IPL 2025 MI VS GT Latest Updates: గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టు కెప్టెన్ శుభ‌మాన్ గిల్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. ఐపీఎల్లో ఒక మైదానంలో అత్యంత వేగంగా వెయ్యి ప‌రుగులు సాధించిన రెండో ఆట‌గాడిగా రికార్డులకెక్కాడు. 2022లో అహ్మ‌దాబాద్ లో గుజరాత్ తరపున తొలి మ్యాచ్ ఆడిన గిల్.. కేవ‌లం 20 ఇన్నింగ్స్ ల్లోనే వెయ్యి ప‌రుగుల మార్కును చేరుకున్నాడు. దీంతో ఐపీఎల్లో అత్యంత వేగంగా వెయ్యి ప‌రుగులు సాధించిన భార‌తీయ ప్లేయ‌ర్ గా నిలిచాడు. 2022లో గుజ‌రాత్, ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఐపీఎల్లో అరంగేట్రం చేశాయి. అప్ప‌టి నుంచి గుజ‌రాత్ హోం మ్యాచ్ లు అహ్మ‌దాబాద్ లో జ‌రుగుతున్నాయి. తాజాగా ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో గిల్ 27 బంతుల్లో 38 ప‌రుగులు సాధించాడు. 4 ఫోర్లు, 1 సిక్స‌ర్ చేశాడు. దీంతో ఈ మైదానంలో వెయ్యి ప‌రుగుల మార్కును చేరుకున్నాడు. ఇక ఈ మైదానంలో గిల్ కు అద్భుత‌మైన రికార్డు ఉంది. ఏకంగా మూడు సెంచ‌రీల‌ను ఈ మైదానంలో సాధించాడు. ఓవ‌రాల్ గా నాలుగు సెంచ‌రీలు త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇక 19 ఇన్నింగ్స్ లో క్రిస్ గేల్ వెయ్యి ప‌రుగుల‌ను బెంగళూరు వేదిక‌లో పూర్తి చేసుకుని, ఒక వేదికపై ఈ ఘ‌న‌తను అత్యంత వేగంగా సాధించిన ప్లేయ‌ర్ గా రికార్డుల‌కెక్కాడు. కేవ‌లం ఒక్క ఇన్నింగ్స్ తేడాతో గిల్ ఈ రికార్డును చేజార్చుకోవ‌డం విశేషం. 

గ‌తేడాది నుంచి కెప్టెన్ గా గిల్.. 2022లో అరంగేట్రం చేశాక‌, గుజ‌రాత్ కు సార‌థిగా హార్దిక్ పాండ్యా వ్య‌వ‌హ‌రించాడు. ఆ సీజ‌న్ లో గుజ‌రాత్ చాంపియ‌న్ గా నిలిచాడు. ఆ త‌ర్వాత ఏడాది కూడా అద్భుతంగా రాణించిన గుజ‌రాత్ టైటాన్స్ .. ర‌న్న‌ర‌ప్ గా నిలిచింది. అయితే 2024లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు హార్దిక్ పాండ్యా వ‌ల‌స వెల్లి పోవ‌డంతో గుజ‌రాత్ జ‌ట్టు ప‌గ్గాల‌ను గిల్ తీసుకున్నాడు. అయితే గ‌త సీజ‌న్ లో గుజ‌రాత్ క‌నీసం ప్లే ఆఫ్స్ కు కూడా చేర‌లేక‌పోయింది. అయితే ఈసారి మాత్రం ఫ‌స్ట్ ప్లేఆఫ్స్ కు చేర‌డ‌మే టార్గెట్ గా గుజ‌రాత్ బ‌రిలోకి దిగుతోంది. ఇక ముంబైతో మ్యాచ్ లో గెలిచి శుభారంభం చేయాలని పట్టుదలగా ఉంది. 

బోణీ కొట్టాల‌ని త‌హ‌త‌హా..ఇక ఈ సీజ‌న్ లో శుభారంభం చేయ‌డంలో గుజ‌రాత్ విఫ‌ల‌మైంది. తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో ప‌రాజయం పాలైంది. దీంతో ముంబై ఇండియ‌న్స్ తో జ‌రుగుతున్న రెండో మ్యాచ్ లో గెలుపు టార్గెట్ గా బ‌రిలోకి దిగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన గుజ‌రాత్.. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌కు 196 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ (41 బంతుల్లో 63, 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)తో స‌త్తా చాటాడు. ముంబై బౌల‌ర్ల‌లో కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రెండు వికెట్లు ద‌క్కాయి.