Shaik Rasheed : చెన్నై సూపర్ కింగ్స్ 20 ఏళ్ల షేక్ రషీద్ కు LSG (LSG vs CSK) తో జరిగే మ్యాచ్‌లో అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చింది. ఇప్పటి వరకు వరుస ఓటములతో బ్యాటింగ్ వైఫల్యంతో ఇబ్బంది పడుతున్న చెన్నైకు తురుపుముక్కలా దొరికాడు రషీద్. నిలకడైన, విధ్వంసకర ఓపెనింగ్ లేక చెన్నై ఇబ్బందిపడుతూ వచ్చింది. రషీద్ రావడం, కెప్టెన్సీ మార్పుతో జట్టులో కూడా చాలా ఛేంజ్ వచ్చింది. ఇన్నాళ్లు ఫ్యాన్స్ ఏది మిస్ అయ్యారో అది ఇప్పుడు జట్టులో కనిపిస్తోంది.  

తొలి మ్యాచ్‌లో షేక్ రషీద్ దుమ్మురేపాడు. చెన్నై విజయానికి కావాల్సిన రాబట్టడంలో లక్ష్యం దిశగా వెళ్లడానికి  పునాది వేయడంలో కీలక పాత్ర పోషించాడు. రచిన్ రవీంద్రతో కలిసి చాలా కాలం తర్వాత చెన్నై జట్టు తరఫున మంచి భాగస్వామ్యం నెలకొల్పాడు. డిఫెన్సివ్ మోడ్‌లో ఆడుతున్న జట్టులో ఎదురు దాడితో ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. ఇప్పటి వరకు రకరక ప్రయోగాలు చేసిన చెన్నై జట్టు ఇప్పుడు అసలైన ఆటగాడికి అవకాశం ఇచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు. 

మొదటి మ్యాచ్‌లో ఓపెనింగ్ దిగిన షేక్ రషీద్... 19 బంతులు ఆడి 27 పరుగులు చేశారు. అతని స్ట్రైక్ రేట్‌ 142. ఇందులో ఆరు ఫోర్లు కొట్టాడు. చూడచక్కని ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఆవేష్‌ ఖాన్ బౌలింగ్‌లో షాట్‌కు ప్రయత్నించి నికోలస్ పూరన్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. ఫీల్డింగ్‌లో ఉన్నప్పుడు ఓ క్యాచ్ కూడా పట్టాడు. మంచి ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. 

ఇంతకీ ఎవరీ షేక్ రషీద్ షేక్ రషీద్ జీవిత కథ చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ యువ క్రికెటర్ పేదరికం, ఆర్థిక సమస్యలను ఎదుర్కొని IPL లోకి అడుగుపెట్టాడు. 24 సెప్టెంబర్ 2004న ఆంధ్రప్రదేశ్‌లోని గంటూరులో జన్మించాడు. తన ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్‌ను హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్ నుంచి ప్రారంభించాడు. మొదటి సారిగా 2022 అండర్-19 ప్రపంచకప్‌నకు ఎంపికయ్యాడు. దీంతో తొలిసారి క్రీడా ప్రపంచానికి షేక్ రషీద్ పరిచయమయ్యాడు. రావడంతోనే జట్టు వైస్-కెప్టెన్‌గా ఎంపికవ్వడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

COVID కారణంగా రషీద్ టోర్నమెంట్‌లోని అన్ని మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. ఆడినకొన్ని మ్యాచ్‌లలో మాత్రం బౌలర్ల భరతంపట్టి వారికి చుక్కలు చూపించాడు. రషీద్ ప్రపంచ కప్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో సగటున 50 కంటే ఎక్కువ పరుగులు సాధించాడు. అందులో 2 హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ కూడా ఉన్నాయి.

రెండుసార్లు ఉద్యోగం కోల్పోయిన తండ్రి షేక్ రషీద్ విజయంలో తండ్రి షేక్‌ బాలీషా ప్రధాన పాత్ర పోషించాడు. శిక్షణా కేంద్రం చాలా దూరంలో ఉన్నప్పటికీ రోజూ తీసుకెళ్లి తీసుకురావడం ఇష్టంగా చేశారు. చిన్న వయసులోనే క్రికెట్‌లో రాణిస్తున్న రషీద్‌ను చూసి తండ్రి తన కష్టాన్ని మర్చిపోయారు. రషీద్ క్రికెట్ కెరీర్‌లో రాణిస్తున్నటైంలో తండ్రి రెండుసార్లు తన ఉద్యోగాన్ని కోల్పోవలసి వచ్చింది.  

షేక్ రషీద్‌ 2023 IPL వేలంలో మొదటిసారి కనిపించాడు. CSK అతన్ని రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. కాని మ్యాచ్‌లు మాత్రం ఆడలేదు. 2025 మెగా వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ అతన్ని మరోసారి కొనుగోలు చేసింది. ఇప్పటివరకు రషీద్‌ 19 మ్యాచ్‌ల ఫస్ట్-క్లాస్ కెరీర్‌లో 1,204 పరుగులు సాధించగా, తన T20 కెరీర్‌లో ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో సహా 352 పరుగులు చేశాడు.

మొదటి మ్యాచ్‌ ఆడిన రషీద్‌కు మంత్రి నారా లోకేష్‌తోపాటు చాలా మంది ప్రముఖులు శుభాకాంక్షలు చెప్పారు.