Jannik Sinner News: ఈ ఏడాది తొలి గ్రాడ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను ఇటలీ కుర్రాడు యానిక్ సినర్ కైవసం చేసుకున్నాడు. ఆదివారం మెల్‌బోర్న్‌లో జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రపంచ నెంబర్ వన్ సినర్ 6-3, 7-6, 6-3తో వరుస సెట్లలో జర్మనీకి చెందిన అలెగ్జాండర్ జ్వెరెవ్‌పై సునాయాస విజయం సాధించాడు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన సినర్.. మళ్లీ ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించడం విశేషం. దీంతో వరుసగా రెండుసార్లు ఆసీస్ ఓపెన్ సాధించినట్లయ్యింది. ఈ ఘనత సాధించిన నాలుగో ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో అమెరికాకు చెందిన ఆండ్రీ అగస్సీ, రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్), నోవాక్ జోకోవిచ్ (సెర్బియా)లు మాత్రమే వరుసగా రెండుసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ సాధించారు. ఇక సినర్ కెరీర్లో ఇది మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్ కావడం విశేషం. మరోవైపు జ్వెరెవ్‌ను అన్ లక్కీ వెంటాడుతుంది. తన కెరీర్‌లో ఇది మూడో గ్రాండ్ స్లామ్ ఫైనల్ ఓటమి కావడం విశేషం. తొలి టైటిల్ సాధించాలని ఉవ్విళ్లూరుతున్న ఈ జర్మన్ ఆటగాడికి లక్కు కలిసి రావడం లేదు. గతంలో యూఎస్ ఓపెన్ 2020, ఫ్రెంచ్ ఓపెన్ 2024 ఫైనల్స్‌లో ఓడిపోయాడు.
హోరాహోరీగా..ఊహించినట్లుగా టాప్ టూ సీడింగ్ ప్లేయర్లైన సిన్నర్, జ్వెరెవ్.. పురుషుల సింగిల్స్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఇక ఆదివారం జరిగిన ఫైనల్లో రెండు గంటల 45 నిమిషాల పాటు ఇరు ఆటగాళ్లు మంచి పోరాట పటిమ ప్రదర్శించారు. అయితే కీలక దశలో ఒత్తిడిని అధిగమించి సిన్నర్ విజేతగా నిలిచాడు. తొలి సెట్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి సిన్నర్ ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత అదే జోరులో ఆ సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సెటల్లో 13 విన్నర్లు, నాలుగు నెట్ పాయింట్లతో సిన్నర్ చెలరేగి పోయాడు. ఇక రెండోసెట్లో జ్వెరెవ్ తన దూకుడును చూపించాడు. ఆరు ఏసులతో రెచ్చిపోయాడు. ఇరు ఆటగాళ్లు తమ సర్వీస్ ను నిలబెట్టుకోవడంతో సెట్ టైబ్రేకర్‌కు దారి తీసింది. అయితే కీలక దశలో 21 అనవసర తప్పిదాలు చేయడం జ్వెరెవ్ కొంపముంచింది. అలాగే మూడు పాయింట్ల ఆధిక్యంతో సెట్‌ను సిన్నర్ కైవసం చేసుకున్నాడు.
నో ఛాన్స్..ఇక మూడో సెట్‌లో పుంజుకోవాలని ఆశించిన జ్వెరెవ్‌కు సిన్నర్ ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఎనిమిదో గేమ్‌లో జ్వెరెవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన సిన్నర్ ఒక్కసారిగా 5-3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత గేమ్‌ను సర్వ్ చేసిన సిన్నర్.. వరుసగా పాయింట్లు సాధించి మ్యాచ్‌తో పాటు ఛాంపియన్షిప్ పాయింట్‌ను దక్కించుకున్నాడు. దీంతో వరుసగా రెండోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో విజేతగా నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో 6 ఏసులు, రెండు డబుల్ పాయింట్లు సాధించిన సిన్నర్.. కీలక దశలో రెండు బ్రేక్ పాయింట్లు సాధించాడు. అలాగే 32 విన్నర్లతో పాటు 18 గేమ్ లను దక్కించుకుని విజేతగా నిలిచాడు. ఇక సిన్నర్ కంటే మిన్నగా 12 ఏస్‌లు బాదిన జ్వెరెవ్.. 45 అవనసర తప్పిదాలతో పాటు, రెండు బ్రేక్ పాయింట్లు సమర్పించుకుని పరాజయం పాలయ్యాడు. ఈ టోర్నీ విజేతగా నిలిచిన సిన్నర్‌కు 2.2 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ లభించింది. రన్నరప్ జ్వెరెవ్‌కు 1.2 మిలియన్ డాలర్ల ప్రైజ్ మనీ దక్కింది.
Also Read: Tilak World Record: తిలక్ తాజా వండర్ - ప్రపంచ రికార్డు బద్దలు, టీ20ల్లో అత్యధిక పరుగులతో...