2024 ఐపీఎల్ సీజన్‌లో ఫస్టాఫ్ అంతా రఫ్పాండించిన జట్టు రాజస్థాన్ రాయల్స్. అసలు వాళ్లను ఓడించటం అంటేనే ఊహకు అందని విషయం అన్నంత స్థాయిలో సాగింది డామినేషన్. ఆడిన మొదటి తొమ్మిది మ్యాచుల్లో కేవలం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ అది కూడా గుజరాత్ టైటాన్స్ మీద ఓడిపోయిన రాజస్థాన్ మిగిలిన 8మ్యాచుల్లోనూ విజయం సాధించి 16పాయింట్లు తెచ్చుకుంది. అందరికంటే ప్లే ఆఫ్స్ బెర్త్‌ను ముందు కన్ఫర్మ్ చేసుకుంటుదిలే అనుకుంటున్న జట్టు ఇక అంతే ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. 


పంజాబ్ మీద పడుతూ లేస్తూ 144పరుగులే చేసిన RR..సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయిన పంజాబ్‌కు మ్యాచ్ సమర్పించుకుంది. ఏదో మిగతా టీమ్స్ అన్నీ పోటాపోటీగా కొట్టుకుంటున్నాయి కాబట్టి అది కలిసొచ్చి ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయిపోయింది రాజస్థాన్. ఫస్టాఫ్ ఓటములు పెద్దగా లేకుండా ఆడటం వల్ల క్వాలిఫైయర్స్‌కి కావాల్సిన పాయింట్స్‌ని సంపాదించుకుంది కానీ లేదంటే లీగ్ అఖరిదశలో ఇలా నాలుగు మ్యాచులు ఓడిపోవటం కచ్చితంగా వాళ్ల ప్లే ఆఫ్స్ మీద ప్రభావం చూపించేదే. 


కెప్టెన్ సంజూశాంసన్ కూడా మ్యాచ్ తర్వాత అదే అన్నాడు. కాస్త ఆగి ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని..ఈ ఓటములకు కారణం ఏంటో విశ్లేషించుకుని కమ్ బ్యాక్ ఇస్తామని అన్నాడు. ఇప్పటికి కూడా రాజస్థాన్ టాప్ 2లో ఉండటం డౌటే. రాజస్థాన్ కంటే మెరుగైన నెట్ రన్ రేట్ ఉన్న హైదరాబాద్‌కు ఇంకా రెండు మ్యాచులు ఉన్నాయి కాబట్టి టాప్ 2 చోటు కోసం ఆరెంజ్ ఆర్మీకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి.


పంజాబ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో 144 పరుగులు చేయడానికే రాజస్థానా రాయల్స్‌ టీం చాలా కష్టపడింది. ఈ మ్యాచ్‌లో ఏడు బంతులు ఉండగానే పంజాబ్ కింగ్స్ విజయాన్ని అందుకుంది. అంతకు ముందు చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. రాజస్థాన్ రాయల్సి టీమ్‌ 20 ఓవర్లలో 141 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన రుత్‌రాజ్‌ టీం ఈజీగా 10 బాల్స్ ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. 


ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమైంది ఆర్‌ఆర్‌ టీం. డీసీ ఇచ్చిన 222 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు  బరిలోకి దిగిన ఆర్‌ఆర్‌ 201 పరుగులు మాత్రమే చేసింది. అంతకు ముందు హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా అదే ఆట తీరుతో బోల్తాపడింది. 201 పరుగులు ఛేదించాల్సి ఉండగా ఒక్క పరుగు చేయలేక ఓటమిపాలైంది.