Virat Kohli, RCB vs KKR: ఈ ఐపీఎల్(IPL)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) పరాజయాల పరంపర కొనసాగుతోంది. కోల్‌కత్తా(KKR)తో జరిగిన మ్యాచ్‌లో కేవలం ఒకే పరుగు తేడాతో బెంగళూరు ఓటమి పాలైంది. చేతిదాకా వచ్చిన మ్యాచ్ చేజారడంతో బెంగళూరు అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. ఈ ఐపీఎల్‌లో రెండో విజయం నమోదు చేస్తామని భావించిన వేళ అనూహ్య ఓటమితో బెంగళూరు జట్టు, అభిమానులు నిర్వేదంలో మునిగిపోయారు. అయితే ఈ మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ అవుటైన తీరు వివాదాస్పదంగా మారింది. కోహ్లీ అవుటైన బంతి నో బాల్ అని... అయినా విరాట్ వెనుదిరగడంతోనే ఒక్క పరుగుల తేడాతో ఓడిపోయామని బెంగళూరు అభిమానులు తెగ బాధపడిపోతున్నారు. క్రీజులో కోహ్లీ ఉంటే మ్యాచ్ ఫలితం మరోలా ఉండేదని అంటున్నారు. ఇంతకీ కోహ్లీ ఆడిన బంతి నో బాలా కాదా అనే చర్చ కూడా ప్రారంభమైంది.
ఇంతకీ నో బాలేనా...?
కోల్‌కత్తాతో జరిగిన మ్యాచ్‌లో ఆరు బాల్స్ ఆడిన కొహ్లీ మంచి దూకుడు మీద ఉన్నాడు. రెండు సిక్సులు, ఓ ఫోర్ కొట్టి... ఎలా అయినా లక్ష్యాన్ని ఛేదించాలన్న కసితో ఉన్నాడు.కానీ హర్షిత్ రానా వేసిన మూడో ఓవర్లో ఫస్ట్ బాల్ కొహ్లీ ఊహించలేని ఎత్తులో వచ్చింది.
ఆ బాల్‌ను ఢిపెన్స్ ఆడాలన్న ఉద్దేశంతో కోహ్లీ ఆడాగా.. అది ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. హర్షిత్ రానానే క్యాచ్ పట్టుకున్నాడు. బాల్ తన నడుముకంటే ఎక్కువ ఎత్తులో వచ్చిందని అది నోబాల్ అని భావించిన కోహ్లీ రివ్యూ అడుగుదామని భావించాడు. కానీ అంతలోపే అంపైర్లే థర్డ్ అంపైర్‌కి రిఫర్ చేశారు. రీప్లేలో చూసిన తర్వాత కోహ్లి క్రీజు బయట ఉన్నాడని, బంతి నడుం కంటే తక్కువ ఎత్తులోనే వచ్చిందని టీవీ అంపైర్ ఔటిచ్చాడు.
ఎలా తేలుస్తున్నారంటే..?
ఈ ఐపీఎల్‌కి ముందే ప్రతీ ఆటగాడి ఎత్తును తీసుకుని అందులో నడుం ఎత్తును ఫీడ్ చేసుకుని నోబాలా కాదా అనేది టెక్నాలజీ సాయంతో డిసైడ్ చేస్తున్నారు. ఆ లెక్కల ప్రకారం విరాట్ కోహ్లీ నడము ఎత్తు నేలపై నుంచి 1.04 మీటర్లు కాగా.. నిన్న కోల్‌కత్తా మ్యాచ్‌లో కోహ్లీ అవుటైన బంతి 0.92 మీటర్ల ఎత్తులోనే ఉంది. దీంతో టెక్నాలజీ సాయంతో ఆ బంతి సరైందేనని అంపైర్ తేల్చారు. సో ఆ రకంగా చూస్తే కొహ్లీ అవుట్. కోహ్లీ క్రీజ్ బయట ఆడాడు కాబట్టి కొహ్లీకి అది ఎత్తులో వచ్చినట్లు అనిపించింది. కానీ క్రీజులో ఉంటే నడుం కంటే తక్కువ ఎత్తులో వచ్చే బాలే అని టెక్నాలజీ చెబుతోంది.
అంపైర్లతో గొడవ
తాను మంచి టచ్‌లో అడుతున్నప్పుడు అవుటవ్వడం.. నోబాల్ విషయంలో ఏర్పడ్డ గొడవ ఇవన్నీ కలిసి కోహ్లీకి కోపం తెప్పించాయి. టీవీ అంపైర్ అవుటిచ్చినా కోహ్లీ కాసేపు క్రీజు దగ్గరే ఉన్నాడు. అంపైర్లతో గొడవకు కూడా దిగాడు. ముందుకు వెళ్లి మళ్లీ వచ్చి.. ఆఖరకు మ్యాచ్ అయిపోయాక అంపైర్లతో వాదిస్తూనే ఉన్నాడు. కోహ్లీ చేసిన ఈ గొడవతో అతనిపై జరిమానా పడే అవకాశం ఉందంటున్నారు. ఏది ఏమైనా ఈ ఐపీఎల్‌లో మరో ఓటమి బెంగళూరు ప్లే ఆఫ్ అవకాశాలను మాత్రం పూర్తిగా దూరం చేసేసింది.