IPL 2024: ఐపీఎల్ లో చాలా రోజుల తర్వాత ఎల్ క్లాసికో మ్యాచ్ నిజమైన ఎల్ క్లాసికోలా సాగింది. ముంబయి ఇండియన్స్ తో వారి హోం గ్రౌండ్ లోనే జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ 105 పరుగులతో నాటౌట్ గా నిలిచినా, తిలక్ వర్మ వికెట్ తర్వాత మిడిల్ ఆర్డర్ లో ఎవరూ సహకరించలేదు. అందుకే లక్ష్యాన్ని ముంబయి ఛేదించలేకపోయింది.


మ్యాచ్ ను గెలిపించే అద్భుత అవకాశాన్ని కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్య మరోసారి చేజార్చుకున్నాడు. 6 బంతులాడి కేవలం 2 స్కోర్ చేసి ఔట్ అయ్యాడు. ఇన్నింగ్స్ ఫ్లోను కూడా దెబ్బతీశాడు. అంతకముందు బౌలింగ్ లోనూ అంతే. చెన్నై ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసి 26 పరుగులు సమర్పించుకున్నాడు. సరే పర్ఫార్మెన్స్ పరంగా కాస్త క్షమించొచ్చేమో కానీ, మ్యాచ్ తర్వాత మాట్లాడిన తీరు... మరోసారి ఫ్యాన్స్ అందర్నీ ఆగ్రహానికి గురి చేస్తోంది.


వికెట్ల వెనుక ధోనీ ప్రజెన్స్ గురించి, పతిరాన తీసిన వికెట్ల గురించి, శివం దూబే గురించి మాట్లాడాడు. ఓకే అది బాగానే ఉంది కానీ లక్ష్యఛేదన మొత్తం ఒక్కడై మోసిన రోహిత్ శర్మ పేరు కూడా పలకలేదు. గెలుపోటములు పక్కన పెడితే.. అంత చక్కటి సెంచరీ సాధించి పోరాడిన రోహిత్ శర్మ పేరు కనీసం ప్రస్తావించకపోవడం చాలా మంది ముంబయి ఫ్యాన్స్ నే నిరాశపర్చింది. బ్యాట్, బాల్ తో ఎలాగూ పర్ఫార్మెన్స్ లేదు. కనీసం మాటలు, చేతల్లో అయినా బెటర్ గా ఉంటే బాగుంటుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. 


చెన్నై సూపర్‌ కింగ్స్‌(CSK)తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ విధ్వంసకర శతకంతో మెరిసినా ముంబైకు ఓటమి తప్పలేదు. చెన్నై బౌలర్‌ పతిరన నాలుగు వికెట్లతో ముంబై వెన్నువిరిచాడు. ముంబై జట్టులో ఒక్క రోహిత్‌ శర్మ మాత్రమే మెరిశాడు. మిగిలిన బ్యాటర్లు చేతులెత్తేశారు. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 20 ఓవర్లలో 206 పరుగులు చేసింది. నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులో రుతురాజ్‌ గైక్వాడ్‌, శివమ్‌ దూబే సూపర్‌ బ్యాటింగ్‌తో భారీ స్కోరు చేసింది. చివర్లో ధోనీ నాలుగు బంతులు ఎదుర్కొని మూడు సిక్సులతో 20 పరుగులు చేశాడు. 


207 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై 186 పరుగులు మాత్రమే చేసింది. రోహిత్ మిహనా మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ఇషాన్‌ కిషన్‌, రోహిత్‌ శర్మ ముంబైకు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. ఏడు ఓవర్లకు 70 పరుగులు చేశారు. పతిరాన ఎంట్రీతో ముంబైకు కష్టాలు మొదలయ్యాయి. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి హార్దిక్‌ సేనను దెబ్బకొట్టాడు. 23 పరుగులకు ఇషాన్‌ కిషన్‌ అవుటైతే.. పరుగులేమీ చేయకుండానే సూర్యకుమార్‌ యాదవ్‌ పెవిలియన్ చేరాడు. 31 పరుగులు చేసి తిలక్‌ వర్మ అవుటైన తర్వాత వచ్చిన హార్దిక్‌ పాండ్యా మరోసారి విఫలమయ్యాడు. కేవలం రెండు పరుగులకే పెవిలియన్‌ చేరాడు. మరో ఎండ్‌లో ఉన్న రోహిత్ శర్మ మాత్రం పోరాటాన్ని ఆపలేదు. 63 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సులతో సెంచరీ కొట్టాడు. రోహిత్‌కు ఒక్క బ్యాటర్‌ కూడా మద్దతుగా నిలవలేదు. దీంతో 20 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది