RR Gets 1st Win In IPL 2025: మాజీ చాంపియన్స్ రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్ లో బోణీ కొట్టింది. ఆదివారం గౌహతిలో జరిగిన మ్యాచ్ లో ఐదుసార్లు చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పై 6 పరుగులతో విజయం సాధించింది. అంతకముందు టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 182 పరుగులు చేసింది. వన్ డౌన్ బ్యాటర్ నితీశ్ రాణా స్టన్నింగ్ ఫిఫ్టీ (36 బంతుల్లో 81, 10 ఫోర్లు, 5 సిక్సర్లు)తో సత్తా చాటాడు. ఒక దశలో 200+ పరుగులు సాధిస్తుందనుకున్న రాయల్స్ ను చెన్నై బౌలర్లు చివర్లో బాగా కట్టడి చేశారు. బౌలర్లలో నూర్ అహ్మద్, మతీషా పతిరాణకు రెండేసి వికెట్లు దక్కాయి. తాజా ప్రదర్శనతో పర్పుల్ క్యాప్ మళ్లీ నూర్ అహ్మద్ కి దక్కింది. ఇక ఛేదనలో ఓవర్లన్నీ ఆడిన చెన్నై 6 వికెట్లకు 176 పరుగులు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ ఇన్నింగ్స్ (44 బంతుల్లో 63, 7 ఫోర్లు, 1 సిక్సర్)తో టాప్ స్కోరర్ గా నిలిచాడు. వనిందు హసరంగా 4 వికెట్లతో చెన్నై పని పట్టాడు. ఈ విజయంతో ఈ సీజన్ లో రాయల్స్ బోణీ కొట్టినట్లయ్యింది. తొలి రెండు మ్యాచ్ ల్లో ఆ జట్టు ఓడిపోయిన సంగతి తెలిసిందే.
ధనాధన్ ఇన్నింగ్స్..ఫస్ట్ బ్యాటింగ్ చేసిన రాయల్స్ కు షరామాములుగానే శుభారంభం దక్కలేదు. యశస్వి జైస్వాల్ (4) మరోసారి త్వరగా ఔటయ్యాడు. ఈ దశలో సంజూ శాంసన్ (20), నితీశ్ జంట చెన్నై బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంది. శాంసన్ ఆచితూచి ఆడగా, నితీశ్ బౌండరీలతో రెచ్చిపోయాడు. ఈక్రమంలో వీరిద్దరూ 82 పరుగులు జోడించారు. ఆ తర్వాత శాంసన్ ఔటైనా, నితీవ్ జోరు తగ్గలేదు. కేవలం 21 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అయితే సెంచరీకి సమీపిస్తున్న దశలో ఎంఎస్ ధోనీ తెలివిగా చేసిన స్టంపింగ్ కు నితీశ్ బలయ్యాడు. ఆ తర్వాత కెప్టెన్ రియాన్ పరాగ్ (19) మినహా మిగతా బ్యాటర్లు చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. దీంతో అనుకున్నదాని కంటే 25-30 పరుగులు తక్కువగానే రాయల్స్ సాధించింది.
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్..ఇక కాస్త కఠినమైన టార్గెట్ తోనే బరిలోకి దిగిన చెన్నైకి మంచి స్టార్ట్ దక్కలేదు. ఫామ్ లో ఉన్న రచిన్ రవీంద్రను జోఫ్రా ఆర్చర్ డకౌట్ చేశాడు. ఆ తర్వాత రాహుల్ త్రిపాఠి (23)తో కలిసి కాసేపు రాయల్స్ బౌలర్లను రుతురాజ్ ఎదుర్కొన్నాడు. ఆరంభంలో తడబడినా, తర్వాత వీరిద్దరూ వేగంగా ఆడారు. దీంతో రెండో వికెట్ కు 46 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. ఆ తర్వాత హసరంగా మ్యాచ్ ను పూర్తిగా మార్చేశాడు. త్రిపాఠి, శివమ్ దూబే (18), విజయ్ శంకర్ (9)లను ఔట్ చేయడంతో మ్యాచ్ రాయల్స్ వైపు మొగ్గింది. మరో ఎండ్ లో బౌండరీలతో ఒంటరిపోరాటం చేసిన రుతురాజ్ 37 బంతుల్లో ఫిఫ్టీ చేసుకుని, స్కోరు వేగాన్ని పెంచే క్రమంలో ఔటయ్యాడు. చివర్లో ధోనీ (16), రవీంద్ర జాడేజా (32 నాటౌట్) పోరాడినా, అది ఓటమి అంతరాన్ని తగ్గించడానికి మాత్రమే ఉపయోగ పడింది.