T20 World Cup 2022:  ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ కోసం పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టు గట్టిగానే సిద్ధమవుతోంది. మాజీ క్రికెటర్‌ మాథ్యూ హెడేన్‌ను మెంటార్‌గా నియమించుకుంది. ఆస్ట్రేలియాలో అతడి అనుభవం జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతుందని భావిస్తోంది. అలాగే దక్షిణాఫ్రికా మాజీ పేసర్‌ వెర్నాన్‌ ఫిలాండర్‌ను బౌలింగ్‌ సలహాదారుగా ఎంచుకుంది.


గతేడాది ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ యూఏఈలో జరిగింది. ఈ టోర్నీలో పాకిస్థాన్‌ జట్టు అద్భుతంగా ఆడింది. తొలి మ్యాచులోనే టీమ్‌ఇండియాను ఓడించి శుభారంభం చేసింది. అంతేకాకుండా లీగ్‌ మ్యాచుల్లో విజయ దుందుభి మోగించింది. కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌, ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ తిరుగులేని ఇన్నింగ్సులతో చెలరేగారు. వీరిద్దరూ దూకుడుగా ఆడేందుకు మాథ్యూ హెడేన్‌ ఇచ్చిన సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. అయితే ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో పాక్‌ ఓటమి పాలవ్వడం గమనార్హం. ఈసారి మెగా టోర్నీ ఏకంగా ఆసీస్‌లోనే జరుగుతుండటంతో ఆయన అనుభవం ఉపయోగించుకోవాలని అనుకుంటోంది.


మాథ్యూ హెడేన్‌ అక్టోబర్‌ 15న ఆస్ట్రేలియా జట్టుతో కలుస్తాడు. బంగ్లాదేశ్‌, న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌ అదే రోజు ముగించుకొని పాక్‌ బ్రిస్బేన్‌ చేరుకుంటుంది. 'మరోసారి మాథ్యూ హెడేన్‌ను పాక్‌ జట్టులోకి ఆహ్వానిస్తున్నాం. ప్రపంచ వ్యాప్తంగా ఆయనకు అనుభవం ఉంది. ఆయన ఎప్పుడో నిరూపించుకున్న వ్యక్తి. ఆస్ట్రేలియా గురించి ఆయన కన్నా ఇంకెవ్వరికీ బాగా తెలియదు.  మా క్రికెటర్లు ప్రపంచకప్‌లో రాణించేందుకు ఆయన అనుభవం ఉపయోగపడుతుందన్న విశ్వాసం నాకుంది' అని పీసీబీ ఛైర్మన్‌ రమీజ్‌ రాజా అన్నాడు.


పాక్‌తో కలిసి మరోసారి పనిచేస్తున్నందుకు ఆనందంగా ఉందని మాథ్యూ హెడేన్‌ అన్నాడు. 'ఆసియాకప్‌లో పాకిస్థాన్‌ జట్టు ఎంత బాగా ఆడుతుందో నేను చూస్తూనే ఉన్నాను. ఆదివారం టీమ్‌ఇండియాపై వారెంతో బాగా ఆడారు. ఆస్ట్రేలియా రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలు పాక్‌ వద్ద ఉన్నాయి. వారి బ్యాటింగ్‌, బౌలింగుకు ఇక్కడి పరిస్థితులు బాగా నప్పుతాయి. గతేడాది యూఏఈలో మాదిరిగానే ఈసారీ పాకిస్థాన్‌ వెలుగుతుంది' అని హెడేన్‌ అన్నాడు.