Ashwin And Sanju Samson : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 ప్రారంభానికి ముందు సంజు సామ్సన్,అశ్విన్‌ వార్తల్లోకి వచ్చారు. వివిధ మీడియా నివేదికలు, సోషల్ మీడియా పోస్టుల ప్రకారం, రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్, సీఎస్కే ప్లేయర్‌ రవిచంద్రన్ అశ్విన్  రాబోయే సీజన్ కోసం వేలానికి ముందే జట్టు నుంచి వెళ్లిపోవాలని కోరుకుంటున్నారు.  ఐపీఎల్-2025 ముగిసిన వెంటనే సంజు ఈ విషయాన్ని ఫ్రాంచైజీకి తెలియజేస్తే, అశ్విన్ ఈ మధ్యే ఈ విషయాన్న యాజమాన్యానికి చెప్పాడు. 

సంజూపై నిర్ణయం తీసుకోని రాజస్థాన్

రాజస్థాన్ రాయల్స్ 2025 సీజన్ సమీక్ష సమావేశం జూన్‌లో జరిగింది. ఫ్రాంచైజీ ఇంకా సంజు శాంసన్‌కు ఎటువంటి కచ్చితమైన సమాధానం ఇవ్వలేదు. సంజును ఒప్పించే అవకాశం ఇంకా ఉంది. ఫ్రాంచైజీ యజమాని మనోజ్ ఈ విషయంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌తో కలిసి తుది నిర్ణయం తీసుకుంటారు.

తుది నిర్ణయం ఫ్రాంచైజీదే

'ఈఎస్పీఎన్‌క్రిక్‌ఇన్ఫో' ప్రకారం, ఒకవేళ ఫ్రాంచైజీ శాంసన్‌ను విడుదల చేయాలని నిర్ణయిస్తే, అతన్ని ఇతర ఫ్రాంచైజీకి ట్రేడ్ చేయవచ్చు లేదా సంజు వేలంలోకి దిగవచ్చు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం, ఇలాంటి సందర్భాల్లో తుది నిర్ణయం ఫ్రాంచైజీదే అవుతుంది.

వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ సంజు శాంసన్ 2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. అతను 2015 వరకు రాజస్థాన్ తరపున ఆడాడు, ఆ తర్వాత ఢిల్లీ అతన్ని తీసుకుంది. ఢిల్లీతో రెండు సీజన్లు ఆడిన తర్వాత సంజు 2018లో మరోసారి రాజస్థాన్ రాయల్స్‌కు తిరిగి వచ్చాడు. అప్పటి నుంచి అతను ఇదే ఫ్రాంచైజీ తరపున ఆడుతున్నాడు. 

2025లో ఆకట్టుకోలేకపోయిన సంజూ

సంజు శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్-2025లో 14 మ్యాచ్‌లు ఆడింది, అందులో కేవలం నాలుగు మాత్రమే గెలిచింది. జట్టు 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. కేవలం ఎనిమిది పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ జట్టు పాయింట్ల పట్టికలో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. సంజు సామ్సన్ ఐపీఎల్ కెరీర్‌లో ఇప్పటి వరకు 176 మ్యాచ్‌లు ఆడాడు, ఇందులో 30.75 సగటుతో 4,704 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతను మూడు సెంచరీలు, 26 అర్ధ సెంచరీలు సాధించాడు. ఈ లీగ్‌లో సంజు 379 ఫోర్లతో పాటు 219 సిక్సర్లు కూడా కొట్టాడు. సంజు ఐపీఎల్‌లో 86 క్యాచ్‌లు పట్టడంతో పాటు 17 స్టంపింగ్‌లు కూడా చేశాడు.

వదిలిపెట్టాలని రిక్వస్ట్ పెట్టుకున్న అశ్విన్‌

అశ్విన్ కూడా తాను ఫ్రాంచైజీ నుంచి వెళ్లిపోతానంటూ రిలీవ్ చేయాలని సీఎస్కే యాజమాన్యానికి రిక్వస్ట్ పెట్టుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. తన కెరీర్‌ను ప్రారంభించిన చెన్నై ఫ్రాంచైజీకి గత సీజన్‌లో వచ్చాడు అశ్విన్‌. ఇప్పడు అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత పూర్తిగా ఐపీఎల్‌పై ఫోకస్ చేయాలని చూస్తున్నాడు. అందుకే ఫ్రాంచైజీ మారాలనే ఆలోచన చేస్తున్నాడు.   

సీఎస్కేలో భవిష్యత్ లేదని భావిస్తున్న అశ్విన్

ప్రస్తుతం సీఎస్‌కేలో అశ్విన్‌ కు గ్యారంటీ లేదు. గతేడాది కూడా అతను 9మ్యాచ్‌లు ఆడి ఏడు వికెట్లు మాత్రమే తీశాడు. ఆయన ఫెర్ఫార్మెన్స్ కూడా అంత గొప్పగా ఏం లేదు. ఈసారి సీఎస్కేలో ఉన్నా తుది జట్టులో చోటు కష్టమే. ఇప్పటికే చాలా మ్యాచ్‌లు బెంచ్‌కు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది.

సంజూ సీఎస్కేకు- అశ్విన్ రాజస్థాన్‌కు!

సంజూ శాంసన్ సీఎస్కేవైపు చూస్తున్నాడు. ఇంతలో అశ్విన్ కూడా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నందున ఆ స్థానం భర్తీ అవుతుందని చెన్నై ఫ్రాంచైజీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ సంజూను జట్టులోకి తీసుకుంటే కెప్టెన్, వికెట్ కీపర్, బ్యాటర్‌ మూడు విభాగాలకు మంచి ఆటగాడు దొరికినట్టు అవుతుంది. ఎంఎస్ ధోనీకి మంచి ప్రత్యామ్నాయం అవుతుందని అంటున్నారు. మరోవైపు అశ్విన్‌ కూడా రాజస్థాన్‌లో చాలా కాలం ఆడాడు. మంచి విజయాలను కూడా అందించాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లను మార్చుకుంటే లెక్క సరిపోతుందని సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.