Ind Vs Eng Test Series: ఈ ఏడాది భారత క్రికెట్ కు అటు మోదం, ఇటు ఖేదం రెండూ కలిగాయి. ఇయర్ ప్రారంభంలోనే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ రూపంలో మెగాటోర్నీని దక్కించుకోవడంతో టీమిండియా అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించక ముందే రెండు షాకులు ఒకేసారి తగిలాయి. విధ్వంసక ఓపెనర్, తాజా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ తోపాటు దిగ్గజం విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలకడమే, రెండు వారాల వ్యవధిలో వీరిద్దరూ ఈ నిర్ణయం తీసుకుని ఫ్యాన్స్ ను నిరాశకు గురి చేశారు. ముఖ్యంగా కోహ్లీ సడెన్ గా రిటైర్మెంట్ నిర్ణయం తీసుకుని అందరినీ ఆశ్చర్య పరిచాడు. ఈ ఏడాది ఐపీఎల్లో ఉన్న టచ్ లో మరో రెండు మూడేళ్లు ఈజీగా టెస్టులు ఆడగలడని భావించిన అభిమానులకు నిరాశే కలిగింది. అయితే తాజాగా కోహ్లీ రిటైర్మెంట్ పై దిగ్గజ ప్లేయర్, కోహ్లీ ఫ్రెండ్ ఏబీ డివిలియర్స్ స్పందించాడు.
ఎంతో చేశాడు..క్రికెట్ కి కోహ్లీ ఎంతో చేశాడని, తాను కొత్తగా సాధించాల్సినది ఏమీ లేదని డివిలియర్స్ ముంబై లో జరిగిన ఒక కార్యక్రమంలో తాజాగా వ్యాఖ్యానించాడు. తను రెడ్ బాల్ క్రికెట్ లో ఒక లెగసీని వదిలి వెళ్లాడని, భావి తరాలకు కోహ్లీ ఆటతీరు స్ఫూర్తి దాయకమని కొనియాడాడు. ఇక కోహ్లీ సూటిగా తన అంతర్మాత ప్రబోధం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నాడని, దీని వెనకాల ఎలాంటి ఒత్తిడి లేదని పేర్కొన్నాడు. ఇక కోహ్లీ, రోహిత్ వదిలి వెళ్లిన స్థానాలను భర్తీ చేయగల సామర్థ్యం టీమిండియా యువ ఆటగాళ్లకు ఉందని పేర్కొన్నాడు.
ఐపీఎల్ ద్వారా..ఇద్దరు దిగ్గజాల స్థానాన్ని భర్తీ చేయడం చాలా కష్టమని, అయితే ఐపీఎల్ ద్వారా ఎంతో మంది టాలెంట్ ఉన్న ఆటగాళ్లు వెలికి వస్తున్నారని డివిలియర్స్ పేర్కొన్నాడు. తాజా సీజన్ లో 14 ఏళ్ల వయసులోనే సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీని ఉదాహరణగా చూపించాడు. ఇలాంటి వారికి టీమిండియాలో కొదువ లేదని, రాబోయే ఇంగ్లాండ్ టూర్ కఠినమైనదేనని, అయితే దీన్ని ఎదుర్కునేందకు టీమిండియా యువ ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించాడు. ఈ టూర్ కు శుభమాన్ గిల్ టెస్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ టూర్ ద్వారా 2025-27 ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ సైకిల్ ను భారత్ ప్రారంభించనుంది. ఇక రోకో ద్వయం వీడినా టీ20 జట్టు గత ఏడాదిగా అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఐపీఎల్ నుంచి వచ్చిన టాలెంటెడ్ ప్లేయర్లు సత్త చాటుతుండటంతో ఈ ఫార్మాట్ లో టీమిండియా శత్రు దుర్భేధ్యంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక రెడ్ బాల్ ఫార్మాట్ అయిన టెస్టుల్లోనూ యువ ఆటగాళ్లు తమకు లభించే అవకాశాలను నిరూపించు కోవాలని పట్టుదలగా ఉన్నారు.