టీమ్‌ఇండియా సారథి విరాట్‌ కోహ్లీ మీడియా సమావేశాల్లో ఎందుకు మాట్లాడటం లేదో కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ చెప్పాడు. వందో టెస్టు మ్యాచ్‌ ముందు అతడు ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడతాడని పేర్కొన్నాడు. వాండరర్స్‌ టెస్టులో అతడు భారీ పరుగులు చేస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. రెండో టెస్టుకు ముందు ద్రవిడ్‌ మీడియాతో మాట్లాడాడు.


'మ్యాచ్‌కు ముందు మీడియా సమావేశాల్లో కోహ్లీ గైర్హాజరు అవ్వడానికి ప్రత్యేక కారణమేమీ లేదు. దీనిపై నేను నిర్ణయం తీసుకోను. వందో టెస్టు ముందు అతడు మీతో మాట్లాడతాడు. దానిని మీరు వేడుక చేసుకుంటారనే అనుకుంటున్నా. పైగా మీరు అందులో వందో టెస్టు గురించి ప్రశ్నలు అడగొచ్చు' అని ద్రవిడ్‌ అన్నాడు.


బాక్సింగ్‌ డే టెస్టులో టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించింది. సెంచూరియన్‌లో ఒక రోజు వర్షంతో రద్దైనా అద్భుతం చేసింది. ఈ మ్యాచులో కేఎల్‌ రాహుల్‌ శతకంతో మురిపించాడు. కోహ్లీ త్రుటిలో అర్ధశతకం మిస్‌ చేసుకున్నాడు. కాగా సోమవారం నుంచి టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా వాండరర్స్‌ వేదికగా రెండో టెస్టులో తలపడనున్నాయి.  ఈ పిచ్‌ కఠినంగా ఉందని, రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ చేయడం కష్టమని ద్రవిడ్‌ తెలిపాడు.






'వాతావరణం, పరిస్థితులను పరిశీలించలేదు. ఎప్పటిలాగే వాండరర్స్‌ వికెట్‌ టిపికల్‌గా బాగుంది. కాస్త ఫ్లాట్‌ అవ్వొచ్చు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌ కఠినంగా మారొచ్చు. సాధారణంగా వాండరర్స్‌లో ఫలితం వస్తుంటుంది. పిచ్‌ వేగంగా ఉంటుంది. సెంచూరియన్‌ మాదిరి బౌన్స్‌ మాత్రం ఉండకపోవచ్చు' అని ద్రవిడ్‌ తెలిపాడు.


దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో కోహ్లీ భారీ పరుగులు చేస్తాడని మిస్టర్‌ వాల్‌ ధీమా వ్యక్తం చేశాడు. 'కోహ్లీ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అతడు భారీ పరుగులు చేయగలడు. గత 20 రోజులుగా విరాట్‌ అద్భుతంగా ఆడుతున్నాడు. ప్రాక్టీస్‌ చేసినట్టుగానే ప్రదర్శన ఉంది. అతడు అంకితభావంతో ఆడే ఆటగాడు కాబట్టి ఎక్కువగా చెప్పను. అతడు మైదానం లోపలా, బయటా బాగుంటాడు. క్రీజులో నిలదొక్కుకొని శుభారంభాలను భారీ స్కోర్లు మలచకపోయినా నేనేమీ అనుకోను. ఎందుకంటే అతడు ఒక్కసారి క్లిక్‌ అయితే సెంచరీల వరద పారించగలడు' అని ద్రవిడ్‌ పేర్కొన్నాడు.