Gavaskar Slams Board For Disrupting Ranji Schedule:  భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) రూపొందించిన దేశవాళీ షెడ్యూల్‌పై టీమ్ ఇండియా దిగ్గజ మాజీ సారథి సునీల్ గవాస్కర్ తీవ్రస్థాయిలో మండిపడ్డాడు. దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన రెడ్ బాల్ టోర్నీ రంజీ ట్రోఫీని బోర్డు చిన్నచూపు చూస్తోందని విమ‌ర్శించాడు. ప్రస్తుత క్యాలెండర్ ప్రకారం రంజీ ట్రోఫీని రెండు దశలుగా విభజించి, వాటి మధ్యలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీలను నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఈ షెడ్యూలింగ్ గందరగోళంపై స్పోర్ట్‌స్టార్ కాలమ్‌లో గవాస్కర్ స్పందిస్తూ, "ఒక వైట్ బాల్ టోర్నమెంట్ కోసం రెడ్ బాల్ టోర్నమెంట్‌ను మధ్యలోనే ఎలా ఆపేస్తారు? ఇది ఆటగాళ్ల రిథమ్, మొమెంటమ్‌ను పూర్తిగా నాశనం చేస్తుంది" అని ఆవేద‌న చెందాడు. 

Continues below advertisement

Continues below advertisement

ఐపీఎల్ కోస‌మే ఇదంతా..!సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీని సెప్టెంబర్‌లోనే నిర్వహించవచ్చని, కానీ ఐపీఎల్ వేలానికి సమీపంలో ఉండాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఇలా చేస్తోందని గవాస్కర్ విమ‌ర్శించాడు. "రంజీ ట్రోఫీ తరహాలోనే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీని కూడా క్వార్టర్ ఫైనల్ వరకు ఆడి, కొద్ది వారాల విరామం తర్వాత సెమీస్, ఫైనల్స్ నిర్వహించవచ్చు కదా? అలా చేయరు. ఎందుకంటే ఈ టోర్నీ ముగిసిన వెంటనే ఐపీఎల్ వేలం జరుగుతుంది. ఒకవేళ వేలం రెండు నెలల తర్వాత జరిగినా ఫ్రాంచైజీలు ప్రతిభావంతులైన ఆటగాళ్లను మరిచిపోరు" అని అతడు తెలిపాడు. ఆట అసలు సిసలైన పునాది అయిన ఫస్ట్ క్లాస్ క్రికెట్‌ను పక్కనపెట్టి లీగ్‌లకు ప్రాధాన్యత ఇవ్వడం సరైంది కాదని తెలిపాడు.

Read Also: Asia Cup 2026 India In Final:  ఫైన‌ల్లో టీమిండియా.. బంగ్లా చిత్తు, అద‌ర‌గొట్టిన షెఫాలీ, దీప్తి, టోర్నీలో అజేయంగా తుదిపోరుకు..

వారి వ‌ల్లే ఇలాంటి దుస్థితి..ప్రస్తుత బీసీసీఐ వ్యవస్థలో అనుభవం లేని వ్యక్తుల జోక్యం పెరగడం వల్లే ఇలాంటి తప్పుడు నిర్ణయాలు వస్తున్నాయని గవాస్కర్ విమ‌ర్శించాడు. గతంలో బోర్డులో టెక్నికల్ కమిటీ, ఫిక్చర్స్ కమిటీ ఉండేవని గుర్తుచేశాడు. "గతంలో మాజీ ఆటగాళ్లు, సీనియర్ అంపైర్లు, అనుభవజ్ఞులైన నిర్వాహకులు ఆ కమిటీల్లో సభ్యులుగా ఉండి మ్యాచ్‌ల నిర్వహణ సజావుగా సాగేలా చూసేవారు. అలాంటి అనుభవజ్ఞుల సేవలను మళ్లీ వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత భారత క్రికెట్ వ్యవస్థ కాస్త దారితప్పింది, సరైన నిపుణుల సలహాలతో దాన్ని సరిచేయాలి" అని సూచించాడు. టెస్ట్ క్రికెట్‌కు ఆటగాళ్లను అందించే రంజీ ట్రోఫీ ప్రాధాన్యత ఏమాత్రం తగ్గకుండా చూడాలని, షెడ్యూలింగ్ లో నిలకడ లేకపోతే యువ క్రికెటర్ల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం పడుతుందని గావ‌స్క‌ర్ అభిప్రాయపడ్డాడు.