Yashasvi Jaiswal roars back to form with hundred before T20 World Cup: అమెరికా-వెస్టిండీస్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న టీ 20 ప్రపంచకప్‌(T20 World Cup) 2024 కోసం క్రికెట్‌ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. పొట్టి ప్రపంచకప్‌ కోసం భారత జట్టును ప్రకటించేందుకు ఇంకా వారం రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal ) అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీకి హెచ్చరికలు పంపాడు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో అద్భుత శతకంతో చెలరేగిన జైస్వాల్‌... పొట్టి ప్రపంచకప్‌లో తన పేరును పరిగణనలోకి తీసుకోలేని పరిస్థితిని కల్పించాడు. ఈ ఐపీఎల్‌లో వరుసగా విఫలమైన జైస్వాల్‌... ముంబైతో జరిగిన మ్యాచ్‌లో మాత్రం మునుపటి జైస్వాల్‌ను గుర్తు చేశాడు. ఈ ఒక్క ఇన్నింగ్స్‌తో టీ 20 ప్రపంచకప్‌లో చోటుపై కన్నేశాడు. 


టచ్‌లోకి వస్తే ఆపలేం...
ఐపీఎల్‌కి ముందు ఇంగ్లండ్‌తో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన జైశ్వాల్‌... పూర్తి ఆత్మ విశ్వాసంతో ఐపీఎల్‌ బరిలోకి దిగాడు. అయితే ఈ ఐపీఎల్ లో ఆశించిన మేర పరుగులు రాబట్టలేకపోయాడు. సగం మ్యాచ్‌లు పూర్తయినా జైస్వాల్‌ నుంచి ఒక్క భారీ ఇన్నింగ్స్ రాలేదు. కానీ  టీ20వరల్డ్ కప్‌ జట్టులో ఉండాలంటే రాణించక తప్పని మ్యాచ్‌లో సూపర్ సెంచరీతో యశస్వి జైశ్వాల్ ఫామ్‌లోకి వచ్చేశాడు. ముంబై ఇండియన్స్ పై నిన్న జరిగిన మ్యాచ్ లో రాజస్థాన్ చేయాల్సిన 180పరుగుల లక్ష్య చేధనను తన బ్యాటింగ్ తో చాలా ఈజీ చేసేశాడు. ఓపెనర్ బట్లర్, వన్ డౌన్ బ్యాటర్ కెప్టెన్ శాంసన్ తోడుగా ఆడుతూ 60 బంతుల్లో 9 ఫోర్లు 7 సిక్సర్లతో 104పరుగులు బాదేశాడు. ఈ సీజన్ లో ఒక్కసారి హాఫ్ సెంచరీ చేయని జైశ్వాల్ ఈసారి ఎలాగైనా సెంచరీ కొట్టి తీరాలన్న కసి ముంబైపై మ్యాచ్ లో కొట్టొచ్చినట్లు కనిపించింది.  ముంబై బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొంటూ వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ సూపర్ సెంచరీ కొట్టేసిన జైశ్వాల్ శతకం పూర్తవగానే గాల్లోకి ఎగిరి తనదైన స్టైల్ లో సింహనాదం చేశాడు.   ఈ సెంచరీ ద్వారా తనూ వరల్డ్ కప్ రేసులో ఉన్నాననే వార్నింగ్ ను సెలెక్టర్లకు పంపించాడు. మరి టీ 20 ప్రపంచకప్‌ జట్టులో యశస్వీ ఉంటాడో లేదో చూడాలి. 


ప్రయోగాలు లేవట..!
మే 1వ తేదీలోపు టీ 20 ప్రపంచకప్‌నకు అగార్కర్‌ నేతృత్వంలోని సెలక్షన్‌ కమిటీ... 15 మంది సభ్యులుగల భారత జట్టును ప్రకటించాల్సి ఉంది. ఆ సమయానికి పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న ఆటగాళ్లను జట్టులోకి ఎంపిక చేయాలని సెలక్షన్‌ కమిటీ భావిస్తోంది. ఈ సారి పొట్టి ప్రపంచకప్‌లో ఎలాంటి ప్రయోగాలు ఉండబోవని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు. టీమిండియా తరపున, ఐపీఎల్‌లో నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లకు..తుది జట్టులో చోటు దక్కుతుందని.... ఇందులో ఎలాంటి ప్రయోగాలు ఉండబోవని ఆ అధికారి స్పష్టం చేశారు. అయితే శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్‌లలో ఒకరికి మాత్రమే జట్టులో చోటు దక్కే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. అయితే లెఫ్ట్‌ హ్యాండర్‌ కాబట్టి జైస్వాల్‌ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. మంచి ఫినిషర్‌ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తే కోల్‌కతా నైట్ రైడర్స్‌ ఆటగాడు రింకూ సింగ్, చెన్నై సూపర్ కింగ్స్‌ ప్లేయర్‌ శివమ్ దూబేలలో ఒకరు జట్టులోకి రావచ్చు. వికెట్‌ కీపర్ల విషయంలోనూ తీవ్ర పోటీ నెలకొంది. సంజూ శాంసన్‌, జితేష్ శర్మ, కెఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లు జట్టులో చోటు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. ఒక కీపర్‌గా రిషభ్‌ పంత్‌ను జట్టులోకీ తీసుకోవడం ఖాయం కాబట్టి ఆ రెండో బెర్తు ఎవరు దక్కించుకుంటారో అన్న ఉత్కంఠ కలుగుతోంది. అయితే రాహుల్‌ వైపు కానీ, ఇషాన్‌ కిషన్‌ వైపు కానీ సెలక్టర్లు మొగ్గు చూపే అవకాశం ఉంది.