అర్జెంటీనా ఫుట్‌బాల్‌ స్టార్‌ లియోనల్‌ మెస్సీ తాజాగా ఒక  అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. టైమ్‌ మ్యాగజైన్‌ 2023 సంవత్సరానికి ‘అథ్లెట్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా ఎంపికయ్యాడు. మెస్సీ ఈ ఏడాది జులైలో మియామి క్లబ్‌లో చేరాడు. మొత్తం 14 గేమ్స్‌ ఆడి 11 గోల్స్‌ కొట్టి జట్టును తొలిసారి లీగ్‌ విజేతగా నిలిపాడు. మెస్సీ వచ్చాక టోర్నీ వీక్షకుల సంఖ్య పెరిగిందని టైమ్‌ ఈ సందర్భంగా  పేర్కొంది. అతడు ఇంటర్‌ మియామి జట్టుకు సంతకం చేసి అమెరికాను ఏకంగా సాకర్‌ దేశంగా మార్చేశాడంది. మెస్సీ రాకతో ఎంఎల్‌ఎస్‌ టోర్నీ వీక్షకుల సంఖ్య తో పాటూ  టికెట్‌ ధరలు, విక్రయాలు కూడా గణనీయంగా పెరిగాయని తెలిపింది. ఈ అవార్డ్ తో మెస్సీ  టైమ్‌ నుంచి గతంలో ఈ అవార్డు అందుకొన్న మైకెల్‌ ఫెల్ప్స్‌ (స్విమ్మింగ్‌), సిమోన్‌ బైల్స్‌ (జిమ్నాస్టిక్స్‌) వంటి వారి సరసన చేరాడు.


ఇంతకుముందు పారిస్‌ సెయింట్‌ జర్మన్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహించిన మెస్సీ, ఆ కాంట్రాక్టు ముగియగానే బార్సిలోనా క్లబ్‌లో తిరిగి చేరాలని భావించాడు. కానీ, అతడి ప్రణాళికలు ఫలించకపోవడంతో  దీంతో మియామి లేదా సౌదీ లీగ్‌లో ఆడాలని నిర్ణయించుకొన్నాడు. ఈ నేపథ్యంలో 20 మిలియన్‌ డాలర్లకు మియామి అగ్రిమెంట్ కుదుర్చుకుంది. అంతే కాదు  రిటైర్మెంట్‌ తర్వాత ఈ క్లబ్‌ యాజమాన్య వాటాలో కొంత భాగం అతడికి కేటాయించేలా ఒప్పందం జరిగినట్లు కథనాలు వెలువడ్డాయి. 



ఇటీవలే మెస్సీ ఎనిమిదో సారి బాలన్‌ డి ఓర్‌ అవార్డును  దక్కించుకొన్నాడు. 2022-23 గానూ ఉత్తమ ప్రదర్శన కనబర్చడంతోపాటు ఖతర్‌ వేదికగా జరిగిన ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌లో తన జట్టును గెలిపించిన మెస్సీ ఈ అవార్డును అందుకున్నాడు. ఇప్పటివరకు అత్యధికంగా 8  సార్లు  ఈ అవార్డు అందుకున్న ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. అత్యధిక బాలన్‌ డి ఓర్‌ అవార్డు పొందిన వారిలో క్రిస్టియానో రొనాల్డో(5) రెండో స్థానంలో ఉన్నాడు. 



ప్రపంచకప్ విజయంలో ప్రధాన పాత్ర 
 గతేడాది ఖతార్ వేదికగా జరిగిన ఫిఫా ప్రపంచకప్ పోటీల్లో మెస్సీ గోల్డెన్ బాల్ అవార్డును కూడా అందుకున్నాడు. ఫిఫా ప్రపంచకప్ లో మెస్సీ మొత్తం 7 గోల్స్ చేశాడు. అలాగే సహచరులు గోల్స్ కొట్టడంలో సహకరించాడు. ఇక ఫైనల్ లో అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో ఫ్రాన్స్‌ను ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. అర్జెంటీనా తరఫున తన చివరి ప్రపంచకప్‌ను ఆడుతున్న లియోనెల్ మెస్సీ తన ప్రపంచకప్ కెరీర్‌ను అద్భుతమైన రీతిలో ముగించాడు.  
అలాగే గతేడాది తన క్లబ్ పీఎస్ జీ తరఫున కూడా లియోనెల్ మెస్సీ అద్భుతంగా రాణించాడు. 


గోల్స్ తో  రికార్డులు కొట్టడమే కాదు,  మెస్సీకి చెందిన జెర్సీ అమ్మకాల్లోనూ రికార్డులను కొల్లగొట్టాడు.  ఆగస్ట్ లో  24 గంటల వ్యవధిలో మెస్సీ ఇంటర్ మియామి జెర్సీలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ఈ క్రమంలో జెర్సీ అమ్మకాల విషయంలో క్రిస్టియానో రొనాల్డో, టామ్ బ్రాడీ, ఎన్బీఏ దిగ్గజం లెబ్రన్ జేమ్స్ ను మెస్సీ అధిగమించాడు. 2021లో రొనాల్డో మాంచెస్టర్ యునైటెడ్ తరపున, 2020లో టాంపా బే బుక్కానీర్స్లో టామ్ బ్రాడీ జాయిన్ అయిన సమయంలో.. 2018 లో ఎల్ఎ లేకర్స్ తరపున లెబ్రన్ జేమ్స్ జాయిన్ అయినప్పుడు వారి జెర్సీలు రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి.