Silver Medal to Osmania University in Khelo India: ఉత్తరప్రదేశ్ లోని లక్నో వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా యూనివర్సిటీ పోటీల్లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సత్తా చాటారు. ఖేలో ఇండియా 2023లో ఓయూ విద్యార్థినులు రజత పతకం కైవసం చేసుకున్నారు. లక్నోలోని ఎకానా ఇంటర్నేషనల్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఖేలో ఇండియా మహిళల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన అదితి అరె ఫైనల్లో 5-7, 5-7 తేడాతో సావిత్రిబాయి పూలే పుణే యూనివర్సిటీకి చెందిన బేలా తమహంకర్ చేతిలో ఓటమి పాలైంది. ఓయూ అమ్మాయి అదితి అరె రెండు వరుస సెట్లలోనూ పోరాడంతో ట్రై బ్రేకర్ కు వెళ్లగా.. చివర్లో ప్రత్యర్థి పాయింట్ సాధించంతో పోరాడి ఓడింది.
మరో సింగిల్స్ ఫైనల్లో ఓయూకు చెందిన ఓమ్నా యాదవ్ 2-6, 2-6 తో ఓటమిచెందింది. దాంతో హ్యాట్రిక్ బంగారు పతకాలు సాధించాలని భావించిన డిఫెండింగ్ ఛాంపియన్ ఉస్మానియా వర్సిటీకి నిరాశే ఎదురైంది. అయితే తమ అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్ చేరి ఓటమిచెందినా, ఓయూకు సిల్వర్ మెడల్ అందించారు అదితి అరె, ఓమ్నా యాదవ్. జైన్ యూనివర్శిటీకి చెందిన క్రీడాకారిణులు 2-0 తేడాతో మద్రాస్ యూనివర్సిటీని ఓడించి కాంస్య పతకాన్ని అందుకున్నారు.
మహిళల డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్ అన్నా యూనివర్శిటీ, భారతియార్ యూనివర్శిటీపై చెమటోడ్చి నెగ్గింది. మ్యాచ్ సూపర్ టై బ్రేక్ కు వెళ్లగా ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో పోరాడి విజయం సాధించింది అన్నా యూనివర్సిటీ. గుజరాత్ వర్సిటీ 2-1 తేడాతో కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీపై నెగ్గి కాంస్య పతకం అందుకుంది.
జైన విశ్వవిద్యాలయం 28 పతకాలు సాధించగా, అత్యధికంగా 15 స్వర్ణాలతో టేబుల్ టాపర్ గా నిలిచింది. పంజాబ్ లోని గురునానక్ దేవ్ యూనివర్సిటీ 14 స్వర్ణాలు, 16 రజతకాలు, 5 కాంస్యాలతో మొత్తం 35 పతకాలతో దూసుకెళ్తోంది. పంజాబ్ యూనివర్సిటీ 14 స్వర్ణాలు, 9 రజతకాలు, 14 కాంస్యాలతో మొత్తం 37 పతకాలు కొల్లగొట్టింది. గురు కాశీ విశ్వవిద్యాలయం 12 పతకాలు, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ 16 పతకాలు, కలింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రీయల్ టెక్నాలజీ 9 పతకాలు, సావిత్రిబాయి పూలే పూణే యూనివర్సిటీ 15 పతకాలు, శివాజీ యూనివర్సిటీ 13 పతకాలు, అన్నా యూనివర్సిటీ 10 పతకాలు, యూనివర్సిటీ ఆఫ్ ముంబై 13 పతకాలతో టాప్ 10లో నిలిచాయి.