IPL 2025 SRH VS GT Live Updates:  గుజ‌రాత్ టైటాన్స్ తో జ‌రుగుతున్న లీగ్ మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఓ మాదిరి స్కోరుకే ప‌రిమిత‌మైంది. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన స‌న్.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌కు 152 ప‌రుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (34 బంతుల్లో 31, 3 ఫోర్లు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ (4/17)తో సత్తా చాటాడు. ఉప్ప‌ల్ మైదానంలో ప‌రుగుల వ‌ర‌ద పార‌డం ఖామ‌య‌ని భావించిన క్రికెట్ అభిమానుల‌కు క్యూరెటర్లు షాకిచ్చారు. మంద‌కొడి బ్లాక్ సాయిల్ పిచ్ ను రూపొందించారు. అంత‌గా బౌన్స్ లేని ఈ వికెట్ పై బ్యాట్ పైకి బంతి అనుకున్నంత తేలిక‌గా రాలేదు. దీంతో ప‌రుగుల రాక క‌ష్టంగా మారింది. ఇక ప్రారంభం నుంచే ప్ర‌ణాళిక బ‌ద్ధంగా బౌలింగ్ చేసిన గుజ‌రాత్ బౌల‌ర్లు స‌న్ రైజ‌ర్స్ బ్యాట‌ర్ల‌కు అనుకున్నంత భారీ స్కోరు చేసేందుకు అవ‌కాశ‌మివ్వ‌లేదు. 

సిరాజ్ మియా ఫైర్.. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీకి ఆరంభంలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. హైద‌రాబాదీ పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్ బౌలింగ్ లో వ‌రుసగా రెండు ఫోర్లు కొట్టి జోరు చూపించిన ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ (8) త్వ‌ర‌గా ఔట‌య్యాడు. పిచ్ కు త‌గిన‌ట్లుగా వేసిన బంతికి సుల‌భ‌మైన క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. త‌ర్వాత నాలుగు ఫోర్ల‌తో మంచి ట‌చ్ లో క‌న్పించిన అభిషేక్ శ‌ర్మ (18) భారీ షాట్ కు ప్ర‌య‌త్నించి ఔట‌య్యాడు. ఇషాన్ కిష‌న్ (17) కూడా త‌న‌కు ల‌భించిన శుభారంభాన్ని స‌ద్వినియోగం చేసుకోలేక పోయాడు. ప్ర‌సిధ్ కృష్ణ బౌలింగ్ లో పుల్ షాట్ కు ప్ర‌య‌త్నించి ఔట‌య్యాడు. దీంతో 50/3 స‌న్ రైజ‌ర్స్ పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. 

ఆదుకున్న నితీశ్, క్లాసెన్ జోడీ.. త్వ‌ర‌గా మూడు వికెట్లు ప‌డ‌టంతో కాస్త డీలా ప‌డిన స‌న్ రైజ‌ర్స్ కు నితీశ్, హెన్రిచ్ క్లాసెన్ (19 బంతుల్లో 27, 2 ఫోర్లు, 1 సిక్సర్) జంట ఆదుకుంది. చ‌క‌చ‌కా ప‌రుగులు చేస్తూ, నాలుగోవికెట్ కు స‌రిగ్గా 50 ప‌రుగులు జోడించారు. త‌న శైలికి భిన్నంగా ఓపిక‌గా నితీశ్ ఆడ‌గా, సందు దొరికినప్పుడ‌ల్లా క్లాసెన్ బౌండ‌రీలు సాధించాడు. అయితే జోరుగా సాగుతున్న ఈ జంట‌ను సాయి కిశోర్ విడ‌దీశాడు. ఆ త‌ర్వాత కాసేప‌టికే నితీశ్, క‌మిందు మెండిస్ (1) ఔట‌య్యారు. ఈ ద‌శ‌లో అనికేత్ వ‌ర్మ (18), కెప్టెన్ పాట్ క‌మిన్స్ (9 బంతుల్లో 22 నాటౌట్, 3 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడ‌టంతో స‌న్ ఓ మోస్త‌రు టార్గెట్ సాధించింది. మిగతా బౌలర్లలో ప్రసిధ్ , సాయి కిశోర్ కు రెండేసి వికెట్లు దక్కాయి.