Virender Sehwag Comments: టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంటే ఇప్పుడు ఒక బ్రాండ్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు అతను వెన్నెముక. అయితే, 2008లో జరిగిన మొట్టమొదటి ఐపీఎల్ వేలంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్) కోహ్లీని కాదని ప్రదీప్ సాంగ్వాన్‌ను ఎంచుకోవడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాలను వెల్లడించాడు. జట్టులో బ్యాటర్లు ఎక్కువగా ఉండటం వల్లే కోహ్లీని తీసుకోలేకపోయామని సెహ్వాగ్ స్పష్టం చేశారు.

టాప్ ఆర్డర్ బ్యాటర్ల రద్దీ..సెహ్వాగ్ మాటల ప్రకారం.. 2008లో ఢిల్లీ జట్టులో ఓపెనర్లుగా తాను, గౌతమ్ గంభీర్ ఉండేవాళ్ల‌మ‌ని, త‌మ టీమ్‌లోనే శిఖర్ ధావన్, తిలకరత్న దిల్షాన్ కూడా ఉన్నారని గుర్తు చేశాడు. వారు కూడా ఓపెనర్లే అయినప్పటికీ, తాను గంభీర్ ఓపెనింగ్ చేయడం వల్ల వారిని మూడు, ఐదు స్థానాల్లో ఆడించాల్సి వచ్చేదని తెలిపాడు. నాలుగో స్థానంలో మనోజ్ తివారీ ఉండేవాడని, ఇలా టీమ్ మొత్తం టాప్ ఆర్డర్ బ్యాటర్లతో నిండిపోయిందని పేర్కొన్నాడు. ఆ సమయంలో విరాట్ కోహ్లీ కూడా టాప్ ఆర్డర్‌లోనే బ్యాటింగ్ చేసేవాడని, అతన్ని ఎక్కడ ఆడించాలో త‌మకు అర్థం కాలేదని సెహ్వాగ్ వివరించాడు.

అందుకే సాంగ్వాన్ ఎంపిక..జట్టులో బ్యాటింగ్ విభాగం బలంగా ఉన్నా, బౌలింగ్ లో లోటు ఆ స‌మ‌యంలో కనిపించిందని సెహ్వాగ్ అన్నాడు. విరాట్ కోహ్లీని టీమ్‌లోకి తెచ్చేంత ఖాళీ త‌మ బ్యాటింగ్ లైన్ అప్‌లో లేదని, త‌మకు అప్పుడు ఒక మంచి బౌలర్ అవసరం పడిందని తెలిపాడు. అందుకే కోహ్లీని వదిలేసి ఎడమచేతి వాటం పేసర్ ప్రదీప్ సాంగ్వాన్‌ను తీసుకోవాలని నిర్ణయించుకున్నామ‌ని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు. ఆ వేలంలో ఆర్‌సీబీ కోహ్లీని కేవలం రూ. 12 లక్షలకే దక్కించుకుంది. ఆ తర్వాత కోహ్లీ చరిత్ర సృష్టించడం అందరికీ తెలిసిందే. ఇక వేలం సమయంలో ఢిల్లీకి సెహ్వాగే కెప్టెన్ గా ఉండి, జట్టు మేనేజ్మెంట్ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. మరోవైపు గత 19 ఏళ్లుగా కోహ్లీ ఒకే జట్టు తరపున ఆడుతుండటం విశేషం. 

రికార్డుల రారాజు విరాట్..ఢిల్లీ వదులుకున్న కోహ్లీ, బెంగళూరు జట్టుకు ప్రాణప్రదంగా మారాడు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 272 మ్యాచ్‌లు ఆడిన విరాట్ ఏకంగా 8,889 పరుగులు సాధించాడు. ఇందులో 8 సెంచరీలు, 65 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు నెలకొల్పాడు. ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2026 సీజన్‌లో కూడా కోహ్లీ తన విశ్వరూపం చూపిస్తున్నాడు. ఐదు మ్యాచ్‌ల్లోనే రెండు హాఫ్ సెంచరీలతో కలిపి 228 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ రేసులో అందరికంటే ముందున్నాడు. ఒకవేళ ఆరోజు ఢిల్లీ కోహ్లీని తీసుకుని ఉంటే, ఆ టీమ్ చరిత్ర మరోలా ఉండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఇక ఐపీఎల్ మొద‌లై 19 ఏళ్లు గ‌డుస్తున్న‌ప్ప‌టికీ గ‌తేడాదే ఆర్సీబీ తొలి టైటిల్ నెగ్గ‌గా, ఢిల్లీ మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు ర‌న్న‌ర‌ప్ తో స‌రిపెట్టుకుంది.