IPL 2025 RCB Vs PBKS Qualifier 1 Updates: ఐపీఎల్ క్వాలిఫయర్ 1 రంజుగా సాగుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. లీగ్ దశలో తిరుగులేని విజయాలతో దూసుకెళ్లి, టాప్ పొజిషన్ లో నిలిచిన పంజాబ్ కింగ్స్ .. తమ పాత తరహా ఆటనే మరోసారి పునరావృతం చేసింది. ముఖ్యంగా నిర్లక్ష్య పూరిత బ్యాటింగ్ ప్రదర్శనతో నిరాశ పరిచింది. తాజాగా పంజాబ్ బ్యాటర్ల శైలిని దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ తూర్పార పట్టాడు. క్వాలిఫయర్ 1 లాంటి మ్యాచ్ లో ఇలాంటి బ్యాటింగ్ ప్రదర్శనను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదని వాపోయాడు. తమ షాట్లతో బ్యాటర్లు సూసైడ్ లాంటి ఆటతీరును ప్రదర్శించాడని ధ్వజమెత్తాడు. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 14.1 ఓవర్లలో 101 పరుగులకు ఆలౌటవగా, ఆర్సీబీ కేవలం పది ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసి ఫైనల్లోకి అర్హత సాధించింది. ఈ టోర్నీలో ఆర్సీబీ నాలుగోసారి ఫైనల్ కు చేరగా, 9 ఏళ్ల తర్వాత ఈ ఘనతను సాధించింది.
చేతులెత్తేసిన బ్యాటర్లు..ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ బౌలర్లు అనవసరమైన దూకుడు షాట్లతో వికెట్లు పారేసుకున్నారు. ఆరంభంలో యువ ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి బంతిని కొట్టడంతో ప్రారంభమైన వికెట్ల పతనం అలా అలా సాగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రభ్ సిమ్రాన్ సింగ్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, జోష్ ఇంగ్లీస్ పేసర్ల బౌలింగ్ లో స్లాగ్ షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. నిజానికి నాలుగో ఓవర్లోనే రెండు వికెట్లు కోల్పోయన దశలో బాధ్యతా రహితమైన షాట్ ఆడి, శ్రేయస్ వికెట్ పారేసుకున్నాడని గావస్కర్ మండిపడ్డాడు. ఇక సుయాశ్ శర్మ సంధించిన గూగ్లీలను రీడ్ చేయడంలో విఫలమైన బ్యాటర్లు వికెట్లు పారేసుకున్నారు. ఈ మ్యాచ్ లో చెరో మూడు వికెట్లతో జోష్ హేజిల్ వుడ్, సుయాష్ సత్తా చాటారు. ఇక అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనకు గాను సుయాశ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
మరో చాన్స్.. టేబుల్ టాపర్ గా నిలిచి, టాప్-2లో ప్లేస్ దక్కించుకున్నందుకుగాను పంజాబ్ కు ఫైనల్ చేరేందుకు మరో చాన్స్ దక్కనుంది. జూన్ 1న జరిగే క్వాలిఫయర్ 2లో విజయం సాధిస్తే, ఎంచక్కా ఫైనల్ కు చేరుకోవచ్చు. అక్కడ ఆర్సీబీతో ప్రతీకార మ్యాచ్ ఆడొచ్చు. ఐపీఎల్లో ప్లే ఆఫ్ మ్యాచ్ ల ద్వారా టాప్ -2లో నిలిచిన జట్లకు ఫైనల్ చేరేందుకు రెండు అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాన్ని అయినా సద్వినియోగం చేసుకోవాలని పంజాబ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఇక ఈనెల 30న అంటే శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు.. క్వాలిఫయర్ 2కి అర్హత సాధిస్తుంది. అక్కడ పంజాబ్ తో మ్యాచ్ ఆడుతుంది. ఏదేమైనా అద్భుత ఆటతీరుతో ప్లే ఆఫ్స్ కు చేరిన పంజాబ్.. ఇలా చెత్త ఆటతీరుతో క్వాలిఫయర్ 1లో ఓడిపోవడం ఆ జట్టు అభిమానులను బాధిస్తోంది. మరోవైపు సునాయసంగా క్వాలిఫయర్ 1ను క్లియర్ చేసి, నాలుగో సారి ఫైనల్ కు చేరిన ఆర్సీబీని చూసి, ఆ జట్టు అభిమానులు ఫుల్ పార్టీ మూడ్ లోకి వెళ్లి పోయారు.