Sunrisers Hyderabad vs Chennai Super Kings: హైదరాబాద్‌తో ఇవాళ జరగనున్న మ్యాచ్‌లో దిగ్గజ ఆటగాడు, చెన్నై జట్టు కీలక ఆటగాడు  మహేంద్రసింగ్‌ ధోనీ... బరిలోకి దిగుతుండడంతో అందరి దృష్టి ఈ మ్యాచ్‌పైనే కేంద్రీకృతమైంది. ధోనీకి ఇదే ఆఖరిసారి ఐపీఎల్‌ అని వార్తలు వస్తున్న వేళ ఈ దిగ్గజ ఆటగాడికి అభిమానం వెల్లువెత్తుతోంది. ధోని ఏ నగరానికి వెళ్లినా స్టేడియాలు కిక్కిరిసిపోతున్నాయి. ఇప్పుడు హైదరాబాద్‌లోనూ అభిమానం వెల్లువెత్తనుంది.  చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్  గత మ్యాచుల్లో ఓడిపోవడంతో ఈ మ్యాచ్‌ ఇరు జట్లకు కీలకంగా మారనుంది. 

పిచ్‌ ఎలా ఉంటుందంటే..?
సన్‌రైజర్స్‌-ముంబై మధ్య జరిగిన మ్యాచ్‌లో 500కుపైగా పరుగులు నమోదయ్యాయి. అయితే ఈ మ్యాచ్‌లో పిచ్‌ కాస్త మందకొడిగా ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌ నల్లమట్టి పిచ్‌ను ఉపయోగించే అవకాశం ఉందని సన్‌రైజర్స్‌ కోచ్‌ వెటోరి అభిప్రాయపడ్డాడు. ఈ మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశం ఉంది. 


హెడ్‌ టు హెడ్‌ రికార్డ్స్ ఇవే...
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2024 మ్యాచ్ నెంబర్ 18లో హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్  చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్- హైదరాబాద్‌ మధ్య ఇప్పటివరకూ 20 మ్యాచుల్లో తలపడ్డాయి. అందులో చెన్నై సూపర్ కింగ్స్‌ 15 మ్యాచ్‌లు గెలవగా... సన్‌రైజర్స్ హైదరాబాద్  5 మ్యాచ్‌లు గెలిచింది. చెన్నై సూపర్ కింగ్స్ - హైదరాబాద్ మధ్య ఏ మ్యాచ్ కూడా ఫలితం లేకుండా ముగియలేదు. గత మ్యాచ్‌ 2023 సీజన్‌లో జరిగింది. ఆ మ్యాచ్‌లో  హైదరాబాద్‌పై ఏడు వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ భారీ విజయాన్ని సాధించింది. హైదరబాద్‌ వేదికగా సన్‌రైజర్స్‌  52 మ్యాచులు ఆడగా SRH 31 మ్యాచ్‌లు గెలిచింది, 20 మ్యాచ్‌లలో ఓటమిని చవిచూసింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. 



భారీ స్కోర్లు ఖాయమేనా..?
ఈ ఐపీఎల్లో  277 పరుగులతో విధ్వంసం సృష్టించినా హైదరాబాద్‌... ఈ మ్యాచ్‌లో మరోసారి భారీ స్కోరు చేసి విజయాలు బాట పట్టాలని చూస్తోంది.  2016లో తన తొలి ఐపీఎల్‌ సీజన్‌లో 17 వికెట్లతో సత్తా చాటిన  ముస్తాఫిజుర్ రెహ్మాన్‌... ఎనిమిదేళ్ల తర్వాత  ఇప్పుడు కూడా చెన్నైకి కీలక బౌలర్‌గా ఉన్నాడు. అయితే ఎంతటి బౌలర్‌ను అయినా ధాటిగా ఎదుర్కోగల బ్యాటర్లు సన్‌రైజర్స్‌కు ఉన్నారు. అభిషేక్ శర్మ ఇదే టెంపోను  కొనసాగిస్తే చెన్నైకి కష్టాలు తప్పకపోవచ్చు. ట్రావిస్ హెడ్ ఎంత విధ్వంసకర బ్యాటరో చెన్నైతో పాటు అభిమానులకు కూడా బాగా తెలుసు. 
హైదరాబాద్‌ జట్టు( అంచనా‌):
మయాంక్ అగర్వాల్,  ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఐడెన్ మార్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్, షాబాజ్ అహ్మద్/వాషింగ్టన్ సుందర్, అబ్దుల్ సమద్,  పాట్ కమిన్స్ (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, మార్కండే, జయదేవ్ ఉనద్కత్, ఉమ్రాన్ మాలిక్. 


చెన్నై జట్టు( అంచనా‌): రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), అజింక్యా రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, సమీర్ రివ్జీ, రవీంద్ర జడేజా,  MS ధోని, దీపక్ చాహర్,  తుషార్ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్ రెహమాన్/మహీష్ తీక్షణ, మథీషా పతిరనా.