Korea Open Semi Final PV Sindhu kidambi srikanth Loses in korea open: కొరియా బ్యాడ్మింటన్‌ ఓపెన్లో భారత షట్లర్ల కథ ముగిసింది! రెండు ఒలింపిక్‌ పతకాల విజేత పీవీ సింధు (PV Sindhu), ప్రపంచ మాజీ నంబర్‌ వన్‌ కిదాంబి శ్రీకాంత్ (Kidambi Srikanth) సెమీస్‌ దశలోనే వెనుదిరిగారు. పతకాలు గెలిచే అవకాశాన్ని త్రుటిలో చేజార్చుకున్నారు.




PV Sindhu ఎలా ఓడిందంటే?


మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో రెండో సీడ్‌ కొరియా అమ్మాయి అన్‌సియంగ్‌ (An Seyoung) చేతిలో పీవీ సింధు వరుసగా 14-21, 17-21 తేడాతో వరుస గేముల్లో ఓడిపోయింది. రెండో గేమ్‌లో గెలిచేందుకు సింధు తీవ్రంగా శ్రమించినా ప్రత్యర్థిదే పైచేయిగా మారింది. రెండు డ్రాప్స్‌, రెండు స్మాష్లతో ఆమె నాలుగు పాయింట్లు సాధించి విజయం అందుకుంది. రెండో గేములో మొదట సింధు 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. చివరి వరకు అదే జోరు కొనసాగించింది. ఆఖర్లో మూడు పాయింట్లు సాధించి గేమును నిలబెట్టుకొనేందుకు ప్రయత్నించింది. అయితే సింధు బ్యాక్‌ హ్యాండ్‌ షాట్‌ను దూరంగా ఆడిన సియంగ్‌ వెంటవెంటనే మూడు మ్యాచ్‌ పాయింట్లు సాధించింది. క్వార్టర్‌ ఫైనల్లో థాయ్‌ షట్లర్‌ బుసానన్‌పై 21-10, 21-16 తేడాతో సింధు గెలిచిన సంగతి తెలిసిందే.




ఆఖరి వరకు పోరాడిన Kidambi Srikanth


పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో కిదాంబి శ్రీకాంత్‌ 19-21, 16-21 తేడాతో జొనాథన్‌ క్రిస్టీ చేతిలో పరాజయం చవిచూశాడు. తొలి గేమ్‌లో 11-8తో ముందంజలోకి వెళ్లిన శ్రీకాంత్‌ 16-17తో నిలిచాడు. ఇదే సమయంలో జొనాథన్‌ వరుస స్మాషులతో 21-19తో గేమ్‌  కైవసం చేసుకున్నాడు. రెండో గేమ్‌ నువ్వా నేనా అన్నట్టు సాగింది. అయితే 14-14తో ఇద్దరూ సమంగా ఉన్నవేళ కిదాంబి వరుసగా ఐదు పాయింట్లు కోల్పోయాడు. మ్యాచును వదులుకున్నాడు.