Tim David Fined for Obscene Gesture in RCB vs MI Match: ఐపీఎల్ లో గెలుపోటములు సహజమే అయినా, ఆటగాళ్ల ప్రవర్తన అనేది చాలా ముఖ్యం. ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ ప్లేయర్ టిమ్ డేవిడ్ హద్దులు దాటి ప్రవర్తించాడు. ఈ మ్యాచ్ లో అతను డకౌట్ అయినప్పటికీ, డగౌట్ లో కూర్చుని తన టీమ్ ను ఉత్సాహపరిచాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత అతను చేసిన ఒక అభ్యంతరకరమైన సైగ కెమెరాలకు చిక్కింది. గతంలో ముంబై ఇండియన్స్ కు ఆడిన డేవిడ్, ఇప్పుడు అదే టీమ్ పై గెలిచిన జోష్ లో తన ఫీలింగ్స్ ను కంట్రోల్ చేసుకోలేకపోయాడు.

Continues below advertisement

బీసీసీఐ కొరడాటిమ్ డేవిడ్ ప్రవర్తన ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.6ను ఉల్లంఘించినట్లు మ్యాచ్ రిఫరీ అమిత్ శర్మ నిర్ధారించారు. ఇది అశ్లీలమైన లేదా అభ్యంత‌ర‌కరమైన సైగగా పరిగణిస్తూ, అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం జ‌రిమానా వేశారు. టిమ్ డేవిడ్ కూడా తన తప్పును ఒప్పుకోవడంతో వివాదం సర్దుమణిగింది. కానీ స్టార్ ఆటగాళ్లు ఇలాంటి పనులు చేయడం ఫ్యాన్స్ ను కాస్త నిరాశకు గురిచేసింది.

ఉత్కంఠ రేపిన మ్యాచ్..ఈ మ్యాచ్ ఆద్యంతం నరాలు తెగే ఉత్కంఠతో సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 166 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సున్నాకే వెనుదిరగగా, దేవదత్ పడిక్కల్ 12 పరుగులకే అవుట్ అయ్యాడు. కెప్టెన్ రజత్ పాటిదార్ కూడా 8 పరుగులకే వెనుదిరగడంతో ఆర్సీబీ 39 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో కృనాల్ పాండ్యా ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. క్రాంప్స్ (కండరాలు పట్టేయడం) ఇబ్బంది పెడుతున్నా లెక్కచేయకుండా 46 బంతుల్లో 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 73 పరుగులు చేసి జట్టును విజయానికి దగ్గరగా తీసుకెళ్లాడు.

భువీ మ్యాజిక్..బౌలింగ్ లో 4 వికెట్లు తీసి ముంబైని దెబ్బకొట్టిన భువనేశ్వర్ కుమార్, బ్యాటింగ్ లోనూ మెరిశాడు. ఆఖరి ఓవర్లో విజయానికి 15 పరుగులు కావాల్సిన సమయంలో భువీ ఒక సిక్సర్ బాది ఒత్తిడి తగ్గించాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా, ఆర్సీబీ ఆ పరుగులు తీసి థ్రిల్లింగ్ విక్టరీ నమోదు చేసింది. ముంబై బౌలర్లలో కార్బిన్ బాష్ 4 వికెట్లతో చెలరేగినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో ఆర్సీబీ 14 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లగా, డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ లీగ్ నుంచి నిష్క్రమించింది.

కీలక మలుపులు..మ్యాచ్ 18వ ఓవర్లో నమన్ ధీర్, తిలక్ వర్మ మధ్య జరిగిన మిస్ కమ్యూనికేషన్ వల్ల కృనాల్ పాండ్యా ఇచ్చిన క్యాచ్ మిస్ అయింది. ఆ ఛాన్స్ ను వాడుకున్న కృనాల్ వరుస సిక్సర్లతో మ్యాచ్ ను మలుపు తిప్పాడు. చివర్లో టిమ్ డేవిడ్ సున్నాకే అవుట్ అయినా, భువీ ఫినిషింగ్ టచ్ తో బెంగళూరు గెలిచింది. ఓవరాల్ గా ఈ మ్యాచ్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లా సాగింది. ఇటు ఆట పరంగా, అటు వివాదాల పరంగా ఈ సండే మ్యాచ్ క్రికెట్ లవర్స్ కు మంచి మసాలా అందించింది.