Marylebone Cricket Club: క్రికెట్‌ నిబంధనలను రూపొందించే మెరిల్‌ బోన్‌ క్రికెట్‌ క్లబ్‌ (MCC) 2022కు గాను కొత్త నియమావళిని ప్రకటించింది. గతవారం సమావేశమైన ఎంసీసీ నిబంధనల సబ్‌కమిటీ కొన్ని మార్పులను ఆమోదించింది. ఈ కొత్త నిబంధనావళి అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి రానుంది. 'మన్కడింగ్‌' చేయడం ఇకపై క్రీడాస్ఫూర్తికి విరుద్ధం కాదని ఎంసీసీ ప్రకటించింది. ఎన్నాళ్లుగానో దీనిపై గళమెత్తుతున్న అశ్విన్‌ (Ravichandran Ashwin) ఇక హ్యాపీ కావొచ్చు!


రీప్లేస్‌మెంట్‌ ఆటగాళ్లు


రీప్లేస్‌మెంట్‌ ఆటగాళ్లకు సంబంధించిన 1.3వ నిబంధనలో కొత్త క్లాజ్‌ చేర్చారు. ఇకపై రీప్లేస్‌మెంట్‌గా వచ్చే క్రికెటర్లను మైదానంలో ఆడుతున్న క్రికెటర్లుగానే పరిగణిస్తారు. వారు చేసిన డిస్మిసల్స్‌ లేదా ఆంక్షలు వారికీ వర్తిస్తాయి.


క్యాచ్‌ ఔటైతే నాన్‌స్ట్రైకర్‌కు బ్యాటింగ్‌ లేదు 


ఎంసీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. 18.11వ నిబంధన సవరించింది. సాధారణంగా బ్యాటర్‌ క్రీజు బయటకు వచ్చి షాట్‌ ఆడి క్యాచ్‌ ఔటైతే నాన్‌స్ట్రైకర్‌ క్రీజలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇకపై అలా కుదరదు. క్యాచ్‌ ఔటైన వారి స్థానంలో వచ్చే బ్యాటర్‌ నేరుగా స్ట్రైకింగ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. వికెట్‌ తీసిన బౌలర్‌కు ఫలితం దక్కాలనే ఇలా చేశారు.


ఎవరైనా డిస్టర్బ్‌ చేస్తే


డెడ్‌ బాల్‌ విషయంలో మార్పు చేశారు. ఈ మధ్యన అభిమానులు లేదా జంతువులు, పక్షులు మ్యాచు మధ్యలో వచ్చి డిస్టర్బ్‌ చేస్తుండటం గమనిస్తున్నాం. ఇలాంటి సంఘటనల వల్ల లయ దెబ్బతిని కొన్నిసార్లు ఒక జట్టుకు లాభం, మరో జట్టుకు నష్టం జరుగుతోంది. ఇకపై అలా ఏ జట్టైనా నష్టపోతే అంపైర్‌ ఆ బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటించొచ్చు.


బ్యాటర్‌ కదిలితే నో వైడ్‌


బౌలర్లకు అనుకూలంగా మరో మార్పు చేశారు. ఆధునిక క్రికెట్లో బ్యాటర్లు క్రీజులో అటూ ఇటూ కదులుతూ వినూత్నమైన షాట్లు ఆడుతున్నారు. అలాంటప్పుడు బౌలర్ల మదిలో అనుమానాలు మొదలవుతాయి. దాంతో వైడ్లు వస్తున్నాయి. బ్యాటర్లకు ఆ ప్రయోజనం తీసేస్తున్నారు. ఇకపై బ్యాటర్‌ నిలబడ్డ చోటును బట్టే వైడ్‌ను నిర్ణయిస్తారు. ఉదాహరణకు బ్యాటర్‌ కాస్త ఆఫ్‌సైడ్‌ జరిగినా లెగ్‌వైపు నుంచి బంతి వెళ్తే వైడ్‌ ఇవ్వరు!


బ్యాటింగ్‌ టీమ్‌కు 5 రన్స్‌


బౌలర్‌ బంతి వేసేటప్పుడు ఫీల్డింగ్‌ సైడ్‌లో ఏదైనా అన్‌ఫెయిర్‌ మూమెంట్‌ కనిపిస్తే ఇంతకు ఆ బంతిని డెడ్‌బాల్‌గా పరిగణించేవారు. కానీ ఇకపై అలాంటివి జరిగితే బ్యాటింగ్‌ టీమ్‌కు 5 పరుగులు ఇస్తారు. ఎందుకంటే అలాంటి బంతి వల్ల బ్యాటింగ్‌ టీమ్‌కు బౌండరీ లేదా మంచి షాట్ ఆడే అవకాశాలు కోల్పోతున్నారు.


మన్కడ్‌ రనౌట్‌ (Mankading)


ఎప్పట్నుంచో వివాదాస్పదంగా మారిన నిబంధన 'మన్కడింగ్‌'. బౌలర్‌ బంతి వేసేలోపే నాన్‌స్ట్రైకర్‌ క్రీజు దాటిన సందర్భంలో అతడిని ఔట్‌ చేయొచ్చు. కానీ చాలామంది ఇంగ్లిష్‌, ఆస్ట్రేలియా క్రికెటర్లు దీనిని క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా చెబుతుంటారు. ఎంసీసీలో మాత్రం నిబంధనల ప్రకారంగానే ఉంటుంది. దాంతో ఇకపై ఇలాంటివి రనౌట్‌గా ప్రకటిస్తారని ఎంసీసీ తెలిపింది. అన్‌ఫెయిర్‌ ప్లే కాదని వెల్లడించింది.