Rohit Sharma And Akash Ambani Spotted Together Inside Car: ఐపీఎల్‌ 2024(IPL 2024) ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్(MI) కెప్టెన్సీ నుంచి రోహిత్‌శర్మ(Rohit Sharma)ను తప్పించడంపై తీవ్ర విమర్శలు చెలరేగాయి. ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా(Hardic Pandya)పై విపరీతమైన ట్రోల్ జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో రోహిత్- హార్దిక్ మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలు కూడా వస్తున్నాయి. IPL 2024 చివరిలో రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టును వీడుతాడన్న ప్రచారం జరుగుతోంది. ముంబైని 5 సార్లు ఐపిఎల్ ఛాంపియన్‌గా చేసిన రోహిత్ శర్మ 2025 ఐపీఎల్‌ మెగా వేలంలో వేలానికి అందుబాటులో ఉండే అవకాశం ఉందని తెలుస్తోందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఈ ఊహాగానాలు చెలరేగుతున్న వేళ కీలక సంఘటన జరిగింది. బెంగళూరుతో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న వేళ ఆకాశ్‌ అంబానీ(Akash Ambani) కారులో రోహిత్‌ శర్మ సంచరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.


ఎందుకీ రైడ్‌
ముంబై ఇండియ‌న్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మను ఆ ఫ్రాంచైజీ య‌జ‌మాని ఆకాశ్ అంబానీ త‌న కారులో రైడ్‌కి తీసుకెళ్లాడు. ముంబైలోని వాంఖడే స్టేడియం బ‌య‌ట రోహిత్‌ను ఆకాశ్ త‌న ల‌గ్జరీ కారులో ఎక్కించుకుని వెళ్తున్న వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్ అవుతోంది. ఆకాష్ అంబానీ స్వ‌యంగా కారు డ్రైవింగ్ చేయ‌డం విశేషం. ఆకాశ్ కారులో రోహిత్ శ‌ర్మ ఎందుకు ప్ర‌యాణించారు అన్న దాని పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. కెప్టెన్సీ మార్పు పై చ‌ర్చించార‌ని కొంద‌రు, ఏదైన కీల‌క విష‌యాల‌ను డిస్కస్ చేస్తున్నారేమో అని ఇంకొంద‌రు కామెంట్లు చేస్తున్నారు. వాంఖడే స్టేడియం వైపు వెళ్తున్న వారిద్దని చూసేందుకు రోహిత్ ఫ్యాన్స్ ఆతృతగా ముందుకెళ్లారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది.



అంబటి రాయుడు ఏమన్నాడంటే..?
కెప్టెన్సీ మార్పు విషయంలో రోహిత్‌ శర్మతో ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ సరిగ్గా వ్యవహరించ లేదని అంబటి రాయుడు అభిప్రాయపడ్డాడు. 2025 ఐపీఎల్‌ మెగా వేలంలో వేలానికి హిట్‌మ్యాన్‌ అందుబాటులో ఉంటే.. అతడిని ఏ ప్రాంఛైజీ అయినా భారీ ధర చెల్లించి సొంతం చేసుకుంటుందని రాయుడు అన్నాడు. అతను ఏ ప్రాంఛైజీకి కావాలంటే ఆ ప్రాంఛైజీకి  వెళ్లవచ్చని... అన్ని IPL జట్లు రోహిత్‌ను కెప్టెన్‌గా చేయడానికి రెడీగా ఉంటాయని  అంబటి తెలిపాడు. ముంబై ఇండియన్స్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవహరించిన దాని కంటే మిగిలిన ప్రాంఛైజీలు రోహిత్‌తో చాలా మెరుగ్గా వ్యవహరిస్తాయని కూడా అంబటి రాయుడు తెలిపాడు. 


Also Read: లక్నోకు గట్టి ఎదురుదెబ్బ, స్పీడ్‌ స్టార్‌ దూరం


లాంగర్‌ కామెంట్స్‌
టీమిండియా కెప్టెన్‌, ముంబై ఇండియన్స్‌(MI) స్టార్‌ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(Rohit Sharma) గురించి..లక్నో సూపర్‌ జెయింట్స్‌ హెడ్‌ కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌(LSG coach Justin Langer)ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ వచ్చే సీజన్‌లో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీని విడిచిపెడితే.. అతడిని తమ జట్టులోకి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని లాంగర్‌ ప్రకటించాడు. ఈ ప్రకటనతో లాంగర్‌ హిట్‌ మ్యాన్‌ అభిమానుల మనసులు గెలుచుకున్నాడు. IPL 2025 మెగా వేలంలో ఆటగాళ్లందరూ వేలానికి అందుబాటులో ఉంటే... మీ జట్టులోకి ఎవరిని తీసుకుంటారన్న ప్రశ్న  జస్టిన్ లాంగర్‌కు ఎదురైంది. దీనికి లాంగర్‌ స్పందించాడు. రోహిత్ శర్మతో కలిసి పని చేయాలనే కోరికను వ్యక్తం చేశాడు. తాను రోహిత్ శర్మను తమ జట్టులోకి తీసుకొని అతనితో కలిసి పని చేయాలని అనుకుంటున్నట్లు లాంగర్‌ తెలిపాడు.