Warangal News: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా జూన్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకు దశాబ్ది ఉత్సవాలు ఘనంగా చేయబోతున్నట్లు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెప్పారు. నర్సంపేట నియోజకవర్గ స్థాయి అభివృద్ధిపై వరంగల్ జిల్లా స్థాయి అధికారులతో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. అన్ని శాఖల సమనవ్యయంతోనే ఈ సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.


Telangana Decade Celebrations: రాబోవు 21 రోజుల పాటు దశాబ్ది ఉత్సవాల ప్రణాళిక గురించి చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అయిందని.. సంక్షేమ పథకాలతో లబ్దిదారులు పండుగ చేసుకుంటున్నారని వివరించారు. నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధిస్తున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నర్సంపేటకు గోదావరి నదీ జలాలు అందించామని.. ఎండా కాలంలో కూడా వానా కాలం వలె పంటలు పండించిన ఘనత తెలంగాణకు మాత్రమే దక్కుతుందన్నారు. 






కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. నర్సంపేట పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పురోగతి సాధించామని చెప్పుకొచ్చారు. కుమ్మరి కుంట పార్కు, పాకాల ఆడిటోరియం, నగర సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయని వివరించారు. అలాగే ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చోరవతో నర్సంపేటలో ప్రత్యేకంగా అంబేద్కర్ భవనం, అధునాతన ధోబి ఘాట్, కుల ఆత్మ గౌరవ కమ్యూనిటీ భవనాలు నిర్మించుకుంటున్నామన్నారు. అలాగే పెండింగ్ లో ఉన్న పనులన్నీ తొందరగా పూర్తి చేయాలని రివ్యూలో అధికారులకు సూచించారు. 






మరోవైపు వరంగల్ సీపీ ఏవీ రంగనాథ్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 25వ తేదీన సెక్రటేరియట్ లో కేబినెట్ మీటింగ్ నిర్వహించారని గుర్తు చేశారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలపై పోలీస్ శాఖకు దిశా నిర్దేశం చేశారన్నారు.  పోలీస్ శాఖ ప్రతీ గ్రామంలో నిర్వహించే కార్యక్రమాల్లో మమేకం అవుతుందని చెప్పుకొచ్చారు. గత 9 సంవత్సరాల్లో సాధించిన పురోగతి ప్రజలందరికీ తెలుసు అని... తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతీ డిపార్ట్మెంట్ ఎంతో అభివృధి సాధించిందని వివరించారు. పోలీస్ శాఖ స్థానిక ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళుతుందని అన్నారు. గ్రామాల్లో సమావేశాలు నిర్వహిస్తామని.. వాటికి తాను కూడా హాజరై అక్కడి సమస్యలు తెలుసుకొని పరిష్కరిస్తామని సీపీ రంగనాథ్ వివరించారు.