IPL 2025 RCB Beat PBKS In Qualifier 1: దూకుడు మీదున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తొలి టైటిల్ వేటలో ఒక్క అడుగు దూరంలో నిలిచింది. 9 ఏళ్ల తర్వాత ఫైనల్ కు చేరుకుంది. గురువారం ముల్లన్ పూర్ లో జరిగిన క్వాలిఫయర్-1లో ఆతిథ్య పంజాబ్ కింగ్స్ పై 8 వికెట్లతో గెలుపొందింది. దీంతో ఈ టోర్నీలో నాలుగోసారి ఫైనల్ కు దూసుకెళ్లింది. అంతకుముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ ఘోర ప్రదర్శన చేసింది. కేవలం 14.1 ఓవర్లలో 101 పరుగులకు కుప్పకూలింది. లీగ్ దశలో చేసిన ప్రదర్శనకు కంప్లీట్ వ్యతిరేకంగా ఈ మ్యాచ్ లో పంజాబ్ ఆడింది. మిడిలార్డర్ బ్యాటర్ మార్కస్ స్టొయినిస్ (17 బంతుల్లో 26, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. స్వింగ్ కు అనుకూలించిన పిచ్ పై ఆర్సీబీ బౌలర్లు చెలరేగారు. జోష్ హేజిల్ వుడ్, సుయాశ్ శర్మ మూడేసి వికెట్లతో సత్తా చాటారు. చేజింగ్ ను 10 ఓవర్లలో 2 వికెట్లకు 106 పరుగులు చేసిన ఆర్సీబీ ఈజీ విక్టరీని సాధించింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ విధ్వంసకర అజేయ ఫిఫ్టీ (27 బంతుల్లో 56 నాటౌట్, 6 ఫోర్లు, 3 సిక్సర్లు)తో చెలరేగాడు. జెమిసన్, ముషీర్ ఖాన్ కు తలో వికెట్ దక్కింది. ఈ విజయంతో టోర్నీలో నాలుగోసారి ఫైనల్ కు ఆర్సీబీ చేరింది.
వికెట్లు టపటపా..ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ ను ఆర్సీబీ బౌలర్లు కట్టడి చేశారు. పిచ్ పై దొరికిన మద్దతును ఉపయోగించుకుని చెలరేగి ఆడారు. పవర్ ప్లే లోపల ప్రియాంశ్ ఆర్య (7), ప్రభ్ సిమ్రాన్ సింగ్ (18), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (2), జోష్ ఇంగ్లీస్ (4) వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత కూడా వరుస వికెట్లు కోల్పోతూనే ఉంది. మధ్యలో స్టొయినిస్ తోపాటు అజ్మతుల్లా ఒమర్ జాయ్ (18) ఫర్వాలేదనిపించడంతో పంజాబ్ కాస్త కోలుకున్నట్లు కనిపించింది. వీరిద్దరు బౌండరీలతో చెలరేగడంతో వంద పరుగులను పంజాబ్ చేరుకోగలిగింది. అయితే ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోవడంతో ముషీర్ ఖాన్ ను ఇంపాక్ట్ ప్లేయర్ గా తీసుకున్నా, అతను డకౌట్ అయ్యాడు. దీంతో పంజాబ్ ఇన్నింగ్స్ 85 బంతుల్లోనే ముగిసింది. మిగతా బౌలర్లలో యశ్ దయాల్ కు రెండు వికెట్లు దక్కాయి.
సాల్ట్ విధ్వంసం..చిన్న టార్గెట్ తో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు విరాట్ కోహ్లీ (12), సాల్ట్ శుభరంభాన్నిచ్చారు. తొలి వికెట్ కు 30 పరుగులను 10కిపైగా రన్ రేట్ తో సాధించారు. ఒక ఎండ్ లో కోహ్లీ యాంకర్ ఇన్నింగ్స్ ఆడగా, సాల్ట్ మాత్రం చెలరేగి, బౌండరీలతో సత్తా చాటాడు. ఆ తర్వాత మయాంక్ అగర్వాల్ (19) తో కూడా సాల్ట్ రెండో వికెట్ కు 54 పరుగులు జోడించడంతో ఆర్సీబీ విన్నింగ్ పొజిషన్లోకి వచ్చింది. ఆ తర్వాత మయాంక్ ఔటైనా.. కెప్టెన్ రజత్ పతిదార్ (15 నాటౌట్) తో కలిసి సాల్ట్ విజయ తీరాలకు చేర్చాడు. మరోవైపు ఫైనల్లో చోటు కోసం క్వాలిఫయర్ -2లో పంజాబ్ ఆడనుంది. అంతకుముందు శుక్రవారం జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టుతో జూన్ 1న అహ్మదాబాద్ లో జరిగే క్వాలిఫయర్ 2లో పంజాబ్ ఆడనుంది.