RR vs RCB IPL 2024 Eliminator: వరుసగా నాలుగు మ్యాచుల్లో పరాజయం పాలై... అగ్రస్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయిన రాజస్థాన్‌ రాయల్స్‌(RR) ఒకవైపు... అసలు ప్లే ఆఫ్‌ చేరడమే కష్టమని అనుకున్న దశలో వరుసగా ఆరు మ్యాచుల్లో విజయం సాధించి ప్లే ఆఫ్‌లో అడుగుపెట్టిన రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) మరోవైపు... యశస్వీ జైస్వాల్‌, సంజు శాంసన్‌.. రియాన్‌ పరాగ్‌లతో కూడిన బలమైన బ్యాటింగ్‌ ఒక వైపు... కోహ్లీ, డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌లతో కూడిన విధ్వంసకర బ్యాటర్లు మరోవైపు.. ఇప్పుడు ఈ రెండు జట్ల మధ్య భీకర పోరు జరగనుంది. గుజరాత్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అహ్మదాబాద్‌ పిచ్‌పై బ్యాటర్లు భారీ స్కోరు చాలా అరుదుగా నమోదవుతూ ఉంటాయి. పిచ్‌ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటుందన్న అంచనాల నేపథ్యంలో ఇరు జట్ల బౌలర్లు ఏ మేరకు రాణిస్తారో చూడాలి. మోదీ స్టేడియంలో ఈ సీజన్‌లో మొత్తం 12 మ్యాచుల్లో కేవలం రెండు సార్లు మాత్రమే 200కుపైగా పరుగులు నమోదయ్యాయి. అంటే ఇక్కడ బ్యాటర్లు చెమటోడ్చాల్సిందే. 


హెడ్‌ టు హెడ్‌ రికార్డులు
ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు- రాజస్థాన్‌ రాయల్స్‌ ఇప్పటివరకు 30 సార్లు తలపడగా ఆర్సీబీ 15 మ్యాచ్‌ల్లో, రాజస్థాన్‌ 12 మ్యాచ్‌ల్లో నెగ్గాయి. మూడు మ్యాచ్‌ల్లో ఫలితం రాలేదు. ఈ సీజన్‌లో ఈ జట్లు ఒకేసారి తలపడగా.. రాయల్స్‌ పైచేయి సాధించింది.


కీలక ఆటగాళ్లు 
ఈ ఐపీఎల్‌ రెండో అర్ధ భాగంలో రాజస్థాన్‌ రాయల్స్‌ వరుసగా విఫలమవుతున్న ఆ జట్టులో కీలక ఆటగాళ్లు రాణిస్తే హోరాహోరీ తప్పదు. యశస్వి జైస్వాల్‌ 348 పరుగులు, సంజు శాంసన్‌ 504 పరుగులు, రియాన్‌ పరాగ్‌ 531 పరుగులు చేసి మంచి టచ్‌లో ఉన్నారు. వీరు ఎలా చెలరేగుతారన్న దానిపైనే రాజస్థాన్‌ గెలుపు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. బౌల్ట్, సందీప్‌ శర్మ, అశ్విన్, చాహల్‌ వంటి వారితో రాయల్స్‌ బౌలింగ్‌ కూడా బాగానే ఉంది. ఇటు  కోహ్లి 708 పరుగులతో సూపర్‌ ఫామ్‌లో ఉండడం బెంగళూరుకు పెద్ద సానుకూలాంశం. డుప్లెసిస్‌ 421 పరుగులు, రజత్‌ పటీదార్‌ 361 పరుగులు, దినేశ్‌ కార్తీక్‌ 315 పరుగులు, గ్రీన్‌ 228 పరుగులతో పర్వాలేదనిపిస్తున్నారు. మ్యాక్స్‌వెల్‌ ఫామ్‌ అందుకుంటే రాజస్థాన్‌ బౌలర్లకు తిప్పలు తప్పవు. సిరాజ్, దయాళ్, గ్రీన్, ఫెర్గూసన్‌ బౌలింగ్‌తో బెంగళూరు బౌలింగ్‌ కూడా పర్వాలేదనిపిస్తోంది. 


జట్లు:
రాజస్థాన్ రాయల్స్: సంజూ శాంసన్ (కెప్టెన్‌), అబిద్ ముస్తాక్, అవేష్ ఖాన్, ధ్రువ్ జురెల్, డోనోవన్ ఫెరీరా, కుల్దీప్ సేన్, కునాల్ సింగ్ రాథోడ్, నంద్రే బర్గర్, నవదీప్ సైనీ, రవిచంద్రన్ అశ్విన్, రియాన్ పరాగ్, సందీప్ శర్మ, షిమ్రాన్ హెట్మేర్, శుభమ్ డుబీ, శుభమ్ డుబీ పావెల్, టామ్ కోహ్లర్-కాడ్మోర్, ట్రెంట్ బౌల్ట్, యశస్వి జైస్వాల్, యుజ్వేంద్ర చాహల్, తనుష్ కోటియన్.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్‌), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లి, రజత్ పటీదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేశాయ్, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ దాగర్, విజయ్‌కుమార్ వైషాక్ ఆకాష్ దీప్, మహ్మద్ సిరాజ్, రీస్ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, టామ్ కర్రాన్, లాకీ ఫెర్గూసన్, స్వప్నిల్ సింగ్ మరియు సౌరవ్ చౌహాన్.