MC Mary Kom Steps Down As India’s Chef-De-Mission For 2024 Paris Olympics: ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, భారత దిగ్గజ బాక్సర్‌ మేరీకోమ్‌( Mary Kom).. పారిస్‌ ఒలింపిక్స్‌(Paris Olympics)లో భారత చెఫ్‌ డి మిషన్‌(Chef-de-Mission ) బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు మేరీ కోమ్‌ లేఖ రాసినట్లు భారత ఒలింపిక్‌ సంఘం అధ్యక్షురాలు పి.టి.ఉష వెల్లడించారు.  దేశానికి సేవ చేయడాన్ని తానెప్పుడూ గౌరవంగా భావిస్తానని... మానసికంగానూ సిద్ధంగా ఉంటానని మేరికోమ్‌ లేఖలో పేర్కొన్నారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఒలింపిక్స్‌లో గురుతర బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నానని. అందుకే ఆ పదవికి రాజీనామా చేస్తున్నానని 41 ఏళ్ల మేరికోమ్‌ లేఖలో వివరించారు. ఒలింపిక్‌ పతక విజేత, ఐఓఏ అథ్లెట్స్‌ కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ మేరీ కోమ్‌ వ్యక్తిగత కారణాలతో వైదొలగడం బాధించిందని.. ఆమె నిర్ణయాన్ని, గోప్యతను గౌరవిస్తామని పీటీ ఉష వెల్లడించారు. మేరీ స్థానంలో మరొకరిని నియమిస్తామని ఉష చెప్పారు. పారిస్‌ ఒలింపిక్స్‌ ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. 




 

నన్ను ఇరికిస్తారమో

ప్రముఖ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ (Vinesh Phogat) రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (WFI) అధ్యక్షుడు సంజయ్‌ సింగ్‌(Sanjai Singh)పై తీవ్ర ఆరోపణలు చేశారు. తనకు, తన సహాయ సిబ్బందికి అనవసరమైన అడ్డంకులు కలిగించడం ద్వారా తాను ఒలింపిక్స్ క్వాలిఫైయర్స్‌(Asian Olympic qualifying tournament) పోటీల్లో తాను పాల్గొనకుండా అడ్డుకునేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారన్నారు. తనను డోపింగ్‌ కేసులో ఇరికిస్తారేమోనని భయంగా ఉందన్నారు. రానున్న పారిస్ ఒలింపిక్స్‌లో తను ఆడకుండా అడ్డుకునేందుకు మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ , ఆయనకు డమ్మీగా ఉన్న సంజయ్‌ సింగ్‌లు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారన్నారు. అక్కడ కోచ్‌లుగా నియమితులైన వారందరూ బ్రిజ్‌ భూషణ్‌ కు సన్నిహితులే అని, తనాపై ఉన్నకోపంతో మ్యాచ్‌ మధ్యలో ఇచ్చే తాగునీటిలో ఏదైనా కలిపి ఇచ్చే అవకాశం ఉందంటూ అని సామాజిక మాధ్యమం ఎక్స్ లో వినేశ్‌ ఫొగాట్‌ ఆరోపించారు. డోపింగ్‌ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని తాను భావిస్తున్నానన్నారు.

 

పారిస్‌ ఒలింపిక్స్‌లో 50 కేజీల విభాగం కోసం ప్రయత్నిస్తున్న వినేష్ ఫొగాట్‌ వచ్చేవారం కిర్గిజ్‌స్థాన్‌లో జరగనున్న ఏషియన్‌ ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లో పాల్గొననున్నారు. అయితే ఈవెంట్‌ కోసం తన వ్యక్తిగత కోచ్‌, ఫిజియోలకు అక్రిడిటేషన్‌లు నిరాకరించారని వినేశ్‌ చెబుతున్నారు. ఇందుకోసం సుమారు నెల రోజులుగా తాను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. అయితే ఈ విషయంపై వినేశ్ ఆరోపణలను ఫెడరేషన్ తీవ్రంగా ఖండించింది. ఎంట్రీలను పంపడానికి గడువు ముగిసిందని, వినేష్ అభ్యర్థన మెయిల్ మార్చి18న వచ్చిందని, అయితే అప్పటికే ప్లేయర్లు, కోచ్‌లు మరియు వైద్య సిబ్బంది ఎంట్రీలను వరల్డ్ గవర్నింగ్ బాడీ యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కి పంపేసినట్టు తెలిపింది.

 

లైంగిక వేధింపుల ఆరోపణలపై బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌కు వ్యతిరేకంగా సాక్షి మలిక్‌, బజ్‌రంగ్‌ పునియా, వినేశ్‌ ఫొగాట్‌ తదితర రెజ్లర్లు తీవ్రంగా పోరాడారు. బ్రిజ్ భూషణ్ రాజీనామా తరువాత ఇటీవల డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్ష ఎన్నికల్లో బ్రిజ్‌భూషణ్ సన్నిహితుడైన సంజయ్‌ సింగ్ ఎన్నికయ్యారు. ఈ విషయంపై కూడా వీరు వ్యతిరేకంగా స్పందించారు.