Vaibhav Suryavanshi: ఐపీఎల్ చరిత్రలో యంగెస్ట్ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న వైభవ్ సూర్యవంశీ రికార్డులు తిరగరాస్తున్నాడు. రాజస్థాన్ రాయల్స్‌ తరఫున ఆడుతున్న ఈ బుడ్డోడి పేరే ప్రతి క్రికెట్ లవర్ నోట వినిపిస్తోంది. గుజరాత్ టైటాన్స్‌పై 35 బంతుల్లో సెంచరీ సాధించి చిచ్చరపిడుగు అనిపించుకున్నాడు. దీంతో అతని బ్యాక్‌గ్రౌండ్ గురించి అభిమానులు తెలుసుకుంటున్నారు. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.  

వైభవ్ సూర్యవంశీ గురించి27 మార్చి 2011న బిహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలోని మోతీపూర్ గ్రామంలో జన్మించాడు. అతను 9 ఏళ్ల నుంచే  క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. క్రికెట్ అకాడమీలో చేరాడు. ప్రారంభంలో తండ్రి సంజీవ్ సూర్యవంశీ శిక్షణ ఇచ్చాడు. వైభవ్ సూర్యవంశీని 13 ఏళ్ల వయసులోనే రాజస్థాన్ రాయల్స్ రూ. 1.1 కోట్లకు కొనుగోలు చేసింది. గత నెలలో తన 14వ పుట్టినరోజు జరుపుకున్నాడు. ఆ తర్వాత లక్నోతో జరిగిన మ్యాచ్‌తో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. కోటి రూపాయలకుపైగా ధరకు అమ్ముడైన వైభవ్ బేస్ ప్రైస్ రూ.30 లక్షలుగా నిర్ణయించగా, రాజస్థాన్‌తోపాటు ఢిల్లీ క్యాపిటల్స్ అతని కోసం పోటీ పడ్డాయి.  

ఐపీఎల్‌లో అతి చిన్న వాడైన ఈ ఆటగాడికి బ్రాండ్ ఎండార్స్‌మెంట్ ఆఫర్లు రావడం ప్రారంభమైంది. అన్ని ప్రాంతాల్లో అందరి నోళ్లల్లో అతని పేరు వినిపిస్తున్నందున క్యాష్ చేసుకునేందుకు కంపెనీలు క్యూ కడుతున్నాయని సమాచారం. 

వైభవ్ సూర్యవంశీ మొత్తం నికర విలువప్రస్తుతం వైభవ్‌ నికర విలువలో ఎక్కువ భాగం ఐపీఎల్ ఆదాయం నుంచి వచ్చింది. రంజీ ట్రోఫీ, వినూ మన్కడ్ ట్రోఫీలో బిహార్ U-19 జట్టు తరపున ఆడాడు. అతని మొత్తం ఆస్తులు దాదాపు రూ. 2 కోట్లకు చేరువలో ఉంది. 35 బంతుల్లో సెంచరీ చేసినందుకు, బిహార్ ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ. 10 లక్షల బహుమతి ప్రకటించారు.  వైభవ్‌ తండ్రి రైతు, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నారు. వైభవ్ ను మంచి క్రికెటర్‌గా చూడాలని మొదటి నుంచి కలలు కన్నారు. వైభవ్ శిక్షణ కోసం పాట్నాకు వెళ్లడానికి డబ్బు అవసరమై భూమిని అమ్మేశారు.

అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న వైభవ్‌కు రాజస్థాన్ రాయల్స్ యజమాని రంజిత్ బార్తాకుర్ బహుమతిగా కొత్త మెర్సిడెస్-బెంజ్ కారు బహుకరించారు. మ్యాచ్ తర్వాత సోషల్ మీడియాలో ఒక ఫోటో బాగా వైరల్ అవుతోంది, దీనిలో వైభవ్‌కు మెర్సిడెస్ బెంజ్ కారు కీ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ఇది ఏ మెర్సిడెస్ మోడల్ అనేది ఇంకా స్పష్టం కాలేదు. వైభవ్ వయసు ఇప్పుడు 14 ఏళ్లు, కాబట్టి చట్టపరంగా ఆయన ఈ కారును నడపలేరు. 

సోషల్ మీడియాలో పంచుకున్న ఫోటోలో రాజస్థాన్ రాయల్స్ యజమాని రంజిత్ బార్తాకుర్ వైభవ్ సూర్యవంశితో నిలబడి ఉన్నారు. వారి చేతిలో మెర్సిడెస్ కీ ఉంది, దాన్ని వైభవ్‌కు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. రంజిత్ బార్తాకుర్ అస్సాం జోర్హాట్‌కు చెందిన వ్యాపారవేత్త, రాయల్ మల్టీస్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్. 

వైభవ్ సూర్యవంశి గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో 35 బంతుల్లో సెంచరీ సాధించి చరిత్ర సృష్టించాడు. T20 క్రికెట్‌లో అతి తక్కువ వయసులో సెంచరీ చేసిన ఆటగాడు అయ్యాడు.