Hardik Pandya completes 100 sixes for Mumbai Indians: హైదరాబాద్‌(Hyderabad) వేదికగా హైదరాబాద్‌(SRH)తో జరిగిన మ్యాచ్‌లో ముంబై సారధి హార్దిక్‌ పాండ్యా(Hardic Pandya) అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో కొట్టిన సిక్సర్‌తో ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌(MI) తరఫున 100 సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా హార్దిక్‌ రికార్డు సృష్టించాడు. ఈ జాబితాలో 223 సిక్సర్లతో కీరన్‌ పొలార్డ్‌ అగ్రస్థానంలో ఉండగా... 210 సిక్సర్లతో హిట్‌మాన్‌ రోహిత్‌ శర్మ తర్వాతి స్థానాల్లో హార్దిక్ నిలిచాడు. ముంబై ఇండియన్స్‌ తరఫున 94వ మ్యాచ్‌ ఆడిన హార్దిక్‌ ఈ ఘనతను సాధించాడు. ఈ మ్యాచ్‌లో 20 బంతుల్లో సిక్సర్‌, బౌండరీ సాయంతో 24 పరుగులు చేసిన హార్దిక్‌.. ముంబై తరఫున 15 వందల పరుగులను కూడా పూర్తి చేసుకున్నాడు.  హార్దిక్‌ ఓవరాల్‌గా తన ఐపీఎల్‌ కెరీర్‌లో 124 మ్యాచ్‌లు ఆడి 127 సిక్సర్లు బాదాడు.

 

ఇదీ ఓ భారీ రికార్డు

ఐపీఎల్‌-17వ సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు బోణీ కొట్టింది. ముంబై ఇండియన్స్‌తో జరిగిన హైస్కోరింగ్‌ మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 277 భారీ స్కోర్‌ చేసింది. ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక పరుగులు సాధించిన  జట్టుగా హైదరాబాద్‌ చరిత్ర సృష్టించింది. ఆరంభం నుంచే ఆ జట్టు బ్యాటర్లు దూకుడుగా ఆడారు. క్లాసెన్‌ 80,అభిషేక్‌ శర్మ 63, ట్రావిస్‌ హెడ్‌ 62, మార్‌క్రమ్‌ 42 వీరవిహారం చేశారు.

ముంబయి బౌలర్లలో కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, కోయెట్జీ, పీయూష్‌ చావ్లా ఒక్కో వికెట్‌ తీశారు. భారీ లక్ష్య ఛేధనలో ముంబయి కూడా ధీటుగా బదులిచ్చినా నిర్ణీత 20 ఓవర్లలో  5 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి ఓటమి పాలైంది. ముంబయి బ్యాటర్లలో తిలక్ వర్మ 64, టిమ్‌ డేవిడ్‌ 42, నమన్‌ ధీర్‌ 30 పరుగులు చేశారు. ప్యాట్‌ కమిన్స్‌, జయదేవ్‌ ఉనద్కట్‌ చెరో రెండు వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు నమోదయ్యాయి.

 

మరో రికార్డు

ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ మరో రికార్డు కూడా తమ ఖాతాలో వేసుకుంది. ఐపీఎల్‌ చరిత్రలో 10 ఓవర్ల అనంతరం అత్యధిక స్కోర్‌ చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. తొలి 10 ఓవర్లలో సన్‌రైజర్స్‌ 2 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది. దీనికి ముందు తొలి 10 ఓవర్లలో అత్యధిక స్కోర్‌ రికార్డు ముంబై ఇండియన్స్‌ పేరిట ఉండేది. 2021 సీజన్‌లో ముంబై తొలి 10 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. 

 

అత్యధిక స్కోరు

ఉప్పల్‌ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 277 పరుగులు చేయగా... ముంబై 246 పరుగులు చేసింది. ఈ రెండు జట్లు కలిపి ఈ మ్యాచ్‌లో 523 పరుగులు చేశాయి. అంతర్జాతీయ టీ20 చరిత్రలో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్‌గా ఈ మ్యాచ్ నిలిచింది. 2023లో దక్షిణాఫ్రికా-వెస్టిండీస్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో 517 పరుగులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ ఇదే అత్యధిక స్కోరు కాగా.... ఈ మ్యాచ్‌లో ఆ రికార్డు బద్దలైంది. పాకిస్తాన్‌ టీ 20లీగ్‌లో క్వెట్టా-ముల్తాన్‌ మధ్య జరిగిన పోరులో 515 పరుగుల రికార్డు నమోదైంది.