Sunrisers Hyderabad vs Rajasthan Royals: ఐపీఎల్ 2023 సీజన్ 52వ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ (RR) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో మొదట సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) బౌలింగ్ చేయనుంది.
పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ చివరి స్థానంలోనూ, రాజస్తాన్ రాయల్స్ నాలుగో స్థానంలోనూ ఉన్నాయి. ఈ మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధిస్తే మూడో స్థానానికి చేరనుంది. ఇక సన్‌రైజర్స్ భారీ తేడాతో గెలిస్తే పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానానికి లేదా తొమ్మిదో స్థానానికి చేరనుంది. రైజర్స్ ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిందే.
రాజస్తాన్ రాయల్స్ తుది జట్టు
యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, మురుగన్ అశ్విన్, సందీప్ శర్మ, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్
రాజస్తాన్ రాయల్స్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
దేవదత్ పడిక్కల్, ఆడమ్ జంపా, రియాన్ పరాగ్, జాసన్ హోల్డర్, ఒబెడ్ మెక్‌కాయ్
సన్‌రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు
అభిషేక్ శర్మ, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, మార్కో జాన్సెన్, వివ్రాంత్ శర్మ, మయాంక్ మార్కండే, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇంపాక్ట్ ప్లేయర్ సబ్స్
హ్యారీ బ్రూక్, అన్మోల్‌ప్రీత్ సింగ్, మయాంక్ దాగర్, నితీష్ రెడ్డి, సన్వీర్ సింగ్
కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓటమిపై సన్‌రైజర్స్ హైదరాబాద్ కోచ్ బ్రియన్ లారా స్పందించారు. కోల్‌కతా తమను ఓడించలేదని.. తామే స్వయంగా ఓడిపోయామని అన్నాడు. ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లను విమర్శించాడు. తమ వైపు వచ్చిన మ్యాచును చేజేతులా వదిలేశారని పేర్కొన్నాడు. బ్యాటింగ్ యూనిట్లో కాస్త పాజిటివిటీని పెంచాల్సి ఉందని వెల్లడించాడు. మ్యాచ్ ముగిశాక మీడియాతో మాట్లాడాడు.
'మేం ఇప్పటికీ పవర్ ప్లేలో వికెట్లు చేజార్చుకుంటున్నాం. ఇదే మమ్మల్ని వెనకడుగు వేసేలా చేస్తోంది. దాంతో మేం మళ్లీ హెన్రిచ్ క్లాసెన్ పైనే ఆధారపడ్డాం. ఇంకాస్త కష్టపడాలని కోరాం. అతడు ఆరో స్థానంలో వస్తున్నాడు. అతడి కన్నా ముందు ఐదుగురు మంచి బ్యాటర్లు మాకు ఉన్నారు. కానీ ప్రతిసారీ భారం అతడి మీదే పడుతోంది. ఇలాంటి మ్యాచుల్ని గెలిపించాల్సిన బాధ్యతను వారు తీసుకోవాల్సింది. కానీ పని చేయడం లేదు' అని బ్రియన్ లారా అన్నాడు.
'భాగస్వామ్యాలు నెలకొల్పడంపై మేం మరింత దృష్టి పెట్టాలి. మ్యాచ్‌పై అవగాహన పెంచుకోవాలి. అగ్రెసివ్‌గా ఆడటం ముఖ్యమే కానీ చివరి వరకు నిలబడటం అంతకన్నా కీలకం' అని లారా అన్నాడు. కేకేఆర్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని ఆయన ప్రశంసించాడు.
'వరుణ్ చక్రవర్తి, సునిల్ నరైన్ నాణ్యమైన స్పిన్నర్లు. టోర్నీ సాగే కొద్దీ స్పిన్నర్లు కీలకం అవుతుండటాన్ని గమనిస్తున్నాం. నరైన్, చక్రవర్తి ప్రపంచ స్థాయి స్పిన్నర్లు. మార్క్‌క్రమ్, క్లాసెన్ మంచి భాగస్వామ్యం అందించారు. ఒకట్రెండు ఓవర్లలో షాట్లు ఆడటంతో మ్యాచులోకి వచ్చాం. ముఖ్యమైన సమయంలో వికెట్లు పోవడంతో పట్టు కోల్పోయాం. నిజానికి మేమీ మ్యాచ్ గెలవాల్సింది. కేకేఆర్ మమ్మల్ని ఓడించే స్థితిలో లేదు. మేమే స్వయంగా ఓడిపోయాం' అని లారా పేర్కొన్నాడు.