Twitter trolls Glenn Maxwell as he bags another duck in IPL 2024: ఐపీఎల్‌(IPL)లో ఇప్పటివరకూ రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఆరు మ్యాచ్‌లు ఆడింది. అందులో ఒకే మ్యాచ్‌లో విజయం సాధించింది. మిగిలిన అయిదు మ్యాచుల్లో పరాజయం పాలైంది. ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్(Glenn Maxwell ) పేలవ ఫామ్ కొనసాగిస్తున్నాడు. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లోనూ బరిలోకి దిగిన మ్యాక్స్‌వెల్‌ కేవలం 32 పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు. ఈ సీజన్‌లోనే మ్యాక్సీ మూడుసార్లు డకౌటయ్యాడు. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ మ్యాక్సీపై భగ్గుమంటున్నారు. వాంఖడే వేదికగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో మాక్స్‌వెల్‌ తీవ్ర నిరాశపరిచాడు. కీలక సమయంలో క్రీజులోకి వచ్చిన మాక్సీ.. ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ 13 ఓవర్‌లో శ్రేయాస్‌ గోపాల్‌ వేసిన బంతిని సరిగ్గా అంచనా వేయడంలో విఫలమైన మాక్స్‌వెల్‌.. వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో నాలుగు బంతులు ఎదుర్కొని ఒక్క పరుగులు కూడా చేయకుండా పెవిలియన్‌ చేరాడు. 



చెత్తరికార్డు
ఈ  ఐపీఎల్‌ సీజన్‌లో మ్యాక్స్‌వెల్‌  కేవలం 32 పరుగులు మాత్రమే చేసిన మ్యాక్సీ ఒక్కసారి మాత్రమే  రెండంకెల స్కోర్‌ సాధించాడు. ఈ క్రమంలో అతడి ఆర్సీబీ అభిమానులు దారుణంగా ట్రోలు చేస్తున్నారు. రూ. 11 కోట్లు తీసుకుని ఇంత చెత్తగా ఆడతావా అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో మ్యాక్స్‌వెల్‌ ఐపీఎల్లో చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఐపీఎల్‌లో అత్యధికసార్లు డకౌటైన బ్యాటర్‌గా రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్‌ రికార్డులను మ్యాక్స్‌వెల్‌ సమం చేశాడు. ఐపీఎల్‌ కెరీర్‌లో రోహిత్ శర్మ, దినేశ్ కార్తిక్ చెరో 17సార్లు డకౌట్‌ కాగా మ్యాక్స్‌వెల్‌ వీరితో చేరిపోయాడు. 


అప్పట్లో అఫ్గ‌నిస్థాన్‌పై డ‌బుల్ సెంచ‌రీ: 
మ్యాక్స్‌వెల్ ఐపీఎల్ 16వ సీజ‌న్‌లో ఉతికేశాడు. దాంతో, అత‌డిపై ఆర్సీబీ భారీ ఆశ‌లే పెట్టుకుంది. ఎందుకంటే వ‌ర‌ల్డ్ క‌ప్‌లో మ్యాక్సీ అఫ్గ‌నిస్థాన్‌పై డ‌బుల్ సెంచ‌రీతో ఆస్ట్రేలియాను గెలిపించాడు. ఒంట‌రి పోరాటంతో ఆసీస్‌కు సెమీస్ బెర్తు ఖాయం చేశాడు. ఇక రాబోయే సీజ‌న్‌లో అత‌డి ఆట‌కు తిరుగులేదని ఆర్సీబీ ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ, మ్యాక్సీ తీవ్రంగా నిరాశ‌ప‌రుస్తున్నాడు.  



ముంబైకి రెండో విజయం
ఐపీఎల్‌లో బెంగళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై ముంబై ఇండియన్స్‌ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి.... 196 పరుగులు చేసింది. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పైనా బెంగళూరు బ్యాటర్లు తడబడ్డారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కోహ్లీ తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం మూడే పరుగులు చేసి వెనుదిరిగాడు. బెంగళూరు సారధి ఫాఫ్‌ డుప్లెసిస్‌, రజత్‌ పటిదార్‌, దినేశ్‌ కార్తీక్ అర్ధ శతకాలతో మెరిశారు. బుమ్రా అయిదు వికెట్లతో బెంగళూరు పతనాన్ని శాసించాడు. అనంతరం 197 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై మరో 27 బంతులు మిగిలి ఉండగానే కేవలం మూడు వికెట్లు కోల్పోయి సునాయసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ రాణించగా... సూర్యకుమార్‌ యాదవ్‌ ధనాధన్‌ బ్యాటింగ్‌తో ముంబైకు ఘన విజయాన్ని కట్టపెట్టాడు. ఇషాన్‌ కిషన్‌ 69, రోహిత్‌ శర్మ 38 పరుగులు చేశారు. సూర్యకుమార్‌ యాదవ్‌  కేవలం 19 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సులతో 52 పరుగులు చేశాడు.