Virat Kohli creates history Records in fealding also : విరాట్‌ కోహ్లీ అంటే స్టార్‌ బ్యాటర్‌. ఎలాంటి బౌలర్‌పై అయినా తనదైన ట్రేడ్‌ మార్క్‌ షాట్లతో ఆధిపత్యం చెలాయించగల క్రికెటర్‌. ఎన్నో రికార్డులను నెలకొల్పి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యుత్తమ క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. కానీ విరాట్‌ కోహ్లీ అంటే కేవలం బ్యాటింగ్‌లో అత్యుత్తమ రికార్డులే కాదు. ఫీల్డింగ్‌లోనూ  ఓ అరుదైన రికార్డు విరాట్‌ పేరిట ఉంది. ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా విరాట్‌.. సురేష్‌ రైనాతో కలిసి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వీరిద్దరూ ఐపీఎల్‌లో 109 క్యాచ్‌లను అందుకున్నారు. విరాట్‌ మరో క్యాచ్‌ పడితే సురేష్‌ రైనాను అధిగమిస్తాడు. కోహ్లీ మరో క్యాచ్ అందుకుంటే ఐపీఎల్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంటాడు. విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా తర్వాత కీరన్ పొలార్డ్ మూడో స్థానంలో ఉన్నాడు. పొలార్డ్ 103 క్యాచ్‌లు పట్టాడు. ముంబై ఇండియన్స్ ఆటగాడు రోహిత్ శర్మ ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు 99 క్యాచ్‌లు అందుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌కు చెందిన రవీంద్ర జడేజా 97 క్యాచ్‌లతో ఐదో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్ల జాబితాలో విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, కీరన్ పొలార్డ్, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా పేర్లు టాప్-5లో ఉన్నాయి. సురేష్ రైనా, కీరన్ పొలార్డ్ ఐపీఎల్‌కు వీడ్కోలు పలికారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఐపీఎల్‌లో ఆడుతున్నారు. 



బెంగళూరుకు రెండో పరాజయం
కోల్‌కతా(KKR) చేతిలో బెంగళూరు(RCB) చిత్తుగా ఓడింది. సొంత మైదానంలో 7 వికెట్ల తేడాతో బెంగళూరు ఓటమి చవిచూసింది. ఈ సీజన్ లో ఇప్పటివరకూ జరిగిన అన్ని మ్యాచ్ లలో సొంత వేదిక జట్లే నెగ్గాయి. కానీ ఐపీఎల్ సీజన్ 17లో తొలిసారిగా ప్రత్యర్థి జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు.. విరాట్‌ కోహ్లీ 83 పరుగులతో  రాణించడంతో 182 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని కోల్‌కతా 3 వికెట్లు కోల్పోయి 16.5 ఓవర్లలోనే ఛేదించింది. కోల్‌కతాకు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (83 నాటౌట్‌; 59 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. కామెరూన్‌ గ్రీన్‌ (33), మాక్స్‌వెల్‌ (28), దినేశ్‌ కార్తీక్‌ (20) రాణించారు. కోల్‌కతా బౌలర్లలో హర్షిత్‌ రాణా, రస్సెల్‌ చెరో 2, నరైన్‌ ఒక వికెట్‌ తీశారు. అనంతరం 183 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కత్తా 19 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించింది. వెంకటేష్‌ అయ్యర్‌ 50, సునీల్‌ నరైన్‌ 47, అయ్యర్‌ 39, సాల్ట్‌ 30 పరుగులతో రాణించారు.