BWF World Championships: బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ షట్లర్‌ లక్ష్య సేన్‌ దూకుడు ప్రదర్శిస్తున్నాడు. పురుషుల సింగిల్స్‌లో ప్రి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. రెండో రౌండ్లో స్పెయిన్‌ ఆటగాడు లూయిస్‌ ఎన్‌రిక్‌ను 21-17, 21-10తో చిత్తు చేశాడు. మరోవైపు గుంటూరు కుర్రాడు కిదాంబి శ్రీకాంత్‌కు చుక్కెదురైంది. రెండో రౌండ్లో జావో జున్‌ పెంగ్‌ (చైనా) చేతిలో పరాజయం చవిచూశాడు. 18-21, 17-21 తేడాతో కేవలం 34 నిమిషాల్లో ఓటమి పాలయ్యాడు. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ అద్భుతం చేశాడు. రెండో సీడ్‌ కెంటో మొమొటోను 21-17, 21-16 తేడాతో చిత్తు చేశాడు. ప్రి క్వార్టర్స్కు చేరుకున్నాడు.






మహిళల్లో అంతా ఔట్‌!


అంతకు ముందు మహిళల డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, సిక్కి రెడ్డి ద్వయానికి ఓటమి ఎదురైంది. ఒకటో సీడ్‌ చెన్‌ క్వింగ్‌ చెన్‌, జియా యీ ఫ్యాన్‌ (చైనా) చేతిలో 21-15, 21-10 తేడాతో పరాజయం పాలైంది. ట్రీసా జోలీ, గాయత్రీ గోపీచంద్‌దీ ఇదే పరిస్థితి. మలేసియా జోడీ టాన్‌ పార్లే, టీనా మురళీధరన్‌ 21-8, 21-17 తేడాతో వారిని  ఓడించింది. అశ్విని భట్‌, శిఖా గౌతమ్‌ జోడీ చైనీస్‌ తైపీ కిమ్‌ సో యాంగ్‌, కాంగ్‌ హీ యాంగ్‌ ద్వయంపై 21-15, 18-21, 21-13 తేడాతో పోరాడి ఓడింది. పూజా దండు, సంజనా సంతోష్‌ జోడీకీ ఓటమి తప్పలేదు. చైనీస్‌ తైపీ ద్వయం లీ సో హీ, షిన్‌ సెంగ్‌ చాన్‌ 21-15, 21-7 తేడాతో వారిని ఓడించింది.




పురుషుల డబుల్స్‌లో ఆశలు


పురుషుల డబుల్స్‌లో మాత్రం రెండు జోడీలు ఘన విజయం సాధించాయి. సాత్విక్‌ సాయిరాజ్‌, చిరాగ్‌ శెట్టి ద్వయం 21-8, 21-10 తేడాతో గ్వాటెమాల షట్లర్లు జొనాథన్‌ సొలిస్‌, అనిబల్‌ మారూక్విన్‌ను చిత్తు చేసింది. ఎంఆర్‌ అర్జున్‌, ధ్రువ్‌ కపిల జోడీ ఎనిమిదో సీడ్‌, గతేడాది కాంస్య పతక విజేత కిమ్‌ అస్ట్రుప్‌, ఆండర్స్‌ స్కారప్‌ (డెన్మార్క్‌)ను 21-17, 21-16 తేడాతో ఓడించింది. ఈ రెండు జోడీలు ప్రి క్వార్టర్స్‌కు చేరుకున్నాయి.