Rohit Sharma angry : భారత కెప్టెన్ రోహిత్‌ శర్మ(Rohit Sharma) IPL బ్రాడ్‌కాస్టర్లపై విరుచుకుపడ్డాడు. శిక్షణ, మ్యాచ్‌ రోజుల్లో స్నేహితులు, సహచరులతో జరుపుతున్న సంభాషణలను రికార్డ్‌ చేసి.. ఆ కంటెంట్‌ను టెలికాస్ట్‌ చేస్తూ క్రికెటర్ల గోప్యతకు భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. KKR టీం అసిస్టెంట్‌ కోచ్‌ అభిషేక్‌ నాయర్‌తో ముంబై ఇండియన్స్‌(MI)లో తన భవిష్యత్‌ గురించి చర్చిస్తున్న వీడియో వైరలవడంపై రోహిత్‌ ఎక్స్‌ వేదికగా.. అసహనం వ్యక్తంచేశాడు.

 

స్నేహితులు, సహచరులతో శిక్షణ లేదా మ్యాచ్‌ రోజుల్లో చేసే ప్రతీ అడుగు, సంభాషణను రికార్డ్ చేయడం వల్ల క్రికెటర్ల జీవితాలు అనుచితంగా మారాయన్నాడు. తన సంభాషణను రికార్డ్ చేయవద్దని స్టార్ స్పోర్ట్స్‌ను కోరినా.. వినకుండా టెలికాస్ట్‌ చేసి గోప్యతకు భంగం కలిగించిందన్నాడు. వ్యూస్‌ కోసం చేసే పనులు ఫ్యాన్స్‌, క్రికెటర్ల మధ్య నమ్మకాన్ని దెబ్బతీస్తుందని వివరించాడు. మే 11న ముంబై ఇండియన్స్‌, KKR మ్యాచ్‌ సందర్భంగా.. అభిషేక్‌ నాయర్‌తో రోహిత్‌ మాట్లాడాడు. ఆ వీడియోను KKR సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడంతో.. రోహిత్‌ ముంబై ఇండియన్స్‌ను వీడతాడంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అనంతరం మే 17న దావల్‌ కులకర్ణి, రోహిత్‌ సంభాషణ కూడా బహిర్గతం అయింది.





 

అప్పటినుంచే మనస్పర్థలు

రోహిత్ శర్మ(Rohit Sharma) ముంబై(MI)కి అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా నిలిచాడు. అతని కెప్టెన్సీలో జట్టు ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. 2013, 2015, 2017, 2019, 2020లో ముంబై టైటిల్ గెలుచుకుంది. రోహిత్ వ్యక్తిగత ఐపీఎల్ ప్రదర్శనను గమనిస్తే అతను కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఏప్రిల్ 2008లో రోహిత్ తన ఫస్ట్‌ ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడాడు. డెక్కర్ ఛార్జర్స్ తరఫున రోహిత్ అరంగేట్రం చేశాడు. పాండ్యా(HArdic Pandya) గతంలో గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ టైటిల్ గెలుచుకోవడంతోపాటు గత సీజన్లో ఆ జట్టు ఫైనల్స్‌కి కూడా చేరింది. అయితే ఎప్పుడైతే రోహిత్‌ను ముంబై కెప్టెన్‌గా తొలగించి హార్దిక్‌ను కెప్టెన్‌గా పెట్టారో అప్పటినుంచే హిట్‌ మ్యాన్‌ ముంబైను వీడుతారని ప్రచారం జరుగుతోంది.

స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మను కాదని ముంబయి ఇండియన్స్ కెప్టెన్‌ బాధ్యతలను హార్దిక్ పాండ్యకు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం రోహిత్ ఫ్యాన్స్‌కు ఆగ్రహం తెప్పించింది. దీంతో వేలాది మంది ముంబై ఇండియన్స్ సోషల్ మీడియా ఖాతాలను అన్‌ఫాలో చేశారు. సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ యాజమాన్య నిర్ణయాన్ని తప్పుపడుతూ పరోక్షంగా సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే రోహిత్‌ను వాళ్ళు బహిరంగంగా సపోర్ట్ చేయటం గానీ, సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయటం గానీ జరగలేదు .

 

ముంబైను రోహిత్ వీడుతాడా ?

IPL 2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి రోహిత్‌శర్మను తప్పించడంపై ఇప్పటికీ తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై విపరీతమైన ట్రోలింగ్‌ కూడా జరిగింది. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టును వీడుతాడన్న ప్రచారం జరుగుతోంది. ముంబైని 5 సార్లు ఐపిఎల్ ఛాంపియన్‌గా చేసిన రోహిత్ శర్మ 2025 ఐపీఎల్‌ మెగా వేలంలో వేలానికి అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలుస్తోందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.