Purple Cap Holder Shardul Thakur: శార్దూల్ ఠాకూర్.. ఈ సీజ‌న్ లో ఈ పేరు టాక్ ఆఫ్ ద టౌన్ మాదిరిగా అయిపోయింది. నిజానికి గ‌త ఐదు నెల‌లుగా త‌న జీవితంలో ఎన్నో ఎత్తుప‌ల్లాలు అనుభ‌వించాడు. గోడ‌కు కొట్టిన బంతిలా ఎగిసి, రివ్వున దూసుకొచ్చాడు. అభిమానులు ముద్దుగా లార్డ్ అని, మ్యాన్ ఆఫ్ గోల్డెన్ ఆర్మ్ అని శార్దూల్ ను పిలుచుకుంటారు. గ‌తంలో కీల‌క‌ద‌శ‌లోత‌న వికెట్లు తీయ‌డం, ప‌రుగులు చేయ‌డంతో ఆపేరు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ఐపీఎల్లో అత్యంత విజ‌య‌వంతమైన బౌల‌ర్ గా నిలిచి, ప‌ర్పుల్ క్యాప్ హోల్డ్ చేస్తున్నాడు. అలాంటి ఆట‌గాడిని గ‌త ఏడాది జ‌రిగిన వేలంలో ఏ జ‌ట్టు కొనుగోలు చేయ‌లేదంటే ఆశ్చ‌ర్య‌మే. ఆ త‌ర్వాత రీప్లేస్ మెంట్ గా ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ జ‌ట్టులోకి వ‌చ్చి, ఏకంగా కెరీర్ బెస్ట్ ను కూడా న‌మోదు చేశాడు. త‌న జ‌ర్నీ వింటుంటునే స్పూర్తి దాయంకం. 33 ఏళ్ల శార్దూల్.. ఏడాదిన్న‌ర కింద‌టి వ‌ర‌కు టీమిండియాలో రెగ్యులర్ ఆట‌గాడిగానే ఉండేవాడు. అయితే ఆ త‌ర్వాత గాయాలు, ఫామ్ కోల్పోవ‌డంతో జ‌ట్టులో నుంచి చోటు కోల్పోయాడు. డిసెంబ‌ర్ 2023 త‌ర్వాత త‌ను జాతీయ జ‌ట్టు త‌ర‌పున ఆడ‌లేదు. అయితే దేశ‌వాళీల్లో మాత్రం క్ర‌మం త‌ప్పుకుండా పాల్గొంటూ త‌న స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకున్నాడు. కీల‌క‌ద‌శ‌లో వికెట్లు తీయ‌డంతోపాటు బ్యాట‌ర్ గా కూడా ధాటిగా ఆడ‌గ‌ల సిస‌లైన ఆల్ రౌండ‌ర్ గా తన పట్టును మరింత పెంచుకున్నాడు.

ఐపీఎల్లో నిరాశ‌..ఇక గ‌తేడాది క‌చ్చితంగా శార్దూల్ ను ఐపీఎల్ జ‌ట్లు కొనుగోలు చేస్తాయ‌ని భావించినా, ఆఖ‌రిని అత‌ను అన్ సోల్డ్ గా మిగిలాడు. అయితే దేశ‌వాళీ స‌య్య‌ద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీ, రంజీట్రోఫీలో స‌త్తా చాటి అంద‌రి ఫోక‌స్ లో ప‌డ్డాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ చేయ‌నుండటంతో అత‌ని గురించి కొన్ని ఫ్రాంచైజీలు ఆలోచించాయి.  ఇక‌, ఈ ద‌శ‌లో కౌంటీలో ఆడ‌టం కోసం ఎస్సెక్స్ తో ఆల్మోస్ట్ ఒప్పందం కుదుర్చుకునే ద‌శ‌లో శార్దూల్ కు అనుకోని ఆఫ‌ర్ వ‌చ్చింది. ల‌క్నో మెంటార్, దిగ్గ‌జ పేస‌ర్ జ‌హీర్ ఖాన్.. ఫోన్ చేసి, ల‌క్నో త‌ర‌పున ఆడేందుకు సిద్ధంగా ఉండాల‌ని, రీప్లేస్ మెంట్ గా త‌న‌ను తీసుకుంటామ‌ని చెప్పాడు. 

కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో..ఇక ఐపీఎల్ ప్రారంభానికి ముందు నిర్వ‌హించిన ట్రైనింగ్ సెష‌న్లకు శార్దూల్ హాజ‌రయ్యి, జ‌ట్టులో భాగ‌మ‌య్యాడు. రూ.2 కోట్ల బేస్ ధ‌ర‌కు త‌న‌ను ల‌క్నో కొనుగోలు చేసింది. ఇక తొలి మ్యాచ్ లో ఢిల్లీపై రెండు వికెట్లు తీసిన శార్దూల్, ప‌ట‌ష్ట‌మైన బ్యాటింగ్ లైన‌ప్ ఉన్న స‌న్ రైజ‌ర్స్ పై విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించాడు. కెరీర్ బెస్ట్ (4-34)తో స‌త్తా చాటి, ఓవ‌రాల‌్ గా ఆరు వికెట్ల‌తో ప‌ర్పుల్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. దీంతో ఒక్క‌సారిగా త‌ను హాట్ టాపిక్ అయ్యాడు. నిజానికి ల‌క్నో బౌలింగ్ లైన‌ప్ గాయాల కార‌ణంగా బ‌లహీన ప‌డింది. తొలి మ్యాచ్ లో అవేశ్ ఖాన్, మోసిన్ ఖాన్, మ‌యాంక్ యాద‌వ్, ఆకాశ్ దీప్ సింగ్ లాంటి ప్లేయ‌ర్లు పాల్గొన‌లేదు. ఇందులో మోసిన్ ఖాన్ గాయంతో టోర్నీకి దూరం కాగా, అత‌ని ప్లేస్ లో శార్దూల్ వ‌చ్చాడు. ఇక రెండో మ్యాచ్ లో అవేశ్ కూడా రావ‌డంతో ల‌క్నో బౌలింగ్ బ‌ల‌ప‌డింది. మొత్తానికి ఒక‌ద‌శ‌లో అన్ సోల్డ్ గా మిగిలి, ప‌ట్టుద‌ల‌తో తిరిగి ఐపీఎల్ ఆడుతున్న శార్దూల్.. ల‌క్నోకు పెద్ద దిక్కుగా మార‌డంపై ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు.