UAE వేదికగా సెప్టెంబరు 19 నుంచి ఐపీఎల్ - 2021 మిగతా సీజన్ ప్రారంభంకాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖాళీ అయిన స్థానాలను భర్తీ చేసుకోవడంలో ఆయా ఫ్రాంఛైజీలు బిజీ బిజీ అయిపోయాయి. ఈ క్రమంలో ఇప్పటికే చాలా జట్లు రిప్లేస్‌మెంట్‌ ఆటగాళ్లను ఎంపిక చేసుకుంది. 


తాజాగా కోల్‌కతా నైట్‌ రైడర్స్ (KKR) న్యూజిలాండ్ స్టార్‌ పేసర్ టిమ్ సౌథీని జట్టులోకి తీసుకుంది. ఆస్ట్రేలియన్ పేసర్ పాట్ కమిన్స్ రెండో దశకు అందుబాటులో లేకపోవడంతో అతని స్థానాన్ని సౌథీతో భర్తీ చేసుకుంది. వ్యక్తిగత కారణాల వల్ల కమిన్స్ మిగిలిన సీజన్‌కి అందుబాటులో ఉండటంలేదని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.






అంతర్జాతీయ క్రికెట్లో సౌథీకి ఎంతో అనుభవం ఉంది. కివీస్ తరఫున 305 మ్యాచ్‌లు ఆడిన సౌథీ 603 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. సౌథీ గతంలో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. ఐపీఎల్‌లో వరుసగా ఆరు సీజన్లు ఆడిన సౌథీ గతేడాది వేలంలో అమ్ముడుపోలేదు. చివరిసారి అతను 2019లో ఆర్సీబీకి ఆడాడు.


జై రిచర్డ్‌సన్ స్థానంలో అదిల్ రషీద్ 


మరో పక్క పంజాబ్ కింగ్స్ ఖాళీ అయిన ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్‌సన్‌ స్థానాన్ని భర్తీ చేసింది. అతడి స్థానంలో ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్‌ను తీసుకుంది. 33 ఏళ్ల అదిల్‌ రషీద్‌‌కు ఇప్పటి వరకు IPL ఆడిన అనుభవం లేదు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో రషీద్ ప్రస్తుతం నాలుగో ర్యాంకులో ఉన్నాడు. ఇప్పటి వరకు 210 మ్యాచుల్లో 232 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌లో రషీద్ మూడో ఇంగ్లాండ్ ప్లేయర్. డేవిడ్ మలన్, క్రిస్ జోర్దాన్ ఈ జట్టులోనే ఉన్నారు.