Sunrisers Hyderabad vs Mumbai Indians: ఐపీఎల్‌-17వ సీజన్‌లో సన్‌రైజర్స్‌(SRH) హైదరాబాద్‌ జట్టు బోణీ కొట్టింది. ముంబయి ఇండియన్స్‌(MI)తో జరిగిన హైస్కోరింగ్‌ మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 భారీ స్కోర్‌ చేసింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన  జట్టుగా హైదరాబాద్‌ చరిత్ర సృష్టించింది. ఆరంభం నుంచే ఆ జట్టు బ్యాటర్లు.. దూకుడుగా ఆడారు.

క్లాసెన్‌ 80,అభిషేక్‌ శర్మ 63, ట్రావిస్‌ హెడ్‌ 62, మార్‌క్రమ్‌ 42 వీరవిహారం చేశారు. ముంబయి బౌలర్లలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, కోయెట్జీ, పీయూష్‌ చావ్లా ఒక్కో వికెట్‌ తీశారు. భారీ లక్ష్య ఛేధనలో ముంబయి కూడా ధీటుగా బదులిచ్చినా  నిర్ణీత 20 ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి ఓటమి పాలైంది. ముంబయి బ్యాటర్లలో తిలక్ వర్మ 64, టిమ్‌ డేవిడ్‌ 42, నమన్‌ ధీర్‌ 30 పరుగులు చేశారు. ప్యాట్‌ కమిన్స్‌, జయదేవ్‌ ఉనద్కట్‌ చెరో రెండు వికెట్లు తీశారు.

 

ఇది ఊచకోతే... 

హైదరాబాద్‌ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బ్యాటర్లు చెలరేగిపోయారు. ముంబై బౌలర్లను ఊచకోత కోశారు. ట్రానిస్‌ హెడ్‌ 18 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేయగా... తానేం తక్కువ తినలేదంటూ అభిషేక్‌ శర్మ 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి రికార్డు సృష్టించాడు. దొరికిన బంతిని దొరికినట్లు హైదరాబాద్‌ బ్యాటర్లు బాదేశారు. బంతిపై ఏదో కసి ఉన్నట్లు ఊగిపోయారు. బంతి వేయడానికే బౌలర్లు వణికిపోయేంత విధ్వంసం సృష్టించారు. ఐపీఎల్‌ చరిత్రలోనే హైదరాబద్‌ తరపున అత్యంత వేగవంతమైన అర్ధ శతకం సాధించిన బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు.

ఉప్పల్‌ స్టేడియంలో బౌండరీల మోత మోగింది. మఫాకా వేసిన 10 ఓవర్‌లో 20 పరుగులు వచ్చాయి. 16 బంతుల్లోనే అభిషేక్‌ శర్మ (54*) హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. 10 ఓవర్లు పూర్తయ్యేసరికి హైదరాబాద్‌ స్కోర్‌ 148/2. 22 బంతుల్లోనే 63 పరుగులు చేసి అభిషేక్‌ అవుటయ్యాడు. పీయూష్‌ చావ్లా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించి అభిషేక్‌ అవుటయ్యాడు. 23 బంతుల్లో 3 ఫోర్లు, ఏడు సిక్సులతో అభిషేక్‌ 63 పరుగులు చేశాడు. ట్రానిస్‌ హెడ్‌ 24 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేసి అవుటయ్యాడు. హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసం ధాటికి మఫాక మూడు ఓవర్లలోనే 48 పరుగులు సమర్పించుకున్నాడు. హెడ్‌, అభిషేక్‌ బ్యాటింగ్‌ జోరుతో హైదరాబాద్‌ ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి 58 పరుగులు చేసింది. పవర్‌ ప్లే పూర్తయ్యే సరికి 81 పరుగులు చేసింది. ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్‌కు పవర్‌ ప్లేలో ఇదే అత్యధిక స్కోరు. 2017లో కోల్‌కత్తాపై హైదరాబాద్‌ 79 పరుగులు చేయగా.. ఈ మ్యాచ్‌లో 81 పరుగులు చేసింది.  ట్రానిస్‌ హెడ్‌- అభిషేక్‌ వర్మ కేవలం 23 బంతుల్లోనే 68 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

మార్‌క్రమ్‌, హెన్రిచ్‌ క్లాసెన్‌ కూడా రాణించడంతో సన్‌రైజర్స్‌ స్కోరు బోర్డు.... బుల్లెట్‌ వేగంతో దూసుకుపోయింది.క్లాసెన్‌  24 బంతుల్లో 1 ఫోర్‌, 5 సిక్స్‌లతో  అర్ధశతకం పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో ఇది మూడో హాఫ్‌ సెంచరీ బ్యాటర్ల విధ్వంసంతో 15 ఓవర్లలోనే హైదరాబాద్‌ స్కోరు 200 పరుగులు దాటింది. 19 ఓవర్లకు హైదరాబాద్‌ స్కోర్‌ 256 కాగా బ్యాటర్ల విశ్వరూపంతో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 277 పరుగుల భారీ స్కోరు చేసింది.  ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక స్కోరు చేసిన జట్టుగా  సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డులకు ఎక్కింది.