Sunil Gavaskar Comments: లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ బ్యాటర్ అశుతోష్ శర్మ హీరోలా నిలిచిన సంగతి తెలిసిందే. కేవలం 31 బంతుల్లోనే 66 పరుగులతో అజేయంగా నిలిచి, ఢిల్లీకి విజయం కట్టబెట్టాడు. తాజా ఇన్నింగ్స్ తో తను ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు. నిజానికి తను ఇంపాక్ట్ సబ్ గా బ్యాటింగ్ దిగే సమయానికి ఢిల్లీ పీకల్లోతు కష్టాల్లో మునిగి పోయింది. కేవలం ఏడో ఓవర్లోనే బ్యాటింగ్ కు దిగిన అశుతోష్.. చివరి కంటా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. తాజాగా అతని ఇన్నింగ్స్ పై దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ ప్రశంసలు కురిపించాడు. అశుతోష్ గొప్ప ఇన్నింగ్స్ ఆడాడని, చాలా కాలం పాటు ఇది గుర్తిండి పోయే ఇన్నింగ్స్ అని కితాబిచ్చాడు. తాము ఐపీఎల్ చూస్తోంది ఇలాంటి వాటికోసమేనని, అయినా కూడా ఈ దాహం ఎప్పటికీ తీరదని మజాగా, సరదాగా వ్యాఖ్యానించాడు. ఇక ఫినిషర్ గా జట్టులోకి వచ్చి, ఆ బాధ్యతను సక్రమంగా నెరవేరిస్తే లభించే ఆనందమే వేరని వ్యాఖ్యానించాడు.
గతంలోనూ ఇలాగే..నిజానికి గతేడాది పంజాబ్ కింగ్స్ తరపున అశుతోష్ ఇలాంటి ఇన్నింగ్స ఆడిన విషయాన్ని గావస్కర్ గుర్తు చేశాడు. సహచరుడు శశాంక్ సింగ్ తో కలిసి చాలా ఇన్నింగ్స్ లో పంజాబ్ ను గెలిపించేందుకు ప్రయత్నించాడని, ఆ సీజన్ తర్వాత దేశవాళీల్లో ఆడి తన టెక్నిక్ ను మరింత మెరుగు పర్చుకున్నాడని ప్రశంసించాడు. తను బ్యాటింగ్ కు దిగిన తొలి బంతి నుంచి మిడిల్ చేయడం ప్రారంభించాడని, చక్కని స్ట్రైక్ చేస్తూ మంచి టచ్ లో కన్పించాడని పేర్కొన్నాడు. నిజానికి అశుతోష్ బ్యాటింగ్ కు వచ్చినప్పుడు ఓవర్ కు పది పైగా రిక్వైర్డ్ రన్ రేట్ తో పరుగులు సాధించాల్సి ఉంది. పరిస్థితులకు తగినట్లుగా బ్యాటింగ్ చేసిన అశుతోష్.. తొలి 20 బంతులకు 20 పరుగులు చేయగా, తర్వాతి 11 బంతుల్లో ఏకంగా 46 పరుగులు సాధించడం విశేషం.
ఆత్మవిశ్వాసం పెంచుతుంది..ఇలాంటి మ్యాచ్ విన్నింగ్స్ ఆడితే ఆటగాళ్లలో ఆత్మ విశ్వాసం పెరుగుతుందని గావాస్కర్ వ్యాఖ్యానించాడు. తర్వాతి మ్యాచ్ ల్లో మరింత మెరుగ్గా ఆడేందుకు ఇవి దోహదపడుతాయని పేర్కొన్నాడు. జట్టులో తన స్థానానికి అశుతోష్ న్యాయం చేశాడని, ఇంపాక్ట్ సబ్ గా వచ్చి మ్యాచ్ పై తన దైన ఇంపాక్ట వేశాడని దిగ్గజ క్రికెటర్లు ప్రశంసిస్తున్నారు. అశుతోష్ ఇన్నింగ్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అని ఆస్ట్రేలియా దిగ్గజ కెప్టెన్ మైకేల్ క్లార్క్, సౌతాఫ్రికా మాజీ ప్లేయర్ ఫాఫ్ డుప్లెసిస్ వ్యాఖ్యానించారు. ఇక విశాఖ పట్నంలో జరిగిన ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో 209-8 చేయగా, ఛేదనను 19.3 ఓవర్లలో 211-9తో ఢిల్లీ పూర్తి చేసింది. దీంతో తన హిస్టరీలో అత్యధిక చేధనను ఢిల్లీ పూర్తి చేసింది. అలాగే ఈ సీజన్ లో సొంతగడ్డపై ఆడిన తొలి మ్యాచ్ ను గెలుపొందిన మూడో జట్టుగా ఢిల్లీ గుర్తింపు పొందింది.