Most Time 50 Plus Runs In Powerplay In IPL: IPL 2023 నాలుగో మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నుంచి ఓపెనింగ్‌కు వచ్చిన స్టార్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ జట్టుకు శుభారంభం అందించాడు. దూకుడుగా బ్యాటింగ్ చేసిన బట్లర్ పవర్ ప్లేలోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను కేవలం 20 బంతుల్లోనే 50 పరుగులను పూర్తి చేశాడు. ఈ అర్థ శతకంతో బట్లర్ ప్రత్యేక రికార్డు సృష్టించి వెటరన్ క్రిస్ గేల్‌తో సమంగా నిలిచాడు.
ప్రత్యేక జాబితాలో జోస్ బట్లర్
నిజానికి పవర్ ప్లేలో బట్లర్ 50 పరుగుల మార్క్ దాటడం ఇదే తొలిసారి కాదు. అతను ఈ ఘనతను మూడుసార్లు సాధించాడు. ఈ విషయంలో అతను వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ క్రిస్ గేల్‌ను సమం చేశాడు. ఐపీఎల్ చరిత్రలో క్రిస్ గేల్ కూడా మూడుసార్లు పవర్ ప్లేలో 50 పరుగుల మార్కును దాటాడు. హైదరాబాద్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో జోస్ బట్లర్ తన జట్టు రాజస్థాన్ రాయల్స్ తరఫున 22 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేశాడు.
మరోవైపు పవర్ ప్లేలో అత్యధిక సార్లు 50 పరుగుల మార్కును దాటిన బ్యాట్స్‌మెన్ జాబితాలో ఆస్ట్రేలియా ప్రముఖ బ్యాట్స్‌మెన్, ఈ సీజన్ ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో పవర్ ప్లేలో బ్యాటింగ్ చేస్తూ వార్నర్ మొత్తం ఆరు సార్లు 50 పరుగుల మార్కును దాటాడు.
IPLలో పవర్ ప్లేలో అత్యధిక 50లు సాధించిన బ్యాట్స్‌మెన్
డేవిడ్ వార్నర్ - 6 సార్లు.
క్రిస్ గేల్ - 3 సార్లు.
జోస్ బట్లర్ - 3 సార్లు.
రాయల్స్ అంటే రాయల్సే! భారీ టార్గెట్లు సెట్ చేయడంలో.. భారీ తేడాతో ఓడించడంలో తమకు తామే సాటి అని మరోసారి నిరూపించుకున్నారు. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై థంపింగ్ విక్టరీ సాధించారు. 204 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టును 131/8కే పరిమితం చేశారు. 72 పరుగుల తేడాతో గెలుపు ఢంకా మోగించారు. యుజ్వేంద్ర చాహల్ (4/17), ట్రెంట్ బౌల్ట్ (2/21) దెబ్బకు రైజర్స్ విలవిల్లాడారు. అబ్దుల్ సమద్ (32*; 32 బంతుల్లో 2x4, 1x6), మయాంక్ అగర్వాల్ (27; 23 బంతుల్లో 3x4) టాప్ స్కోరర్స్ అంటేనే సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతకు ముందు రాజస్థాన్‌లో ఓపెనర్లు జోస్ బట్లర్ (54; 22 బంతుల్లో 7x4, 3x6), యశస్వీ జైశ్వాల్ (54; 37 బంతుల్లో 9x4), కెప్టెన్ సంజూ శాంసన్ (55; 32 బంతుల్లో 3x4, 4x6) వరుసగా హాఫ్ సెంచరీలు బాదేశారు.
టార్గెట్ డిఫెండ్ చేసే జట్టుకు ఎలాంటి బౌలింగ్ స్పెల్ అవసరమో ట్రెంట్ బౌల్ట్ వేసి చూపించాడు. బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ హడలెత్తించాడు. సన్‌రైజర్స్ పరుగుల ఖాతా తెరకముందే మూడో బంతికి అభిషేక్ శర్మ (0)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన రాహుల్ త్రిపాఠి (0)ని ఐదో బంతికి ఔట్ చేసి దెబ్బకొట్టారు. ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్, హ్యారీ బ్రూక్ (13; 21 బంతుల్లో) నెమ్మదిగా ఆడారు. మూడో వికెట్‌కు 37 బంతుల్లో 34 పరుగుల భాగస్వామ్యం అందించారు. అయితే 34 వద్ద హ్యారీ బ్రూక్‌ను చాహల్ క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో 5 పరుగులకే వాషింగ్టన్ సుందర్ (1)ను హోల్డర్ పెవిలియన్ పంపాడు. దాంతో 39/4తో సన్‌రైజర్స్ స్ట్రాటజిక్ టైమౌట్ తీసుకుంది. ఆ తర్వాతా.. వారికేం భాగస్వామ్యాలు రాలేదు. 4 రన్స్ తేడాతోనే ఫిలిప్స్ (8)ను అశ్విన్, మయాంక్‌ను చాహల్ పెవిలియన్ పంపడంతో హైదరాబాద్ ఓటమి లాంఛనంగా మారింది. ఆఖర్లో ఆదిల్ రషీద్ (18), అబ్దుల్ సమద్, ఉమ్రాన్ మాలిక్ (19*; 8 బంతుల్లో) పోరాటం ఉత్తిదే అయింది.