ఓజాస్ వ్యక్తిగత కాంపౌండ్ ఈవెంట్‌లలో స్వర్ణం సాధించగా, మహిళల కబడ్డీ జట్టు ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో చైనీస్ తైపీని ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. దీంతో భారత్‌ 100 పతకాల మైలురాయిని చేరుకుంది. 


వారికి నా కృతజ్ఞతలు : జ్యోతి సురేఖ
మూడు స్వర్ణ పతకాల విజేత జ్యోతి సురేఖ వెన్నం మాట్లాడారు. ‘అనుకున్నది సాధించగలిగాను,  సంతృప్తిగా ఉంది. మూడు బంగారు పతకాలు సాధించడం చాటా సంతోషంగా ఉంది. నా ప్రయాణంలో నన్ను ప్రోత్సహించి, ఆదరించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భారత్ చాలా బాగా ఆడినందుకు సంతోషంగా ఉంది. పతకాలు సాధించిన క్రీడాకారులందరికీ నా అభినందనలు. ప్రభుత్వానికి  కృతజ్ఞతలు చెబుతున్నా, వారి మద్దతు లేకుండా ఇది సాధ్యం అయ్యేది కాదు’ అని అన్నారు.