Hyderabad to host two IPL matches in phase 1: ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్(Indian Premier League) షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 22న ఐపీఎల్‌(IPL) మహా సమరం ప్రారంభం కానుంది. దేశంలోనే పూర్తిగా ఐపీఎల్‌ నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఐపీఎల్ 17వ ఎడిషన్ మొదటి 15 రోజుల షెడ్యూల్‌ను మాత్రమే ప్రకటించారు. మార్చి 22 నుంచి ఏప్రిల్‌ 7వ తేదీ వరకు జరిగే మ్యాచ్‌లను తెలిపారు. చెన్నై సూపర్ కింగ్స్‌... రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్‌ జరగనుంది. అయితే హైదరాబాద్‌ అభిమానులు కూడా ఈసారి మ్యాచ్‌ల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తొలి మ్యాచ్‌లో ఆరెంజ్‌ ఆర్మీ.. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(Kolkata Knight Riders)తో తలపడనుంది. హైదరాబాద్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈ షెడ్యూల్‌లో సన్‌రైజర్స్‌ రెండు మ్యాచ్‌లు ఆడనుంది. మార్చి 27న ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌.. ఐదుసార్లు ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌ను ఢీకొననుంది. 



తొలి షెడ్యూల్‌లో నాలుగు మ్యాచ్‌లు
15 రోజులు ప్రకటించిన తొలి షెడ్యూల్‌లో హైదరాబాద్ నాలుగు మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. మార్చి 23న కేకేఆర్‌తో తొలి మ్యాచ్‌ ఆడే సన్‌ రైజర్స్‌.. ఆ తర్వాత ముంబై ఇండియన్స్‌, గుజరాత్‌ టైటాన్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. రెండు మ్యాచ్‌లు సొంత గ్రౌండ్‌లో ఆడనున్న హైదరాబాద్‌.. మిగతా రెండింటినీ కోల్‌కతా, అహ్మదాబాద్‌లో ఆడాల్సి ఉంది. మార్చి 23వ తేదీన కోల్‌కతా వర్సెస్‌ హైదరాబాద్ – కోల్‌కతా... మార్చి 27వ తేదీన  హైదరాబాద్‌ వర్సెస్‌ ముంబై మార్చి 31న గుజరాత్‌ వర్సెస్‌ హైదరాబాద్‌ – అహ్మదాబాద్‌ … ఏప్రిల్‌ 5న హైదరాబాద్‌ వర్సెస్‌ చెన్నై  మ్యాచ్‌లు జరగనున్నాయి. 


సన్‌రైజర్స్‌ జట్టు : అబ్దుల్‌ సమద్‌, అభిషేక్‌ శర్మ, ఎయిడెన్‌ మార్క్‌రమ్‌ (కెప్టెన్‌), మార్కో జాన్సెన్‌, రాహుల్‌ త్రిపాఠి, వాషింగ్టన్‌ సుందర్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, సన్విర్‌ సింగ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, మయాంక్‌ అగర్వాల్‌, టి. నటరాజన్‌, అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌, మయాంక్‌ మార్ఖండే, ఉపేంద్ర సింగ్‌ యాదవ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, ఫజల్‌హక్‌ ఫరూఖీ, షాబాజ్‌ అహ్మద్‌, ట్రావిస్‌ హెడ్‌, వనిందు హసరంగ, పాట్‌ కమిన్స్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, ఆకాశ్‌ సింగ్‌, జతవేద్‌ సుబ్రహ్మణ్యన్‌ 


గుజరాత్‌కు బిగ్‌ షాక్
గాయం కారణంగా భారత సీనియర్ పేస్‌ బౌలర్‌ మహమ్మద్ షమి(Mohammed Shami) వచ్చే నెలలో జరగనున్న ఇండియన్‌ ప్రీమియర్ లీగ్‌-IPLలో ఆడటంలేదని..బీసీసీఐ(BCCI) వర్గాలు తెలిపాయి. షమి ఎడమకాలి చీలమండకు గాయం వల్ల యునైటెడ్ కింగ్‌డమ్‌(UK) లో శాస్త్ర  చికిత్స చేయించుకోవాల్సి ఉందని బోర్డు వర్గాలు చెప్పాయి. 33 ఏళ్ల షమి. గత నవంబరులో ప్రపంచకప్‌ ఫైనల్‌లో చివరి మ్యాచ్ ఆడాడు.గాయం కారణంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న  టెస్ట్‌ సిరీస్‌కు అతనికి విశ్రాంతి ఇచ్చారు. జనవరి చివరి వారంలో లండన్‌లో కొన్ని చీలమండ ఇంజెక్షన్లు తీసుకున్న షమి  తేలికపాటి పరుగులు సాధన చేశాడు. అయితే 3 వారాల తర్వాత ఇంజెక్షన్ల ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో  నొప్పి మళ్లీ తిరగబెట్టింది. ఇక శస్త్రచికిత్స మినహా మరే మార్గంలేదని బీసీసీఐ వర్గాలు చెప్పాయి. నొప్పితోనే ప్రపంచకప్ ఆడిన షమి ఆ ప్రభావం మ్యాచ్‌లపై పడనివ్వలేదని సమాచారం.