Riyan Parag's unbeaten 84 powers Rajasthan Royals: ఢిల్లీ క్యాపిటల్స్(DC)తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్(RR) ఓ పోరాడే స్కోరు చేసింది. ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంలో ఆరంభంలో రాజస్థాన్ స్కోరు బోర్డు అసలు ముందుకే కదలలేదు. కానీ పది ఓవర్ల తర్వాత కాస్త పుంజుకున్న రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రియాన్ పరాగ్ 84 పరుగులతో రాణించడంతో 185 పరుగులు చేసింది. రవిచంద్రన్ అశ్విన్ 29 పరుగులతో రాణించాడు. పరాగ్ 45 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 84 పరుగులు చేశాడు.
పరాగ్ ఒక్కడే...
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఢిల్లీ..రాజస్థాన్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఆరంభంలోనే రాజస్థాన్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. జట్టు స్కోరు తొమ్మిది పరుగుల వద్ద స్టార్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అవుటయ్యాడు. ఏడు బంతుల్లో అయిదు పరుగులు చేసిన యశస్వీ జైస్వాల్‌ను.... ముకేష్ కుమార్ అద్భుత బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత రాజస్థాన్ కెప్టెన్ వరుసగా మూడు ఫోర్లు కొట్టి మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపించాడు. కానీ ఖలీల్ అహ్మద్ సంజు శాంసన్‌ను అవుట్ చేసి రాజస్థాన్‌కు మరో షాక్ ఇచ్చాడు. 14 బంతుల్లో 15 పరుగులు చేసిన శాంసన్... పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపటికే జోస్ బట్లర్ కూడా 16 బంతుల్లో 11 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో రాజస్థాన్ ఏడు ఓవర్లలో 36 పరుగులు మాత్రమే చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ఈ క్లిష్ట దశలో రియాన్ పరాగ్.. రవిచంద్రన్ అశ్విన్ రాజస్థాన్‌ను ఆదుకున్నారు. వీరిద్దరూ సమయోచితంగా బ్యాటింగ్ చేస్తూ రాజస్థాన్ స్కోరు బోర్డును నడిపించారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అశ్విన్ మూడు భారీ సిక్సర్లతో అలరించాడు. కానీ ఈ జోడీని అక్షర్ పటేల్ విడదీశాడు. 19 బంతుల్లో మూడు సిక్సర్లతో 29 పరుగులు చేసిన అశ్విన్.. అవుటయ్యాడు. ఆ తర్వాత రియాన్ పరాగ్ పోరాడడంతో రాజస్థాన్ పోరాడే లక్ష్యాన్ని.... ఢిల్లీ ముందు ఉంచింది. పరాగ్ 45 బంతుల్లో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. ధ్రువ్ జురెల్ 12 బంతుల్లో 20 పరుగులు చేసి అవుటయ్యాడు. దీంతో రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఢిల్లీ బౌలర్లలో ముకేశ్‌కుమార్ 1, ఖలీల్ అహ్మద్ 1, అక్షర్ పటేల్ 1, కుల్‌దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు.
సమఉజ్జీలుగా..
ఐపీఎల్‌లో ఇప్పటివరకూ ఇరు జట్లు 27సార్లు తలపడ్డాయి. ఇందులో 13సార్లు ఢిల్లీ విజయం సాధించగా... 14 సార్లు రాజస్థాన్ గెలిచింది. రాజస్థాన్‌పై ఢిల్లీ అత్యధిక స్కోరు 207 పరుగులుకాగా... ఢిల్లీపై రాజస్థాన్ అత్యధిక స్కోరు 222 పరుగులు. ఢిల్లీ అత్యల్ప స్కోరు 60 పరుగులు కాగా.... రాజస్థాన్ అత్యల్ప స్కోరు 115. జైపూర్‌లోని సవాయ్ మాన్‌సింగ్ స్టేడియంలో ఇరు జట్లు ఆరు మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. రాజస్థాన్ నాలుగు మ్యాచ్‌లు గెలవగా, ఢిల్లీ కేవలం రెండు మ్యాచ్‌లు మాత్రమే గెలిచింది. రాజస్థాన్‌తో జరిగిన గత ఐదు మ్యాచ్‌ల్లో ఢిల్లీ కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించింది.