MS Dhoni News: చెన్నై సూపర్ కింగ్స్ తాజా కెప్టెన్ ఎంఎస్ ధోనీ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ జ‌రిగింది. బ్రాడ్ కాస్ట‌ర్ కి సంబంధించిన ప్యానెల్లో కామెంటేట‌ర్లుగా వ్య‌వ‌హరిస్తున్న వీరేంద్ర సెహ్వాగ్, తెలుగు ప్లేయ‌ర్ అంబ‌టి తిరుప‌తి రాయుడు, ఆకాశ్ చోప్రా..  ధోనీ గురించి మాట్లాడారు. ముల్లన్ పూర్ లో పంజాబ్ కింగ్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ గురించి మాట్లాడారు. ఇందులో తొలుత ఆకాశ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది జార్ఖండ్ కు చెందిన అన్ క్యాప్డ్ ప్లేయ‌ర్ బ‌రిలోకి దిగాడ‌ని, హెలిక్యాప్ట‌ర్ షాట్లు ఆడేవాడ‌ని చెప్పుకొచ్చాడు. అయితే పంజాబ్ పై మాత్రం చాలా ఆల‌స్యంగా బ్యాటింగ్ కు రావాల్సి వ‌చ్చింద‌ని, అందులో ఆయ‌న పొర‌పాటు లేద‌ని మ్యాచ్ ప‌రిస్థితుల రిత్యా అప్పుడు బ్యాటింగ్ కు వ‌చ్చాడ‌ని పేర్కొన్నాడు. దీనిపై ప‌క్క‌నే ఉన్న రాయుడు.. మైక్ అందుకుని, అతను మరెవరో కాద‌ని, అభిమానులు ముద్దుగా పిలుచుకునే త‌లా అని వ్యాఖ్యానించాడు. తనో స్పెష‌ల్ ప్లేయ‌రని, జ‌ట్టును గెలిపించాల‌నే ఇంటెంట్ తో ఆడాడ‌ని పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో 12 బంతుల్లోనే 27 ప‌రుగులు చేసిన ధోనీ, జ‌ట్టును గెలిపించేందుకు విఫ‌ల‌య‌త్నం చేశాడు. ఈ మ్యాచ్ లో పంజాబ్ కేవలం 18 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది.  అయితే ఈ క్ర‌మంలో మైక్ అందుకున్న సెహ్వాగ్ త‌న దైన శైలిలో రిప్లై ఇచ్చాడు.  

చుర‌క వేసిన సెహ్వాగ్.. ఇక కామెంటేరీలోని ఆకాశ్, రాయుడుల‌కు సెహ్వాగ్ చుర‌క అంటించాడు. రాయుడు చెప్పిన‌ట్లు త‌ను స్పెష‌ల్ ప్లేయ‌ర్ అని , అయితే ఇప్ప‌టికీ త‌న హెలికాప్ట‌ర్ షాట్లు బ్ర‌హ్మాండంగా ఆడ‌తాడ‌ని కితాబిచ్చాడు. ఈ విష‌యం చెప్ప‌డం మాత్రం మ‌రిచాడ‌ని, దీన్ని మెన్ష‌న్ చేసుంటే బాగుండేద‌ని వ్యాఖ్యానించాడు. ఇక ఈ సీజ‌న్ లో బ‌రిలోకి దిగుతున్న అత్యంత ఎక్కువ వ‌య‌సున్న ప్లేయ‌ర్ గా ధోనీ నిలిచాడు. 43 ఏళ్ల వ‌య‌సులో త‌ను వ‌రుస‌గా 18వ ఐపీఎస్ సీజ‌న్ ఆడుతున్నాడు. 

150 క్యాచ్ లు పూర్తి చేసిన ధోనీ.. ఇక పంజాబ్ తో మ్యాచ్ లో ధోనీ ఐపీఎల్లో 150 క్యాచ్ లు పూర్తి చేసిన వికెట్ కీప‌ర్ గా రికార్డుల‌కెక్కాడు. ఈ మ్యాచ్ లో నేహాల్ వ‌ధేరా క్యాచ్ అందుకుని ఈ మార్కును చేరుకున్నాడు. అత‌ని ఖాతాలో 57 స్టంపింగ్స్ కూడా ఉన్నాయి. మాజీ వికెట్ కీప‌ర్ దినేశ్ కార్తీక్ 137 క్యాచ్ ల‌తో రెండో స్తానంలో ఉన్నాడు. ఇక మెగాటోర్నీలో అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆరో ప్లేయ‌ర్ గా ధోనీ నిలిచాడు. ఓవ‌రాల్ గా 5,346 ప‌రుగులు చేసిన ధోనీ.. 39కిపైగా స‌గ‌టుతో 137 స్ట్రైక్ రేట్ తో ప‌రుగులు సాధించాడు. ఇందులో 24 ఫిఫ్టీలు ఉన్నాయి. త‌న అత్య‌ధిక స్కోరు 84 కావ‌డం విశేషం. ఇక ఈ సీజ‌న్ లో ఐదు మ్యాచ్ లాడిన ధోనీ 103 ప‌రుగులు సాధించాడు. 51కిపైగా స‌గటుతో దాదాపు 154 స్ట్రైక్ రేట్ తో ధోనీ ఈ ప‌రుగులు సాధించాడు. ఈ సీజ‌న్ లో అత్య‌ధిక స్కోరు 30 ప‌రుగులు కావ‌డం విశేషం.