Royal Challengers Bangalore vs Rajasthan Royals: ఐపీఎల్‌లో ఆదివారం మధ్యా రాజస్తాన్ రాయల్స్‌పై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు‌ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. అనంతరం రాజస్తాన్ రాయల్స్ 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 182 పరుగులు మాత్రమే చేయగలిగింది.


రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్లలో దేవ్‌దత్ పడిక్కల్ (52: 34 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) అర్థ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తనకు యశస్వి జైస్వాల్ (47: 37 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు) చక్కటి సహకారం అందించాడు. ఆఖర్లో ధ్రువ్ జురెల్ (34 నాటౌట్: 16 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) పోరాడాడు. కానీ ఫలితం లేకపోయింది. ఇక బెంగళూరు బ్యాట్స్‌మెన్‌లో గ్లెన్ మ్యాక్స్‌వెల్ (77: 44 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఫాఫ్ డుఫ్లెసిస్ (62: 39 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు) అర్థ సెంచరీ సాధించాడు. వీరిద్దరూ తప్ప ఇంకెవరూ రాణించలేకపోయారు. ముఖ్యంగా చివరి ఐదు ఓవర్లలో చెత్త ప్రదర్శన కనబరిచారు. కేవలం 33 పరుగులు మాత్రమే చేసి ఐదు వికెట్లు కోల్పోయారు.


యశస్వి, దేవ్‌దత్ పోరాడినా...
190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్‌ను సిరాజ్ మొదటి ఓవర్లోనే ఎదురు దెబ్బ కొట్టాడు. ఇన్నింగ్స్‌ నాలుగో బంతికే ఫాంలో ఉన్న జోస్ బట్లర్‌ను (0: 2 బంతుల్లో) క్లీన్ బౌల్డ్ చేశాడు. అయితే యశస్వి జైస్వాల్ (47: 37 బంతుల్లో, ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లు), వన్ డౌన్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్ (52: 34 బంతుల్లో, ఏడు ఫోర్లు, ఒక సిక్సర్) ఇన్నింగ్స్‌ను కుదుటపరిచారు. వీరు రెండో వికెట్‌కు 98 పరుగులు జోడించారు. సాధించాల్సిన రన్‌రేట్ అదుపు తప్పకుండా కంట్రోల్‌లో పెట్టారు. కానీ అర్థ సెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే డేవిడ్ విల్లీ బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి దేవ్‌దత్ పడిక్కల్ అవుటయ్యాడు. ఆ వెంటనే యశస్వి జైస్వాల్‌ను హర్షల్ పటేల్ పెవిలియన్‌కు పంపాడు. దీంతో రాజస్తాన్ రాయల్స్‌పై ఒత్తిడి పెరిగింది.


షిమ్రన్ హెట్‌మేయర్ (3: 9 బంతుల్లో) విఫలం అయ్యాడు. ధ్రువ్ జురెల్ (34 నాటౌట్: 16 బంతుల్లో, రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు) చివర్లో పోరాడినా లక్ష్యాన్ని ఛేదించడానికి అది సరిపోలేదు. దీంతో రాజస్తాన్ విజయానికి ఏడు పరుగుల దూరంలో ఉండిపోయింది. బెంగళూరు బౌలర్లలో హర్షల్ పటేల్ మూడు వికెట్లు పడగొట్టాడు. మహ్మద్ సిరాజ్, డేవిడ్ విల్లీలకు చెరో వికెట్ దక్కింది.


మ్యాక్స్‌వెల్, ఫాఫ్ డుఫ్లెసిస్ షో
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రాజస్తాన్ రాయల్స్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆర్సీబీ మొదట బ్యాటింగ్‌కు దిగింది. అయితే వారికి మొదటి బంతికే భారీ షాక్ తగిలింది. ఫాంలో ఉన్న కెప్టెన్, ఓపెనర్ విరాట్ కోహ్లీను (0: 1 బంతి)మొదటి బంతికే ట్రెంట్ బౌల్ట్ ఎల్బీడబ్ల్యూగా అవుట్ చేశాడు. వన్‌డౌన్ బ్యాటర్ షాబాజ్ అహ్మద్‌ను (2: 4 బంతుల్లో) కూడా బౌల్ట్ తన తర్వాతి ఓవర్లోనే అవుట్ చేశాడు. దీంతో బెంగళూరు 12 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది.


ఆ తర్వాత నుంచి ఓపెనర్ ఫాఫ్ డుఫ్లెసిస్ (62: 39 బంతుల్లో, ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు), గ్లెన్ మ్యాక్స్‌వెల్‌ (77: 44 బంతుల్లో, ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు) మాస్ ర్యాంపేజ్ మొదలయింది. ఏ దశలోనూ రన్‌రేట్ 10కి పడిపోకుండా వీరు అద్భుతంగా ఆడారు. వీరి ధాటికి పవర్ ప్లేలో ఆర్సీబీ 62 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా వీరి జోరు తగ్గలేదు. 10 ఓవర్లకు స్కోరు 101 పరుగులకు తీసుకెళ్లారు. ఇద్దరూ అర్థ సెంచరీలు కూడా పూర్తి చేసుకున్నారు. రెండో వికెట్‌కు 127 పరుగులు జోడించిన అనంతరం లేని పరుగుకు ప్రయత్నించి ఫాఫ్ డుఫ్లెసిస్ రనౌటయ్యాడు. కాసేపటికే మ్యాక్స్‌వెల్ కూడా అశ్విన్ బౌలింగ్‌లో స్విచ్ హిట్‌కు ప్రయత్నించి హోల్డర్ చేతికి చిక్కాడు. అప్పటికి స్కోరు 15 ఓవర్లలో 155 పరుగులకు చేరుకుంది.


మ్యాక్స్‌వెల్ అవుటయ్యాక ఆర్సీబీ పూర్తిగా తడబడింది. చివరి ఐదు ఓవర్లలో 33 పరుగులు మాత్రమే చేసింది. మహిపాల్ లొమ్రోర్ (8: 6 బంతుల్లో, ఒక ఫోర్), దినేష్ కార్తీక్ (16: 13 బంతుల్లో), వనిందు హసరంగ (6: 7 బంతుల్లో) వేగంగా ఆడలేకపోయారు. దీంతో బెంగళూరు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 189 పరుగులకు పరిమితం అయింది. రాజస్తాన్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టారు.రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్‌లకు చెరో వికెట్ దక్కింది.