PBKS vs SRH IPL 2024 Sunrisers Hyderabad target 215 :హైదరాబాద్‌తో జరుగుతున్న నామమాత్రపు మ్యాచ్‌లో పంజాబ్(PBKS) బ్యాటర్లు రాణించారు. ఆరంభం నుంచే సన్‌రైజర్స్(SRH) బౌలర్లపై ఎదురుదాడి చేసిన పంజాబ్ బ్యాటర్లు.. భారీ స్కోరు సాధించారు. పంజాబ్ ఓపెనర్లు శుభారంభం అందించగా... ఆ తర్వాత వచ్చిన బ్యాటర్లు కూడా రాణించారు. దీంతో పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు, కెప్టెన్ కమిన్స్, విజయకాంత్ వియస్కాంత్ ఒక్కో వికెట్ తీశారు.
శుభారంభం
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ జితేశ్ శర్మ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్‌లో ఐదు పరుగులే వచ్చాయి. కానీ ఆ తర్వాత పంజాబ్ ఓపెనర్లు ప్రభ్‌సిమ్రన్ సింగ్, అథర్వ ధాటిగా ఆడారు. మూడు ఓవర్లకు స్కోరు 24 పరుగులు చేసిన పంజాబ్ ఓపెనర్లు భారీ స్కోరుకు పునాది వేశారు. ఆరంభంలో కాస్త నెమ్మదిగా ఆడిన ప్రభ్‌సిమ్రన్ సింగ్ క్రీజులో కుదురుకున్నాక దూకుడుగా ఆడాడు. దీంతో పవర్ ప్లే పూర్తయ్యే సరికి పంజాబ్ వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లు వికెట్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని మాత్రం విడగొట్టలేకపోయారు. ప్రభ్‌సిమ్రన్ సింగ్, అథర్వ ఛాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. ఏడు ఓవర్లకు పంజాబ్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది. షాబాజ్ అహ్మద్ వేసిన ఎనిమిదో ఓవర్‌లో అథర్వ తైడే వరుసగా ఫోర్, సిక్స్ బాదాడు. ఎనిమిది ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్ స్కోరు 82 పరుగులకు చేరింది. వియస్కాంత్ వేసిన 9వ ఓవర్‌లో 15 పరుగులు వచ్చాయి. తొమ్మిది ఓవర్లకు పంజాబ్ స్కోరు 97 పరుగులు చేరిన తర్వాత కానీ హైదరాబాద్‌కు తొలి వికెట్ దక్కలేదు. 27 బంతుల్లో అయిదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 46 పరుగులు చేసిన అథర్వ తైడేను నటరాజన్ అవుట్ చేశాడు. దీంతో పంజాబ్ ఎట్టకేలకు మొదటి వికెట్ కోల్పోయింంది. 10 ఓవర్లకు పంజాబ్ స్కోరు ఒక్క వికెట్ నష్టానికి 99 పరుగులకు చేరింది.
మరో కీలక భాగస్వామ్యం
ప్రభ్‌సిమ్రన్ సింగ్ పదకొండో ఓవర్‌లో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత నితీశ్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్లో 20 పరుగులు ఇచ్చాడు. నితీశ్ కుమార్ రెడ్డి తన తొలి ఓవర్‌లోనే పంజాబ్ బ్యాటర్లు 20 పరుగులు పిండుకున్నారు. ఆ ఓవర్‌లో రిలీ రోసో ఫోర్, సిక్స్ బాదగా..ప్రభ్‌సిమ్రన్ సింగ్ కూడా సిక్స్ కొట్టాడు. దీంతో పంజాబ్ 13 ఓవర్లకు ఒక్క వికెట్ నష్టపోయి 140 పరుగులు చేసింది. 14 ఓవర్లు పూర్తయ్యే సరికి పంజాబ్ స్కోరు 150 దాటింది. 151 పరుగుల వద్ద పంజాబ్ రెండో వికెట్ కోల్పోయింది. 45 బంతుల్లో 7 ఫోర్లు, నాలుగు సిక్సులతో 71 పరుగులు చేసిన ప్రభ్‌సిమ్రన్ సింగ్‌ను వియస్కాంత్ అవుట్ చేశాడు. ఆ తర్వాత వెంటనే మంచి ఫామ్‌లో ఉన్న శశాంక్ సింగ్ రెండు పరుగులే చేసి రనౌట్ అయ్యాడు. 16 ఓవర్లకు పంజాబ్ స్కోరు 174/3. రిలీ రోసో ధాటిగా ఆడాడు. 24 బంతుల్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 49 పరుగులు చేసిన రోసో.. అర్ధ సెంచరీకి కేవలం ఒకే పరుగు దూరంలో అవుటయ్యాడు. కమిన్స్ వేసిన 18 ఓవర్లో అబ్దుల్ సమద్‌కు క్యాచ్ ఇచ్చి రూసో అవుటయ్యాడు. చివర్లో కెప్టెన్ జితేశ్ శర్మ 32 పరుగులతో మెరుపు బ్యాటింగ్ చేయడంతో పంజ బ్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు, కెప్టెన్ కమిన్స్, విజయకాంత్ వియస్కాంత్ ఒక్కో వికెట్ తీశారు.