SRH BECOMES FIRST TEAM IN IPL HISTORY TO CHASE DOWN 160 target INSIDE 10 OVERS - హైదరాబాద్: ఐపీఎల్ 17లో భాగంగా ఉప్పల్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్ (LSG)తో జరిగిన మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు మరోసారి పంజా విసిరారు. ప్లే రేసులో మరో అడుగు ముందుకు వేయాల్సిన కీలక మ్యాచ్ లో లక్నోపై 10 వికెట్ల తేడాతో సన్ రైజర్స్ గెలుపొందింది. ప్రత్యర్థి లక్నో టీమ్ నిర్దేశించిన 166 పరుగుల లక్ష్యాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా.. కేవలం 9.4 ఓవర్లలోనే అలవోకగా ఛేదించారు. ఐపీఎల్ చరిత్రలో 160కి పైగా టార్గెట్ ను కేవలం 10 ఓవర్లలోపే ఛేదించిన తొలి జట్టుగా సన్ రైజర్స్ రికార్డు నమోదు చేసింది. మరోవైపు ఎస్ఆర్‌హెచ్ పాయింట్ల పట్టికలో 3వ స్థానానానికి ఎగబాకింది.
సన్ రైజర్స్ ను విన్ రైజర్లుగా మార్చడంతో కీలకపాత్ర పోషించిన ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ సింగిల్స్ కంటే ఫోర్లు, సిక్సర్లపై ఫోకస్ చేశారు. దాంతో ట్రావిస్ హెడ్ (89 నాటౌట్; 30 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లు), అభిషేక్ శర్మ(75 నాటౌట్; 28 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ హాఫ్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. సన్ రైజర్స్ ఓపెనర్లు దెబ్బకు మరో 10.2 ఓవర్లు ఉండగానే ఎస్ఆర్‌హెచ్ ఘన విజయం సాధించింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సన్ రైజర్స్ బౌలర్లలో భువీ అద్భుతమైన స్పెల్ వేసి ప్రత్యర్థి లక్నో బ్యాటర్లను కట్టడి చేశాడు.
టాప్ టీమ్స్ ఇవే..
పాయింట్ల పట్టిక గమనిస్తే.. ఇరు జట్లకు 16 పాయింట్లు ఉన్నప్పటికీ, మెరుగైన రన్ రేట్ ఉన్న కేకేఆర్ అగ్ర స్థానంలో నిలిచింది, రాజస్థాన్ 2వ స్థానం, తాజా విజయంతో ఎస్ఆర్‌హెచ్ 3వ స్థానానికి ఎగబాకింది. 12 పాయింట్లు ఉన్నా, మెరుగైన రన్ రేట్ తో చెన్నై సూపర్ కింగ్స్ 4వ, ఢిల్లీ క్యాపిటల్స్ 5వ, తాజా ఓటమితో లక్నో 6వ స్థానానికి పడిపోయింది. 5 సార్లు ఐపీఎల్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ 17 సీజన్ నుంచి వైదొలగిన తొలి జట్టుగా నిలిచింది. అయితే మరో 2 లీగ్ మ్యాచ్ లు మాత్రం ఆడనుంది పాండ్యాసేన. ముంబై 12 మ్యాచ్ లలో 4 నెగ్గి 8 పాయింట్లతో 9వ స్థానంలో ఉంది.