IPL 2024: ఐపీఎల్‌లో ఒక్కో సీజన్‌లో ఒక్కొక్కరు హీరోలుగా వెలుగుతుంటారు. ఈసారి ఎక్కువ కుర్రకారులు మెరిశారు. ఫిల్‌సాల్ట్‌ నుంచి నితీష్ కుమార్ రెడ్డి వరకు ఆశ్చర్యపోయే ఆటతో ఆకట్టుకున్నారు.  


ఫిల్ సాల్ట్‌ (Phil Salt)
ఫిల్‌ సాల్ట్‌లో చాలా విచిత్రమైన స్టోరీ. ఈయన్నివేలంలో తీసుకోవడానికి ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. అంతే కుందా జాసన్ రాయ్‌ కేకేఆర్ జట్టు నుంచి వెళ్లిపోకుంటే కూడా ఫిల్‌ సాల్ట్ మెరుపులు మనం మిస్ అయ్యే వాళ్లం. జాసన్ రాయ్‌ వైదొలగడంతో కేకేఆర్ జట్టులోకి వచ్చిన ఫిల్ సాల్ట్‌ తనకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. సునీల్‌ నరైన్‌తో కలిసి కోల్‌కతాకు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చిన అందర్నీ మెస్మరైజ్ చేశాడు. 12 మ్యాచ్‌లు ఆడిన సాల్ట్‌ 182 స్ట్రైక్ రేట్‌తో 435 పరుగులు చేశాడు. కేకేఆర్‌ టీంలో ఎక్కువ పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా ఉన్నాడు. లీగ్‌ దశల్లో మంచి ఆటతీరుతో కేకేఆర్ ప్లే ఆఫ్‌కు వెళ్లడానికి తన వంతు పాత్ర పోషించాడు. 


మయాంక్ యాదవ్‌(Mayank Yadav)
ఐపీఎల్‌ 2024లో బుల్లెట్స్ లాంటి బంతులకో ప్రత్యర్థి బ్యాటర్లను వణికించే బౌలర్లతో మయాంక్‌ మొదటి స్థానంలో ఉంటాడు. అత్యంత వేగవంతమైన బంతులు వేసి ఐపీఎల్ రికార్డులను తిరగరాశాడు. ఆడింది నాలుగు మ్యాచ్లే అయినా కీలకమైనవిగా చెప్పుకోవాల్సి ఉంటుంది. భారత్ పేస్ బౌలింగ్‌ ఓ తురుపు ముక్క దొరికాడన్న భావన కల్పించాడు. పంజాబ్ కింగ్స్‌పై 147కేపీహె్‌తో వేసిన బంతితో తన ప్రయాణాన్ని మయాంక్ ప్రారంభించాడు. తరువాత అతని స్పీడ్‌ 155.8 కిలోమీటర్లకు చేరింది. ఇలా బంతితో నిప్పులు చెరిగిన మయాంక్‌ తన మొదటి మ్యాచ్‌లో మూడు వికెట్లు పడగొట్టి 27 పరుగులు ఇచ్చాడు. రెండో మ్యాచ్‌ ఆర్సీబీతో కూడా తగ్గేదేలే అనే ప్రతిభను చూపాడు. కేవలం 14 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌ అవార్డు కూడా గెల్చుకున్నాడు. తర్వాత మ్యాచ్‌ లో గాయాలు పాలైన టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. నాలుగు మ్యాచ్‌లు ఆడిన మయాంక్‌ ఏడు వికెట్లు తీసుకున్నాడు. మయాంక్ ఈ టోర్నీలో వేసిన 12.1 ఓవర్లు మాత్రం అతని ప్రతిభను చాటి చెప్పాయి. 


ట్రిస్టన్ స్టబ్స్(Tristan Stubbs)
ముంబై ఇండియన్స్‌ తరఫున రెండు సీజన్‌లు ఆడినా పెద్దగా పేలని టపాసు ట్రిస్టన్ స్టబ్స్. కానీ టీం మారిన తర్వాత గేర్ మార్చాడు స్టబ్స్.  ముంబై ఇండియన్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కి వచ్చిన తర్వాత ది బెస్ట్‌ ఫినిషర్‌గా మారిపోయాడు. ఈ ఐపీఎల్‌లో 190 సగటుతో 378 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌ టీంలోనే రెండో అత్యధిక పరుగులు వీరుడు స్టబ్స్‌. ఫీల్డర్లు ఏ పొజిషన్‌లో ఉన్నా బంతి ఎలాంటిదైనా గ్రౌండ్ చుట్టూ ఆడి తన స్టామినా ఏంటో చూపించాడు. బౌలర్లపై అతను క్రూరంగా విరుచుకుపడిన విధానం క్రికెట్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే ఈ సీజన్‌లో మెరిసిన హీరోల్లో ఇతను కూడా ఒకడు. స్పీన్, పేస్‌ ఎలాంటి బౌలర్లపైనా అయినా విరుచుకు పడటం స్టబ్స్ స్పెషాలిటీ. డెత్ ఓవర్‌లలో స్టబ్స్‌ విజృంభణ వర్ణానాతీతం. 17 నుంచి 20 ఓవర్ల మధ్య ఇతని స్ట్రైక్ రేట్‌ 297 అంటే  అర్థం చేసుకోవచ్చు. ఈ ఓవర్లలో స్టబ్స్ ఎదుర్కొన్న 75 బంతుల్లో కేవలం రెండంటే రెండే డాట్ బాల్స్. 


హర్షిత్ రానా(Harshit Rana)
వివాదాలతోపాటు ఆటతీరుతోనూ ఆకట్టుకున్న మరో క్రికెటర్‌ హర్షిత్‌ రానా. 2022 నుంచి ఆడుతున్నప్పటికీ పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. ఈసారి మాత్రం నిలకడగా వికెట్లు తీస్తు కేకేఆర్‌కు అండగా నిలబడిన ఆటగాళ్లలో ఒకడు. పపర్‌ప్లే, మిడిల్‌, డెత్‌ ఓవర్లలో కూడా వికెట్లు తీయగల సత్తా తనకు ఉందని నిరూపించుకున్నాడు. ఇతను తీసిన 19 వికెట్లలో పవర్‌ ప్లేలో నాలుగు వికెట్లు తీస్తే.. మిడిల్‌ ఓవర్‌లలో తొమ్మిది తీశాడు. ఆఖరి ఓవర్లలో ఆరు వికెట్లు పడగొట్టి ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. 


వికెట్లు తీసిన తర్వాత రానా చేసే సైగలు, సెలబ్రేషన్స్‌ ప్రత్యర్థులను రెచ్చగొట్టేలా ఉండేవి. అందుకే ఒక మ్యాచ్‌ నిషేధం ఎదుర్కొన్నాడు. మ్యాచ్‌ ఫీజులో కూడా కోత పడింది. 22 ఏళ్ల ఈ ఆటగాడు కేకే ఆర్‌లోనే ఎక్కువ వికెట్లు తీసిన రెండో బౌలర్‌.  మొత్తంగా ఐపీఎల్‌లో టాప్ బౌలర్లలో నాల్గో ఆటగాడు. హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో కూడా 24 పరుగులకే 2 వికెట్లు తీసి కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 


ఫ్రేజర్-మెక్‌గర్క్ (Jake Fraser-McGurk)
ఎంగిడీ స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ టీంలోకి వచ్చిన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ తన ఆట తీరుతో అందర్నీ మెప్పించాడు. ఆస్ట్రేలియా టీంను మాత్రం మెప్పించలేకపోయాడు. ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించినా ఐసీసీ వరల్డ్ కప్‌కు మాత్రం ఇతన్ని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎంపిక చేయలేదు. 22 ఏళ్ల మెక్‌గర్క్ ఈ ఐపీఎల్‌లో 234 స్ట్రైక్ రేట్‌తో 330 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. అందులో 31 బంతుల్లో చేసిన ఫిఫ్టీయే అత్యంత నెమ్మదిగా చేసిన హాఫ్ సెంచరీ. నాలుగింటిలో 15 బంతుల్లో చేసిన అర్థశతకం కూడా ఉంది.


శశాంక్ సింగ్ (Shashank Singh)
శశాంక్ సింగ్‌ను పంజాబ్‌ కింగ్స్‌ను ఎందుకు తీసుకున్నారో అతను మ్యాచ్‌లోకి దిగే వరకు ఎవరికీ తెలియలేదు. పంజాబ్‌లో మెరిసిన ఆటగాళ్లలో శశాంక్ సింగ్ ఒకరు. ఈ సీజన్‌లో 354 పరుగులు చేసిన శశాంక్ పంజాబ్‌ టీంలో అత్యధిక రన్స్ కొట్టిన బ్యాటర్‌గా నిలిచాడు.  14 మ్యాచ్‌లు ఆడిన శశంక్‌ స్ట్రైక్ రేట్‌ 165. కేకేఆర్ నిర్ధేశించిన 262 పరుగుల లక్ష్యాన్ని పంజాబ్‌ కింగ్స్ అవలీలగా ఛేదించింది. ఈ మ్యాచ్‌లో శశాంక్ 28 బంతుల్లో 68 పరుగులు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. మొదటి మ్యాచ్‌లోనే హైదరాబాద్‌పై 25 బంతుల్లో 46 పరుగులు చేసి తన సత్తా చాటాడు. ఆ మ్యాచ్‌లో పంజాబ్‌ కేవలం 2 పరుగుల తేడాతో ఓడిపోయింది.


ట్రావిస్ హెడ్ (Travis Head)
అంతర్జాతీయ కెరీర్‌లో దుమ్ము దులిపేసిన అటగాడు ఐపీఎల్‌లో అత్యద్భుతంగా రాణించడం చాలా అరుదుగా చూస్తుంటాం. అలాంటి అరుదైన ఆటగాళ్లలో ట్రావిస్‌ హెడ్ ఒకడు. ఐపీఎల్‌ 2016, ఐపీఎల్‌ 2017 సీజన్స్‌లో హెడ్‌ ఆడినప్పటికీ చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు. ఈసారి మాత్రం అభిషేక్ శర్మతో కలిసి షేక్ ఆడించేశాడు. హైదరాబాద్‌ టీం ఫైనల్ వరకు వచ్చింది అంటే అందులో హెడ్‌దే ప్రధాన భూమిక. ఈ సీజన్‌లో అతను 192 స్ట్రైక్ రేట్‌తో 567 పరుగులు చేశాడు. మొదటి పవర్‌ప్లేలో వీరవిహారం చేసి ప్రత్యర్థులను వణికించాడు. తొలి సిక్స్ ఓవర్స్‌లో అతని స్ట్రైక్ రేట్‌ 208 అంటే ఆశ్చర్యం కలగమానదు. ఈ ఓవర్స్‌లో అతని కొట్టిన రన్స్‌ 402. నాలుగు హాఫ్ సెంచరీలు కొట్టిన హెడ్‌ ఇందులో మూడింటిని రికార్డు స్థాయిలో కొట్టాడు. ఆర్సీబీపై హెడ్ 39 బంతుల్లో చేసిన సెంచరీ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైనది. 


అభిషేక్ శర్మ (Abhishek Sharma)
ఈసారి హైదరాబాద్‌కు ఆడిన ఆటగాళ్లలో హెడ్‌, అభిషేక్ జోడీ అద్భుతాలు చేసింది. 2022 నుంచి అభిషేక్‌ శర్మ ఆడుతున్నప్పటికీ ఈసారి మాత్రం జూలు విదిల్చాడు. స్పిన్, పేస్‌ అనే ముచ్చటే లేకుండా అతి క్రూరంగా బంతులను బౌండరీలు దాటించాడు. పేస్‌ను ధీటుగా ఎదుర్కొన్న అభిషేక్‌ 188.96 స్ట్రైక్ రేట్‌తో దంచికొట్టాడు. అదే టైంలో స్పిన్నర్స్‌పై కూడా కనికరం లేకుండా బాది పడేశాడు. స్పిన్ బౌలింగ్‌లో అతని స్ట్రైక్ రేట్‌ 235గా ఉంది. 23 ఏళ్ల అభిషేక్ ఈ సీజన్‌లో 42 సిక్స్‌లు బాదాడు. ఇది ఈ ఐపీఎల్‌లో అత్యధికం. అంతే కాకుండా ఏ సీజన్‌లోనైనా ఈ స్థాయిలో సిక్స్‌లు కొట్టిన భారతీయ బ్యాటరే లేడు. అతను ఏ మ్యాచ్‌లో కూడా 28 బంతులు కంటే ఎక్కువ ఆడలేదు. ఇలా 30 కంటే తక్కువ బంతులు ఆడి 400 కంటే ఎక్కువ పరుగుల సాధించిన తొలి బ్యాటర్‌ అభిషేక్ శర్మ. క్యాలిఫైయర్ మ్యాచ్‌ 2 లో రాజస్థాన్‌పై కీలకమైన రెండు వికెట్లు తీసి హైదరాబాద్‌ను ఫైనల్‌కు తీసుకొచ్చాడు. 


అభిషేక్ పోరెల్ (Abishek Porel)
ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న అభిషేక్‌ పోరెల్‌ మొదటి మ్యాచ్‌లో ఇంపాక్ట్ ప్లేయర్‌గా బరిలోకి దిగి తన టాలెంట్‌ను కెప్టెన్‌కు చూపించాడు. కేవలం 10 బంతుల్లోనే  32 పరుగులు చేసి టీంకు తన అవసరం ఎంత ఉందో చెప్పాడు. అప్పటి నుంచి జట్టులో రెగ్యులర్ ప్లేయర్‌గా మారిన అభిషేక్‌ పోరెల్‌.... మూడు 14 మ్యాచ్‌లు ఆడి 160 స్ట్రైక్ రేటుతో 327 పరుగులు చేశాడు. అందులో రెండు అర్థ సెంచరీలు ఉన్నాయి. 


నితీష్ రెడ్డి (Nitish Kumar Reddy)
ఐపీఎల్‌ 2024లో మెరిగిన మరో తెలుగు తేజం నితీష్ రెడ్డి. 11 మ్యాచ్‌లు ఆడిన నితీష్‌ 303 పరుగులు చేశాడు. అతను స్ట్రైక్ రేట్‌ 143. మంచి ఆల్‌రౌండర్‌గా రాణించి మూడు కీలకమైన వికెట్లు కూడా తీశాడు. పంజాబ్‌ కింగ్స్‌పై 37 బంతుల్లో చేసిన 64 పరుగులు, రాజస్థాన్‌లో జరిగిన ఓ మ్యాచ్‌లో 42 బంతుల్లో చేసిన 76 పరుగులు హైదరాబాద్ విజయానికి కారణమయ్యాయి. ఫిట్‌ ఉన్న నితీష్‌ ఫీల్డింగ్‌లో కూడా అద్భుతంగా రాణించాడు.