Telangana Sports News | హైదరాబాద్: ప్రపంచ వ్యాప్తంగా కిక్‌ బాక్సింగ్ క్రీడ ప్రాచుర్యం పొందినప్పటికీ, తెలంగాణలో ఈ క్రీడకు సరైన ప్రభుత్వ గుర్తింపు లేకపోవడం వల్ల క్రీడాకారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం ఇప్పటికీ 2012 ఆగస్టు 9న విడుదల చేసిన G.O.Ms.No.74 ప్రకారం మాత్రమే క్రీడా రిజర్వేషన్లను అమలు చేస్తోంది. ఈ ఆదేశంలో 29 క్రీడలకు మాత్రమే 2% రిజర్వేషన్ కల్పించారు. కానీ కిక్‌బాక్సింగ్ ఆ జాబితాలో లేనందున ఈ క్రీడలో ప్రతిభను చాటుతున్న  కొందరు క్రీడాకారులు ఆనేక  ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  


గత 12 ఏళ్లుగా మారని పరిస్థితి:


తెలంగాణ లో 2012లో విడుదలైన G.O.Ms.No.74 ద్వారా పలు క్రీడలకు రిజర్వేషన్లను కల్పించినప్పటికీ, కిక్‌బాక్సింగ్‌ను దానిలో చేర్చలేదు. 2018లో G.O.Ms.No.5 ద్వారా కొన్ని మార్పులు చేసినా, కిక్‌బాక్సింగ్ పరిస్థితి మారలేదు. "ఈ నిర్ణయాలపై సమీక్ష చేయకపోవడం వల్ల మాకు సరైన గురింపు, అవకాశాలు లభించడం లేదు" అని క్రీడాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



 


కిక్‌బాక్సింగ్ లో విభాగాలు: కిక్ బాక్సింగ్ లో ఫుల్-కాంటాక్ట్ కిక్‌బాక్సింగ్, లో-కిక్ కిక్‌బాక్సింగ్, కే-1 స్టైల్ కిక్‌బాక్సింగ్, ముయ్‌తాయ్ కిక్‌బాక్సింగ్, సెమీ-కాంటాక్ట్ కిక్‌బాక్సింగ్, లైట్ కాంటాక్ట్ కిక్‌బాక్సింగ్, పాయింట్ ఫైట్ వంటి విభాగాలలో పోటీలు జరుగుతాయి. ఈ విభాగాలు ద్వారా అంతర్జాతీయం గా క్రీడాకారులకు వివిధ రకాల శైలుల్లో ప్రదర్శన ఇచ్చే అవకాశాన్ని కల్పిస్తాయి.




హైదరాబాదీ కిక్ బాక్సర్ హర్షా రత్నకర్ ఆవేదన:


హైదరాబాద్‌కు చెందిన హర్షా రత్నకర్ 2012 నుంచి కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ పొందుతున్నారు. యూపీఎస్సీ తో పాటు  TSPSC పరీక్షలకు శిక్షణ పొందుతున్న హర్ష మాట్లాడుతూ "నేను సబ్‌ ఇన్‌స్పెక్టర్ పదవికి రెండుసార్లు విజయవంతంగా అర్హత సాధించాను. అన్నీ స్టేజెస్ పాస్ అయ్యాను.  కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్  దశలో తెలంగాణ లో  కిక్‌బాక్సింగ్ క్రీడ కు గుర్తింపు లేకపోవడంతో  మెరిట్ బేసిస్ లో  నాకు ఉద్యోగం దక్కలేదు," అని పేర్కొన్నారు.  


హైదరాబాద్‌కు చెందిన మరో జాతీయ స్థాయి క్రీడాకారిణి నైషా బాజాజ్ మాట్లాడుతూ, "ప్రతి పోటీలో పాల్గొనేందుకు స్వంత నిధులను వినియోగిస్తున్నాము. ప్రభుత్వ మద్దతు లేకపోవడం వల్ల ఇది మరింత కష్టతరం అవుతోంది," అని వెల్లడించారు.  




మార్పు కోసం ఆశ:


తెలంగాణ కిక్‌బాక్సింగ్ అసోసియేషన్ (TKA) ఈ సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తోంది. ఆరు నెలల క్రితం  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ (Sports Authority of Telangana) కు పత్రాలను సమర్పించినప్పటికీ, ఆ ప్రక్రియలో ఇప్పటికీ పురోగతి లేదు అని క్రీడాకారులు చెబుతున్నారు. 



ప్రస్తుతం రాష్ట్రంలో 500 మందికి పైగా కిక్ బాక్సింగ్ క్రీడాకారులు ఉన్నారు. కిక్‌బాక్సింగ్ క్రీడకు గుర్తింపు లభిస్తే ఆర్థిక మద్దతుతో పాటు, తెలంగాణ క్రీడా రంగానికి విశ్వసనీయత పెరుగుతుందని క్రీడాభిమానులు విశ్వసిస్తున్నారు. "ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించి, చర్యలు తీసుకుంటే తెలంగాణ నుంచి కూడా అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు వస్తారు," అని వారు ఆశాభావం వ్యక్తంచేశారు.


Also Read: Clashes At Guinea Football Match:ఫుట్‌ బాల్‌ మ్యాచ్‌లో రిఫరీల పక్షపాత నిర్ణయం- వంద మందికిపైగా మృతి-గినియాలో పెను విషాదం